Processing plant
-
రొయ్య రైతుల ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: ఏపీలో 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో రూ.210. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లిస్తున్న ధర రూ.245. ఇదే కౌంట్ రొయ్యలను గుజరాత్, తమిళనాడులో రూ.230కు కొనుగోలు చేస్తుండగా.. ఒడిశాలో రూ.210కు మించి కొనడం లేదు. 30 కౌంట్ రొయ్యలకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.380 కాగా.. ప్రాసెసింగ్ ఆపరేటర్లు కొనుగోలు చేస్తున్న ధర రూ.470. ఇదే కౌంట్ రొయ్యలను ఒడిశాలో రూ.370, గుజరాత్లో రూ.380, తమిళనాడులో రూ.430కు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో దక్కుతున్న గిట్టుబాటు ధర దేశంలో మరే రాష్ట్రంలోనూ రొయ్యల రైతులకు దక్కడం లేదు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్వా రైతులే చెబుతున్నారు. ఫలించిన ప్రభుత్వ చర్యలు ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు విస్తీర్ణంలో చెరువులు కలిగిన ప్రతి రైతుకూ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తూ.. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. సంక్షోభ సమయంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ ప్రతి నెలా సమావేశమవుతూ రైతులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధరలను సమీక్షిస్తూ ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తోంది. మరోవైపు అప్సడా ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో పాటు ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా ధరలు పతనమైన సందర్భంలో కూడా స్థానికంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్ని విధాలుగా భరోసా లభిస్తోంది. మంచి ధర వస్తోంది ఆక్వా రైతులకు మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. గడచిన ఐదేళ్లలో ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. – వత్సవాయి లక్ష్మీకుమార్రాజా, ఆక్వా రైతు, అరిపిరాల, కృష్ణా జిల్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 10 రోజులకు ఒకసారి రొయ్యల ధరలను సమీక్షిస్తున్నాం. మార్కెట్లో హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర రైతులకు దక్కేలా చూస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు ఉపసంహరింపజేశాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం. – వడ్డి రఘురామ్, కో–వైస్ చైర్మన్, అప్సడా -
ప్రకృతి ఉత్పత్తులకు ప్రీమియం ధరలు
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ నిమిత్తం టీటీడీకి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 10 రకాల ఉత్పత్తుల్ని సరఫరా చేసేందుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 1,784 టన్నుల శనగలు, బెల్లం సరఫరా చేయగా.. ఈ సీజన్ నుంచి బియ్యంతో పాటు కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతోంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కంటే 10–15 శాతం అదనపు ధరతో రైతుల నుంచి సేకరించి సరఫరా చేయబోతున్నారు. మార్కెట్ ధర ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనంగా.. ఎమ్మెస్పీ కంటే మార్కెట్ ధర ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ ధర కంటే 15 శాతం అదనంగా ప్రీమియం ధర చెల్లించేలా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను సీఎం యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రీమియం ధర చెల్లించి పంట ఉత్పత్తులను సేకరిస్తున్నారు. శనగలు క్వింటాల్‌కు కనీస మద్దతు ధర 2021–22 సీజన్లో రూ.5,230 ఉండగా.. రైతుల నుంచి రూ.5,753 చొప్పున చెల్లించి సేకరించారు. 2022–23 సీజన్లో కనీస మద్దతు ధర రూ.5,335 కాగా, రైతులకు రూ.5,868 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. బెల్లం మార్కెట్ ధర క్వింటాల్ రూ.5,250 కాగా.. రైతుల నుంచి రూ.6,037 చొప్పున ప్రీమియం ధర చెల్లించి సేకరించారు. రూ.5 కోట్లతో నంద్యాలలో దాల్ మిల్ ఆర్బీకేల ద్వారా సేకరించిన పంట ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్థారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. నిర్ధేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రసాయన అవశేషాలు లేని ఫైన్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ)ఉత్పత్తులని నిర్థారించుకున్న తర్వాతే ప్రాసెస్ చేసి టీటీడీకి సరఫరా చేస్తారు. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను సొంతంగా ప్రాసెస్ చేసి సరఫరా చేసేందుకు నంద్యాలలో రూ.5 కోట్ల అంచనాతో దాల్ మిల్లును ఏర్పాటు చేస్తున్నారు. బియ్యం, పప్పులు కూడా సేకరిస్తాం టీటీడీకి గడచిన రెండు సీజన్లలో శనగలు, బెల్లం సరఫరా చేశాం. ప్రస్తుత సీజన్ నుంచి శనగలు, బెల్లంతోపాటు సోనా మసూరి (స్లేండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, కందులు, పెసలు, మినుములు, పసుపు, వేరుశనగ, ఆవాలు, కొత్తిమీర సరఫరా చేయబోతున్నాం. – రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
ఎర్రనేలల్లో పసిడి పంట
తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు. ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
జీడిపై చీడ రాతలు! ఎందుకో రామోజీ గుండెలు బాదుకుంటున్నాడు!!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీడి తోటల విస్తీర్ణాన్ని చూసినా.. దిగుబడులైనా.. ఎగుమతులైనా గత సర్కారు హయాంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపయ్యాయి. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు ఏకంగా 17 వేల ఎకరాలకుపైగా జీడి తోటలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక తితిలీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర రైతుల నోట్లో మట్టిగొట్టిన చంద్రబాబు నిర్వాకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ అన్నదాతలను ఆదుకుంటూ గత సర్కారు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని చెల్లించిందీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. ప్రపంచాన్ని ముంచెత్తుతున్న వియత్నాం జీడి గింజల దిగుమతులను అరికట్టడం సాధ్యం కాకున్నా ప్రాసెసింగ్‌లో 50 శాతం మాత్రమే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో 80 శాతం దిగుమతి చేసుకున్న గింజలను వినియోగిస్తే కిమ్మనని ఈనాడు రామోజీ ఇప్పుడు మాత్రం అన్యాయం జరిగిపోతోంది..! బాబోయ్ దిగుమతులు పెరిగాయ్..! ప్రాసెసింగ్ యూనిట్లు మూతబడ్డాయని గుండెలు బాదుకుంటూ తప్పుడు కథనాలకు తెగబడ్డారు!! ‘ఈనాడు’ ఆరోపణ: దిగుబడులు లేక నష్టాల బారిన రైతులు.. వాస్తవం: 2018 –19లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాల్లో జీడితోటలు ఉండగా ఈ విస్తీర్ణం ప్రస్తుతం 3.35 లక్షల ఎకరాలకు పెరిగింది. నాలుగేళ్లలో 35 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. టీడీపీ హయాంలో రూ.6.92 కోట్లతో 8,648 ఎకరాల్లో తోటలను పునరుద్ధరిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.13.64 కోట్లతో 17,125 ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించడమే కాకుండా రూ.8.30 కోట్లతో 35 వేల ఎకరాల్లో కొత్త తోటలను విస్తరించింది. ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తోటబడుల వల్ల ఉత్పత్తి సగటున 800 కిలోల నుంచి 1,150 కిలోలకు పెరిగింది. ఫలితంగా దిగుబడులు 1.23 లక్షల టన్నుల నుంచి 1.67 లక్షల టన్నులకు పెరిగాయి. చంద్రబాబు జమానాలో రూ.701.69 కోట్ల విలువైన 12,356 టన్నుల జీడిపప్పు ఎగుమతి కాగా ఇప్పుడు నాలుగేళ్లలో రూ.1,718.85 కోట్ల విలువైన 29,399 టన్నులు ఎగుమతి అయ్యాయి. నాలుగేళ్లలో ఎగుమతులు ఏకంగా 17 వేల టన్నులకు పైగా పెరిగాయి. సాధారణంగా జీడి పిక్కల కోత మే నెల కల్లా పూర్తయిపోతుంది. ప్రస్తుతం రైతుల వద్ద పది శాతం కూడా పంట లేదు. అలాంటప్పుడు రైతుకు నష్టం ఏ విధంగా జరుగుతుందో రామోజీకే తెలియాలి. ఆరోపణ: జీడి రైతుల సంక్షేమాన్ని విస్మరించారు వాస్తవం: 2018–19లో తితిలీ తుపాన్ కారణంగా జీడి తోటలు పెద్ద ఎత్తున దెబ్బతింటే చంద్రబాబు కేవలం 70 వేల మంది రైతులకు రూ.68.18 కోట్ల పరిహారం విదిల్చారు. 1,38,458 మంది రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.87.29 కోట్ల పరిహారాన్ని సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అందజేసి రైతులను ఆదుకున్నారు. తుపాన్‌తో నష్టపోయిన ప్రాంతాల్లో 21,250 ఎకరాల్లో తోటల పునరుద్ధరణ, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆరోపణ: జీడిపప్పు ధరల పతనంతో నష్టాలు వాస్తవం: రాష్ట్రంలో ఉత్పతయ్యే జీడిపప్పు మొదటి రకంæ కిలో రూ.800, రెండో రకం కిలో రూ.600 ఉంటుంది. అయితే మన జీడిపప్పు ధర వెనుక అసలు కారణాలకు ‘ఈనాడు’ ముసుగేసింది. ప్రపంచంలో అత్యధికంగా జీడిపప్పు ఉత్పత్తి చేసే వియత్నాం నుంచి యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఆ దేశాల్లో నిల్వలు ఎక్కువ కావడంతో వియత్నాం నుంచి దిగుమతులను నిలిపివేశాయి. దీంతో ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీగా దిగుమతి అవుతున్న వియత్నాం జీడిపప్పు స్థానిక మార్కెట్లో మొదటి రకం కిలో రూ.600, రెండో రకం రూ.450లకే లభిస్తోంది. గత పదేళ్లుగా ముడి గింజలు కిలో రూ.80 నుంచి రూ.120 మ«ధ్య ఉండగా ఈనాడు మాత్రం రూ.140 – రూ.150 మధ్య ఉండేవంటూ మరో అబద్ధాన్ని అచ్చేసింది. ఆరోపణ: జీడి పరిశ్రమకు చేయూత ఏదీ? వాస్తవం: జీడిమామిడి రైతుల సంక్షేమం, నాణ్యమైన జీడి ఉత్పత్తి కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధానంగా నాణ్యమైన మొక్కలతో జీడి విస్తీర్ణ పథకం, జీడి తోటలకు బిందు సేద్యం, పాత జీడితోటల పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు. సాగు మెళకువలను నేర్పించడం ద్వారా జీడి పంట నాణ్యత పెంచేలా తోటబడి కార్యక్రమం ద్వారా 418 ప్రదర్శన క్షేత్రాలు నిర్వహించారు. పలాసను జీడిపప్పు ప్రాసెసింగ్ క్లస్టర్‌గా అభివృద్ధి చేశారు. బొబ్బిలి, అనకాపల్లిలోని ప్రభుత్వ ఉద్యానవన క్షేత్రాలతో పాటు బాపట్లలోని జీడిపప్పు పరిశోధనా కేంద్రంలో 4.5 లక్షలకు పైగా అంటుకట్టిన జీడి మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఆరోపణ: కొత్త యూనిట్లకు ప్రోత్సాహమేది? వాస్తవం: ప్రాసెసింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేలా ఆధునికీకరణకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం సబ్సిడీపై రూ.4 లక్షల అంచనాతో ప్యాక్ హౌస్‌లు, కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రూ.25 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఇందులో రూ.10 లక్షలు సబ్సిడీగా అందిస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6 లక్షల సబ్సిడీతో రూ.15 లక్షల వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. తొలిసారిగా జీడిపిక్కల నిల్వ కోసం రూ.1.69 కోట్లు వెచ్చించి 15 కలెక్షన్ సెంటర్లను నెలకొల్పారు. రూ.2.79 కోట్లతో రైతులకు బిందు సేద్యం పరికరాలను సమకూర్చారు. జీడిపప్పు కెర్నల్ ఆయిల్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. మెరుగైన విలువ జోడింపు, అధిక ఆదాయం కోసం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో పీపీపీ ప్రాజెక్టుల కింద జీడిపప్పులో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆరోపణ: నష్టాలు భరించలేక 500 పరిశ్రమలు మూసివేత వాస్తవం: ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి ఉండదు. రాష్ట్రంలో 402 ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. ఇవి సంవత్సరానికి 79,140 టన్నుల సామర్థ్యంతో 1.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో మెజార్టీ యూనిట్లు ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల చేస్తాయి. కొన్ని యూనిట్లు ఉత్పత్తిని తగ్గిస్తాయి. అంతేకానీ రాష్ట్రంలో శాశ్వతంగా మూతపడిన పరిశ్రమ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. పైగా రాష్ట్రంలో ఉన్నవే 402 పరిశ్రమలైతే 500 పరిశ్రమలు ఎలా మూతపడ్డాయో ఈనాడుకే తెలియాలి. -
నూజివీడులో మామిడి పౌడర్ యూనిట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్‌పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. మార్కెట్ యార్డ్‌లో ప్రాసెసింగ్ యూనిట్ ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్‌లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజిస్ట్రేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్‌ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిటŒæ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు -
విజయవాడ, విశాఖలో అమూల్ యూనిట్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో విజయవాడ, విశాఖపట్నంలో అమూల్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనుందని ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. ఇప్పటికే మదనపల్లిలో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అక్కడే పాలు ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి విక్రయిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన మహిళలు అమూల్‌లో భాగస్వామ్యం అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. సీఎం జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలో పాడి రంగం ప్రాధాన్యతను గుర్తించారని చెప్పారు. అమూల్ రైతుల సంస్థ అని, దీనికి 75 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గుజరాత్లో 36 లక్షలు, రాష్ట్రం వెలుపల మరో 7 లక్షల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రెండూ సమ ఉజ్జీలుగా ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజూ దాదాపు 4.25 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా, గుజరాత్లో కూడా అదే స్థాయిలో పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. గుజరాత్‌లోని పాడి పశువుల్లో 60 శాతం గేదెలు, 40 శాతం ఆవులు ఉండగా, ఇక్కడా దాదాపు అదే విధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాల సేకరణలో సంఘటిత రంగం పాత్ర 26 శాతం మాత్రమే ఉందని తెలిసిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ ► అమూల్ సంస్థ గుజరాత్లో రోజూ 2.5 కోట్ల లీటర్లు, రాష్ట్రం వెలుపల మరో 50 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిగా పాలు సేకరిస్తున్నాం. రోజుకు దాదాపు లక్ష లీటర్ల పాలు ఇక్కడ అమూల్ సేకరిస్తోంది. ► అయితే ఇక్కడ (రాష్ట్రంలో) పాల ప్రాసెసింగ్‌కు తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అమూల్ ఇప్పటికే మదనపల్లిలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో వచ్చే నెలలో ఆ యూనిట్లు ప్రారంభం అవుతాయి. అప్పుడు పాలు ప్రాసెస్ చేసి, ప్యాక్ చేసి విక్రయిస్తాం. ► అమూల్ సంస్థలో అటు ప్రభుత్వం కానీ, ఇటు బహుళజాతి సంస్థ కానీ, పారిశ్రామికవేత్త కానీ లేడు. ఇది కేవలం రైతులే యాజమాన్యంగా ఉన్న సంస్థ. నేను పాడి రంగంలో నిపుణుడిని. 40 ఏళ్లుగా సంస్థలో పని చేస్తున్నాను. మిగతా వారంతా రైతులే. ► సంస్థలో అత్యంత పనితీరు చూపుతున్న మూడు పాడి రైతుల సహకార సంఘాలను (కైరా యూనియన్, సబర్కాంత యూనియన్, బనస్కాంత యూనియన్) రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు పంపించాం. తద్వారా రానున్న రోజుల్లో పాల సేకరణ మరింత పెరుగుతుంది. పాలు, పౌష్టికాహారం సరఫరా ► గుజరాత్లో అమూల్ సంస్థ గత 15 ఏళ్లుగా ప్రతి రోజూ అంగన్వాడీలు, స్కూళ్లలో దాదాపు 25 లక్షల మంది పిల్లలకు తాజా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తోంది. సమీపంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి చల్లటి తాజా ఫ్లేవర్డ్ పాలను పిల్లలకు సరఫరా చేస్తున్నాము. ► ఇదే రీతిలో రాష్ట్రంలో కూడా ప్రాసెసింగ్ యూనిట్లకు చేరువలో ఉన్న గ్రామాల్లో అదే విధంగా ఫ్లేవర్డ్ పాలు సరఫరా చేస్తాం. గుజరాత్‌లోని అంగన్వాడీల పిల్లలకు గత 4 ఏళ్లుగా పౌష్టికాహారం అందజేస్తున్నాము. ఇందుకోసం మూడు ప్లాంట్లు ఏర్పాటు చేసి, 15 వేల టన్నుల పౌష్టికాహారం సరఫరా చేస్తున్నాం. ► అదే కోవలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సబర్కాంత పాడి సహకార సంఘం ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి, పిల్లలకు అత్యంత నాణ్యతతో కూడిన పౌష్టికాహారం సరఫరా చేస్తుంది. పాల సేకరణ మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టుల్లో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాపై ఉంచిన నమ్మకం ఎక్కడా వమ్ము కాకుండా