- బీ ఫారం మాత్రమే ఇస్తాం.. డబ్బులడగొద్దు
- ఆశావహులకు రఘువీరా, చిరంజీవి సంకేతాలు
సాక్షి, తిరుపతి: శాసనసభ, లోకసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు మాత్రమే ఇస్తామని నిధులు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి స్పష్టం చేసినట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వెతుకులాట మొదలు పెట్టింది. జిల్లా పరిధిలోని తిరుపతి లోకసభ మినహా మిగిలిన 14 అసెంబ్లీ, చిత్తూరు, రాజంపేట లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డికి అప్పగించారు.
ఆ మేరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి చిరంజీవి వేణుగోపాల్‌రెడ్డికి సూచిం చినట్లు విశ్వసనీయ సమాచారం. బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరుపతికి వచ్చిన వారు నగర శివార్లలోని ఒక హోటల్లో వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై కొద్ది సేపు చర్చించారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అయినా పనిచేయక తప్పదని ఉద్బోధించారు.
ముందుగా ఆయా స్థానాలకు బలమైన అభ్యర్థులను గుర్తించాలని సూచించారు. దాంతో పాటు అన్ని స్థానాలకు టికెట్లు ఆశించే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించవలసిందిగా స్పష్టం చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తుందనే ప్రచారం తీసుకొచ్చారని, అటువంటిదేమీ ఉండదని ఆశావహులకు స్పష్టం చేయాలని కూడా వారు కుండబద్దలు కొట్టారు.
ఒకప్పుడు టికెట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడతామంటూ ముందుకొచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఇప్పుడు రఘువీరా, చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తేటతెల్లమౌతోంది. తిరుపతికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్‌ను ఆశిస్తూ రఘువీరాతో భేటీ అయినప్పుడు కూడా నిధుల విషయం చర్చకు వచ్చినట్లు తెల్సింది. వారితో కూడా నిధుల విషయంలో పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పోటీ చేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని మాత్రమే భరోసా ఇచ్చినట్లు తెల్సింది.
తాను కష్టకాలంలో పార్టీ బాధ్యతలను స్వీకరించానని నిధులు ఆశించకుండా వస్తే బీ ఫారం మాత్ర ం ఇస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఆ నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యారు. అదేవిధంగా తిరుమలలో కలిసిన ఒకరిద్దరి నాయకులకు కూడా రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని చెప్పిట్లు తెలిసింది. తిరుపతికి చెందిన ఒక నాయకుడు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో తాను పార్టీ టికెట్ ఆశించానని అప్పట్లో కనీసం తన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదని రఘువీరా ముందు ఆక్రోశాన్ని వెల్లగక్కారు. అప్పటి పరిస్థితులు వేరు, ఈరోజు పరిస్థితులు వేరు అర్థం చేసుకోవాలని రఘువీరా స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి పనిచేసే వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు వస్తాయని మాత్రమే తాను చెప్పగలనని రఘువీరారెడ్డి తెలియజేశారు.