దేశంలో మరెక్కడా లేని రీతిలో ఏపీ రైతులకు దక్కుతున్న ధరలు
వంద కౌంట్ రొయ్యలకు నిర్దేశించిన ధర రూ.210
కొనుగోలు చేస్తున్న ధర రూ.245
గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో రూ.230, ఒడిశాలో రూ.210
30 కౌంట్‌కు నిర్దేశించినది రూ.380
కొనుగోలు చేస్తున్న ధర రూ.470
ఒడిశాలో రూ.370, గుజరాత్‌లో రూ.380, తమిళనాడులో రూ.430
సాక్షి, అమరావతి: ఏపీలో 100 కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం నిర్దేశించిన ధర కిలో రూ.210. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రాసెసింగ్ యూనిట్లు చెల్లిస్తున్న ధర రూ.245. ఇదే కౌంట్ రొయ్యలను గుజరాత్, తమిళనాడులో రూ.230కు కొనుగోలు చేస్తుండగా.. ఒడిశాలో రూ.210కు మించి కొనడం లేదు.
30 కౌంట్ రొయ్యలకు ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.380 కాగా.. ప్రాసెసింగ్ ఆపరేటర్లు కొనుగోలు చేస్తున్న ధర రూ.470. ఇదే కౌంట్ రొయ్యలను ఒడిశాలో రూ.370, గుజరాత్‌లో రూ.380, తమిళనాడులో రూ.430కు కొనుగోలు చేస్తున్నారు. ఏపీలో దక్కుతున్న గిట్టుబాటు ధర దేశంలో మరే రాష్ట్రంలోనూ రొయ్యల రైతులకు దక్కడం లేదు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కృషే ఇందుకు ప్రధాన కారణమని ఆక్వా రైతులే చెబుతున్నారు.
ఫలించిన ప్రభుత్వ చర్యలు
ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు విస్తీర్ణంలో చెరువులు కలిగిన ప్రతి రైతుకూ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందిస్తూ.. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర కల్పన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
సంక్షోభ సమయంలో ఏ ఒక్క రైతు ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అప్సడా కో–వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్‌తో ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ ప్రతి నెలా సమావేశమవుతూ రైతులకు ఏ మాత్రం నష్టం కలుగకుండా క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు, మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్న ధరలను సమీక్షిస్తూ ప్రతి రైతుకు మద్దతు ధర దక్కేలా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తోంది.
మరోవైపు అప్సడా ఆధ్వర్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులతో పాటు ప్రాసెసింగ్ ఆపరేటర్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా ధరలు పతనమైన సందర్భంలో కూడా స్థానికంగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వం అండగా నిలుస్తుండడంతో రాష్ట్రంలో ఆక్వా రైతులకు అన్ని విధాలుగా భరోసా లభిస్తోంది.
మంచి ధర వస్తోంది
ఆక్వా రైతులకు మంచి ధర లభిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది. గడచిన ఐదేళ్లలో ఆక్వా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలిచింది. – వత్సవాయి లక్ష్మీకుమార్‌రాజా, ఆక్వా రైతు, అరిపిరాల, కృష్ణా జిల్లా
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి 10 రోజులకు ఒకసారి రొయ్యల ధరలను సమీక్షిస్తున్నాం. మార్కెట్‌లో హెచ్చుతగ్గులను గమనిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర రైతులకు దక్కేలా చూస్తున్నాం. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా నిలిచింది. మూడుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు ఉపసంహరింపజేశాం. నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నాం. – వడ్డి రఘురామ్, కో–వైస్ చైర్మన్, అప్సడా
Comments
Please login to add a commentAdd a comment