చూస్తాం. రాష్ట్రంలో పాడి ఒక బలమైన ఉపాధి రంగంగా ఎదుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. ► ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు అదనపు ఆదాయం రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తే అందులో సగం గృహ వినియోగదారులు వాడుతున్నారు. మిగతా పాలలో కేవలం 26 శాతం మాత్రం ఆర్గనైజ్డ్ సెక్టార్లో అమ్ముడవుతుండగా, మిగిలినవి అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోకి వెళ్తున్నాయి. మధ్యవర్తులు, దళారీల కారణంగా డెయిరీ రైతులు మోసపోతున్నారు. ఈ క్రమంలో సీఎం ఆలోచన మేరకు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. తద్వారా ప్రతి పాడి రైతుకు అమూల్ ద్వారా అదనపు ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా పాల సేకరణ ప్రారంభిస్తాం. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి పాడి రైతుల్లో ఆనందం అమూల్‌తో ఒప్పందంతో పాడి రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లలందరికీ పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో సీఎం వినూత్న మార్పులు తీసుకొచ్చారు. ఎవరూ రక్తహీనతతో బాధపడకూడదని వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి బాలామృతం, కర్ణాటక నుంచి మిల్క్ తెప్పించుకుంటున్నాం. ఇప్పుడు అమూల్ భాగస్వామ్యంతో ఆ సమస్యలు తీరుతాయి. – తానేటి వనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మహిళల డెయిరీ అని గర్వంగా ఉంది గతంలో ప్రేవేట్ డెయిరీలో పాలు పోసి చాలా నష్టపోయాం. ఇప్పుడు అమూల్ డెయిరీలో పాలు పోయగానే.. అన్ని వివరాలతో మెసేజ్ వస్తోంది. ఇది మా మహిళల డెయిరీ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు దాణా కూడా ఇస్తున్నారు. గతంలో ఏమీ ఇవ్వలేదు. ఇప్పడు బోనస్ కూడా వస్తుంది. మేం వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాం. మీ (సీఎం) సహకారంతో ఇంకా పాడి పశువులు పెంచుకుని మరింత వృద్ధి చెందుతాం. – అనసూయమ్మ, కఠారుపల్లి, గాండ్లపెంట మండలం, అనంతపురం జిల్లా జగనన్నా.. మీ మేలు మరువలేం మాకు ఆరు ఆవులకు గాను మూడు ఆవులు పాలు ఇస్తున్నాయి. గతంలో ప్రేవేట్ డెయిరీలకు పాలు పోస్తే తక్కువ డబ్బులు ఇచ్చే వారు. ఇప్పడు అమూల్ డెయిరీ వల్ల ఎక్కువ డబ్బు వస్తుంది. ఇన్నాళ్లూ ప్రైవేట్ డెయిరీల వల్ల ఇంత మోసపోయామా అనుకున్నాం. జగనన్నా.. మీరు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేం. ఎప్పటికీ మీ పాలనే కావాలి. పది కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. – రత్నమ్మ, కాలసముద్రం, కదిరి మండలం, అనంతపురం జిల్లా -
కెఫే నిలోఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిలోఫర్ చాయ్.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్ గరమ్ చాయ్ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్‌ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న ఏబీఆర్ కెఫే అండ్ బేకర్స్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. అత్యాధునిక యంత్రాలతో.. తయారీ కేంద్రం కోసం శంషాబాద్ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్ యూనిట్ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్ యూనిట్ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాదే నాల్గవ కేంద్రం.. హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్‌కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రీమియం లాంజ్ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్‌లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం. మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు. రెండేళ్లలో తెలంగాణలో.. టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్లైన్ వాటా 20 శాతం ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే చాయ్ సైతం ప్రత్యేక బాక్స్ ద్వారా హైదరాబాద్‌లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు. -
ఇక గుంటూరు బ్రాండ్ కారం
