సాక్షిప్రతినిధి, అనంతపురం : సాధారణ బడ్జెట్‌లో చేయిచ్చారు... కనీసం వ్యవసాయ బడ్జెట్‌లోనైనా కరువు జిల్లాను కనికరిస్తారని ఆశపడిన జిల్లా రైతులకు నిరాశే ఎదురైంది. దాదులూరు వద్ద గోరుచిక్కుడు ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు మినహా ‘అనంత’ రైతన్నను చంద్రబాబు సర్కారు పూర్తిగా విస్మరించింది.
‘అనంత’లో నెలకొన్న తీవ్ర కరువు, నిత్యం రైతుల ఆత్మహత్యలు నేపధ్యంలో జిల్లాను ప్రత్యేకంగా పరిగణించి కరువు రైతుకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం బాధాకరం. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు 2015-16 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం జిల్లాలో తాండవిస్తున్న కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా ఇందులో చేయలేదు.
ఈ హామీలన్నీ ఏమయ్యాయి ‘బాబు’
చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావించిన ఏడు మిషన్లలో వ్యవసాయమిషన్‌ను 2014 అక్టోబరు 6న కళ్యాణదుర్గంలో మాజీరాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా ప్రారంభించారు. కరువు భయపడేలా జిల్లాను అభివృద్ధి చేస్తానని, అనంతపురాన్ని ఆదుకునే బాధ్యత తనది అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనగానపల్లి మండలంలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామన్నారు.
నంబూలపూలకుంట మండలంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బుక్కరాయసముద్రం మండలంలో నూనెగింజల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. వీటన్నిటికీ అబ్దుల్‌కలాం చేతుల మీదుగా శిలాఫలకాలు కూడా ఆవిష్కరించారు. అయితే ఇందులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్‌ప్లాంటుకు మాత్రమే బడ్జెట్‌లో చోటు కల్పించారు. 8 కోట్లతో ప్లాంటును చేపడతామని, తొలవిడత 3కోట్ల రూపాయలు విడుదల చేస్తామని మంత్రి పత్తిపాటి ప్రకటించారు. తక్కిన ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. దీంతో తనేదైనా శంకుస్థాపనలతోనే సరిపెడతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నట్లు అయింది.
వందశాతం సబ్సిడీతో డ్రిప్ ఎక్కడ?:
డ్రిప్, స్ప్రింక్లర్లను వందశాతం సబ్సిడీతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు అందిస్తామని చంద్రబాబు కళ్యాణదుర్గంలో ప్రకటించారు. అసెంబ్లీలో కూడా పలుసార్లు చెప్పారు. అయితే బడ్జెట్‌లో మాత్రం వందశాతం డ్రిప్ ప్రస్తావనే లేదు. వైఎస్ హాయాంలో వందశాతం సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకు, 90శాతం సబ్సిడీతో ఇతరులకు ఇచ్చేవారు. కనీసం 10 శాతం సబ్సిడీని ‘అనంత’ రైతుల కోసం చంద్రబాబు సర్కారు భరించలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా బిందు, తుంపర సేద్యం కోసం 144.07 కోట్లు మాత్రమే ప్రకటించింది. దీన్నివల్ల జిల్లాకు కొత్తగా చేకూరే మేలు లేదు.
ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రస్తావన ఏదీ?:
హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీని ప్రకటించారు. అయితే జిల్లాకు 2013-14 సంవత్సరానికి రావాల్సిన రూ.643 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించలేదు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌కొరత కూడా లేదు. అయినా 7గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు.
ఆదర్శరైతుల స్థానంలో ఎంపీఈఓలు:
ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించిన చంద్రబాబు, ఆస్థానంలో ఎంపీఈఓలను ప్రవేశపెట్టనున్నారు. టీ డీపీ కార్యకర్తలను ఎంపీఈఓలుగా నియమించేందుకే చంద్రబాబు ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 6,354 మంది ఎంపీఈఓలను నియమిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో జిల్లాకు సంబంధించి 1019 మంది నియామకం కానున్నారు. అలాగే పంటనష్టపోయిన ఉద్యానరైతులకు ఎకరాకు రూ.10వేల మాత్రమే పరిహారం ఇస్తామన్నారు. మొత్తం మీద ఒక చిన్న ప్రాసెసింగ్ ప్లాంటు మినహా జిల్లాకు ఎలాంటి మేలు వ్యవసాయబడ్జెట్ చేయలేకపోయింది.
ఇదీ అంతే!
Published Sat, Mar 14 2015 2:51 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement