
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఆరంభం
కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగిన సినీ నటుడు శివాజీ
రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం విస్తరించాలని నేతల పిలుపు
మద్ధతు పలికిన ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు
గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలంతా వలస కూలీలుగా మారక ముందే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించాలని సినీ నటుడు శివాజీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయన దీక్షకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటూ ప్రశ్నించారు.
ఈ ఉద్యమం పెను ఉద్యమగా మారితేనే ప్రభుత్వాలు దిగి వచ్చి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపు నిచ్చారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఉద్యమానికి తల ఒగ్గక పోతే ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు తీసుకువెళతామన్నారు.
గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్‌కళ్యాణ్ ఈ ఉద్యమంలోకి రావాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన జనసేన నాయకుడు నరహర శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకప్రతిపత్తి రావటం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్‌కళ్యాణ్ ఈ ఉద్యమంలోకి వస్తారని ఆశిస్తున్నారన్నారు.
ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు రమణబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ తన అభివృద్ధి చూసుకుంటున్నారే కానీ రాష్ర్ట ప్రజల భవిష్యత్ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీక్షా శిబిరంలో ప్రసంగించిన పలు పార్లీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ ఉద్యమంలోకి రావాలని ఆకాంక్షించారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి శిబిరం వద్దకు వచ్చి తనను కలిసిన విద్యార్థులతో శివాజీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని కోరారు. చీకటి మెల్లి మంగరాజు, వీరవెంకటవరప్రసాద్, సవరం రోహిత్ తదితర నాయకులు దీక్షకు మద్దతును ప్రకటించారు.