సాక్షి, అమరావతి: కారం అంటేనే గుంటూరు..! నాణ్యమైన మిర్చికి నగరమే చిరునామా.. ఇక అదే పేరుతో మార్కెట్లోకి కారాన్ని వదిలితే విక్రయాలకు తిరుగుంటుందా? గుంటూరు మిర్చి పవర్ అలాంటిది మరి! గుంటూరు మార్కెట్ కమిటీ తాజాగా ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశిస్తోంది. గుంటూరు మిర్చికున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదే బ్రాండ్‌తో కారం తయారీ, అమ్మకాలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన ఎండుమిరప కాయలను ప్రాసెస్ చేసి కారం విక్రయాలు చేపడతారు. ఇప్పటికే మిర్చి నాణ్యతను నిర్థారించే యాంత్రిక పరికరాలను సమకూర్చుకోగా మార్కెట్ స్పందనను పరిశీలించి గుంటూరు మిర్చి యార్డు, పల్నాడు మార్కెట్ కమిటీల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించనున్నారు. దేశ విదేశాలకు గుంటూరు ఘాటు.. ఘాటుగా ఉండే గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. గుంటూరు మిర్చి యార్డులో ఏటా రూ.6 వేల కోట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్ తదితర దేశాలకు రూ.2,000 కోట్ల మేర మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. ఎండుమిరప ప్రాసెసింగ్ ద్వారా రైతులకు అధిక ధరలతో పాటు మార్కెట్ కమిటీకి ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసురత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కారం తయారీ, విక్రయాలపై నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో మిల్లులను అద్దెకు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలోపు కారం తయారీకి చర్యలు తీసుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ బ్రాండ్ మార్కెప్ పేరుతో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్రలో మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంటలను ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉప ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నాయి. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభించడంతోపాటు కమిటీలు రైతులకు అధిక ధరలను ఇవ్వగలుగుతున్నాయి. ఇదే తరహాలో గుంటూరు మార్కెట్ కమిటీ కారం తయారీతో ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించనుంది. -
ఇదీ అంతే!
సాక్షిప్రతినిధి, అనంతపురం : సాధారణ బడ్జెట్లో చేయిచ్చారు... కనీసం వ్యవసాయ బడ్జెట్లోనైనా కరువు జిల్లాను కనికరిస్తారని ఆశపడిన జిల్లా రైతులకు నిరాశే ఎదురైంది. దాదులూరు వద్ద గోరుచిక్కుడు ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు మినహా ‘అనంత’ రైతన్నను చంద్రబాబు సర్కారు పూర్తిగా విస్మరించింది. ‘అనంత’లో నెలకొన్న తీవ్ర కరువు, నిత్యం రైతుల ఆత్మహత్యలు నేపధ్యంలో జిల్లాను ప్రత్యేకంగా పరిగణించి కరువు రైతుకు బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం బాధాకరం. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు 2015-16 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం జిల్లాలో తాండవిస్తున్న కరువు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా ఇందులో చేయలేదు. ఈ హామీలన్నీ ఏమయ్యాయి ‘బాబు’ చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావించిన ఏడు మిషన్లలో వ్యవసాయమిషన్ను 2014 అక్టోబరు 6న కళ్యాణదుర్గంలో మాజీరాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతులమీదుగా ప్రారంభించారు. కరువు భయపడేలా జిల్లాను అభివృద్ధి చేస్తానని, అనంతపురాన్ని ఆదుకునే బాధ్యత తనది అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కనగానపల్లి మండలంలో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తామన్నారు. నంబూలపూలకుంట మండలంలో వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బుక్కరాయసముద్రం మండలంలో నూనెగింజల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. వీటన్నిటికీ అబ్దుల్‌కలాం చేతుల మీదుగా శిలాఫలకాలు కూడా ఆవిష్కరించారు. అయితే ఇందులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ప్లాంటుకు మాత్రమే బడ్జెట్లో చోటు కల్పించారు. 