తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి
దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు.
ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment