అది శాడిస్టు ప్రేమే | That is sadish love | Sakshi
Sakshi News home page

అది శాడిస్టు ప్రేమే

Published Thu, Sep 5 2013 3:27 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

That is sadish love

సాక్షి, కరీంనగర్ : తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌పై కుట్ర పన్నుతున్నారని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. శాంతి ర్యాలీ, దీక్షలో పాల్గొనేందుకు కరీంనగర్ వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో విలేకరులతో మాట్లాడారు. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇక్కడి వారసత్వ సంపద విధ్వంసానికి గురవుతుందన్న భయాందోళనలు ఉన్నాయన్నారు.
 
 సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్‌ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఏపీఎన్జీవోల సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతం లో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందని, తాము మొదటి నుంచి చెప్తున్నామని, ఇప్పుడది రుజువైందని వెల్లడించారు.
 
 7న శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఏపీఎన్జీవోల సభ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు తలెత్తినా టీ మంత్రులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అనుమతి ఇవ్వకపోయినా శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. విద్యుత్‌సౌధ, జలసౌధ, భీమాభవన్‌లలో తెలంగాణ ఉద్యోగుల ఆందోళనలను అణచివేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల బట్వాడాపై అపోహలను కేంద్రం పరిష్కరించాలని కోరారు. 371డి నిబంధనను రెండు రాష్ట్రాల్లో కొనసాగిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా అభివర్ణించారు. 42 రోజుల సకల జనుల సమ్మె కాలంలో చంద్రబాబు ఒక్కలేఖ కూడా ఎందుకు రాయలేదని, తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. ప్రధానకార్యదర్శి కె. రవీందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హమీద్, నర్సింహస్వామి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement