అంతా మాయే!
బీసీ సబ్సిడీ రుణాల మంజూరులో సర్కారు లబ్ధిదారులను మాయ చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఓ వైపు ప్రకటనలు గుప్పిస్తూ మరోవైపు నెలల తరబడి తిప్పుకుంటోంది. బ్యాంకులు సైతం లబ్ధిదారులకు రుణాలు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్నాయి.
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలోని పేద బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గతేడాది సెప్టంబరులో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించింది. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని 10 నెలలు గడుస్తున్నా రుణాలు మాత్రం మంజూరు కాలేదు. సర్కారు పెట్టిన ఆంక్షలకు తలొగ్గి ఏడాదిగా అటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ జేబులకు చిల్లు చేసుకుంటున్నా ఫలితం దక్కడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
కొందరికే రుణాలు
జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4281 మందికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 7,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 33 41 మందికి మాత్రమే రుణాలు ఇచ్చా రు. గతేడాదికి సంబంధించి ఇంకా 940 మందికి రుణాలు ఇవ్వలేదు.
అలాగే 2015-16 ఆర్థిక సంవత్సరానికి గానూ 3235 మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 9,785 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 905 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఇంకా 2,330 మందికి రుణాలు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు.
645మందికే కాపు కార్పొరేషన్ రుణాలు
కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాలో 5 వేల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, 12875 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 645 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు రుణాలు అందజేసి ఆదుకుంటామన్న సర్కారు ఆచరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
దరఖాస్తులను పరిశీలించి పంపుతున్నాం
బీసీ, కాపు కార్పొరేషన్‌కు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిశీలించి కార్యాలయంలో పెండింగ్ లేకుండా పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి రుణాలకు సంబంధించిన సబ్సిడీ లబ్ధిదారుల బ్యాంకుల్లో పడాల్సి ఉంది. గత ఏడాది పెండింగ్‌లో ఉన్న రుణాల మంజూరు విషయాన్ని ఉన్నతాధికారు దృష్టికి తీసుకువెళుతాం.
-వెంకటస్వామి, ఈడీ, బీసీ కార్పొరేషన్