
ఆ వాదన మోసపూరితం
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర రాజధాని అన్ని జిల్లాలకు మధ్యలో ఉండాలనే వాదన మోసపూరితమని రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్‌ఎస్‌ఎఫ్) కన్వీనర్ భాస్కర్, కో-కన్వీనర్ దస్తగిరి, నగర కన్వీనర్ కల్యాణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు వీరు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలనడం విజయవాడ-గుంటూరుకు తీసుకెళ్లే కుట్రలో భాగమేనని విమర్శించారు.
సమైక్యాంధ్ర రాజధానిగా ఉన్న హైదరాబాదు, తమిళనాడు రాజధాని చెన్నై, కర్ణాటక రాజధాని బెంగుళూరు అలాగే మరెన్నో రాష్ట్రాల రాజధానులు మధ్యభాగంలో లేవనే విషయం నాయకులకు తెలీదా అని ప్రశ్నించారు. అసలు దేశ రాజధాని ఢిల్లీ మధ్యలో ఉందా అంటూ వారు నిలదీశారు. విశాలాంధ్ర విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని చర్చించడమే అనవసరమన్నారు. 1937 నాటి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని ‘సీమ’లోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దీనికి విరుద్ధంగా రాజధానిని కోస్తాకు తరలించుకుపోతున్నా ‘సీమ’లో అడిగే నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడిన పాలకులు నేడు రాజధాని, పారిశ్రామిక కారిడార్, ఎయిమ్స్, మెట్రో రైలు, రైల్వేజోన్ వంటి ప్రాజెక్టులన్నిటినీ కోస్తాకే తరలిస్తున్నారని తెలిపారు. ఇకనైనా రాయలసీమ ప్రజలు మేల్కొని ఉద్యమించకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఆందోళనలో రాయలసీమ విద్యార్థి వేదిక వైవీయూ కన్వీనర్ నాగార్జున, కో-కన్వీనర్ నాగరాజు, సభ్యులు ప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.