8 కోట్లతో ప్లాంటును చేపడతామని, తొలవిడత 3కోట్ల రూపాయలు విడుదల చేస్తామని మంత్రి పత్తిపాటి ప్రకటించారు. తక్కిన ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. దీంతో తనేదైనా శంకుస్థాపనలతోనే సరిపెడతానని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నట్లు అయింది. వందశాతం సబ్సిడీతో డ్రిప్ ఎక్కడ?: డ్రిప్, స్ప్రింక్లర్లను వందశాతం సబ్సిడీతో జిల్లాలోని ప్రతీ ఎకరాకు అందిస్తామని చంద్రబాబు కళ్యాణదుర్గంలో ప్రకటించారు. అసెంబ్లీలో కూడా పలుసార్లు చెప్పారు. అయితే బడ్జెట్లో మాత్రం వందశాతం డ్రిప్ ప్రస్తావనే లేదు. వైఎస్ హాయాంలో వందశాతం సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకు, 90శాతం సబ్సిడీతో ఇతరులకు ఇచ్చేవారు. కనీసం 10 శాతం సబ్సిడీని ‘అనంత’ రైతుల కోసం చంద్రబాబు సర్కారు భరించలేకపోయింది. రాష్ట్రవ్యాప్తంగా బిందు, తుంపర సేద్యం కోసం 144.07 కోట్లు మాత్రమే ప్రకటించింది. దీన్నివల్ల జిల్లాకు కొత్తగా చేకూరే మేలు లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రస్తావన ఏదీ?: హుద్‌హుద్ తుపాన్ దెబ్బకు పంటనష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీని ప్రకటించారు. అయితే జిల్లాకు 2013-14 సంవత్సరానికి రావాల్సిన రూ.643 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించలేదు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్‌కొరత కూడా లేదు. అయినా 7గంటలు మాత్రమే కరెంటు సరఫరా చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. ఆదర్శరైతుల స్థానంలో ఎంపీఈఓలు: ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించిన చంద్రబాబు, ఆస్థానంలో ఎంపీఈఓలను ప్రవేశపెట్టనున్నారు. టీ డీపీ కార్యకర్తలను ఎంపీఈఓలుగా నియమించేందుకే చంద్రబాబు ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 6,354 మంది ఎంపీఈఓలను నియమిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందులో జిల్లాకు సంబంధించి 1019 మంది నియామకం కానున్నారు. అలాగే పంటనష్టపోయిన ఉద్యానరైతులకు ఎకరాకు రూ.10వేల మాత్రమే పరిహారం ఇస్తామన్నారు. మొత్తం మీద ఒక చిన్న ప్రాసెసింగ్ ప్లాంటు మినహా జిల్లాకు ఎలాంటి మేలు వ్యవసాయబడ్జెట్ చేయలేకపోయింది. -
‘కోస్టల్ గోల్డ్’ నుంచి విషవాయువులు
ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: మండలంలోని ధర్మవరం వద్ద ఉన్న కోస్టల్ గోల్డ్‌రొయ్యల పరిశ్రమ నుంచి గురువారం విడుదలయిన విషవాయువుల కారణం గా 11మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడం తో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ పరిశ్రమలో ఒడిశాతోపాటు విశాఖ, విజయనగరం, కాకినాడ, ఒంగోలు ప్రాంతాల నుంచి రొయ్యలను తీసుకువచ్చి ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది మహి ళా కార్మికులు పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కార్మికులు విధుల్లో ఉండగా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఘాటైన వాయువులు విడుదలయ్యాయి. విధుల్లో ఉన్న కార్మికులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. నక్కపల్లి మండలం డి.ఎల్.పురం, బుచ్చిరాజుపేట, రాజయ్యపేట గ్రామాలకు చెందిన గంపల గంగ, జి.రమాదేవి, జి.సువర్ణ, బొంది మణి, గరికిన రత్నం, గరికిన భవానీ, యజ్జల అపర్ణ, సారిపల్లి రాము, కోడ నూకరత్నం, పైడికొండ జ్యోతి, ఎస్.రాయవరం మండలం ఉప్పరాపల్లికి చెందిన కోన వరలక్ష్మి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వారి శరీరంపై దద్దుర్లు వచ్చాయి. బాధితులను నక్కపల్లి 30పడకల ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చెందిన సారిపల్లి రామును ఎకాయెకిన విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పరిశ్రమలో విషవాయువులు పీల్చడమే ఇందుకు కారణమని అక్కడి వైద్యులు తెలిపారు పరిశ్రమను ఎస్.రాయవరం తహశీల్దార్ బాబుసుందరం పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే దీనిపై యాజమాన్యాన్ని హెచ్చరించామని తహశీల్దార్ విలేకరులకు తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు నివేదిక పంపుతామన్నారు. దీనిపై ఎస్.రాయవరం పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు.