Public union leaders
-
వంద రోజుల పాలన పోలీస్ రాజ్యమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలనలో పోలీసుల రాజ్యమే కనిపించిందని రాష్ట్రంలోని ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంలోనూ పోలీసుల జోక్యం పెరిగిందని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని పదేపదే చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశ్రాంత అధ్యాపకురాలు రమా మేల్కోటే అధ్యక్షతన శనివారం ‘నిగాహ్’రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వందరోజుల్లో అనుసరించిన కార్యక్రమాలు, చేసిన పనులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వక్తలు విశ్లేషించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పౌరహక్కుల నేతలపై గత ప్రభుత్వం ఉపా చట్టాలను అమలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు. పదిరోజులుగా అన్ని మీడియాల్లో పతాకస్థాయిలో వస్తున్న ఎస్ఐబీ దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతోందని, అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ఎస్‌ఐబీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని సీనియర్ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే పనిలో పడిందని, కానీ ప్రజాసమస్యల పరిష్కారంపై అంతగా దృష్టి పెట్టడం లేదని మరో సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థ మారినట్లు కాదని, మార్పు కోసం అన్నివర్గాలు ఉద్యమించాలని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, దేవులపల్లి అజయ్, కె.సజయ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర తొక్కిసలాటలో దోషులెవరో తేల్చాలి
ఏకసభ్య కమిషన్‌ను కోరిన ప్రజాసంఘాల నాయకులు, న్యాయవాదులు రాజమహేంద్రవరం క్రైం: పుష్కర తొక్కిసలాటలో దోషులెవరో తేల్చాలని ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు ఈ ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌ను కోరారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో శుక్రవారం ఏకసభ్య కమిషన్ జస్టిస్ సోమయాజులు నాలుగోసారి బహిరంగ విచారణ చేపట్టారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తమ వాదనలు వినిపిస్తూ పుష్కర తొక్కిసలాట జరిగి ఏడాది కావస్తున్నా ఇందుకు బాధ్యులెవరో తెలియలేదని, ఈ ఘటనపై ఏ ఒక్క అధికారికీ కనీసం మెమో కూడా ఇవ్వలేదన్నారు. ఇంతటి ఘోరానికి కారకులు ఎవరనేది తెలియాలని డిమాండ్ చేశారు. 14వ తేదీనాటికి విచారణను వాయిదా వేస్తున్నామని జస్టిస్ సోమయాజులు పేర్కొన్నారు. కమిషన్ సమావేశం ముగిసిన అనంతరం జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తొక్కిసలాటకు ప్రధాన కారణం చంద్రబాబు పుష్కర ఘాట్‌లో 2 గంటలపాటు పూజలు చేయడమేనని విమర్శించారు. -
పోలీసుల తీరుపై ప్రజాగ్రహం
-
పోలీసుల తీరుపై ప్రజాగ్రహం
రేపల్లె : మాయమాటలు చెప్పి రూమ్‌కు తీసుకువెళ్లి విద్యార్థిని తేజశ్విని హత్య చేస్తే ఆత్మహత్యగా కేసు నమోదు చేయటం ఏమిటని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో రోడ్డుపై ధర్నా చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం గుంటూరుకు చెందిన ప్రత్యేక వైద్య బృందంతో తేజశ్విని మృతదే హానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే తేజశ్వని మృతిని పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేయడంతో బంధువులు, ప్రజాసంఘాల నాయకులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ విషయం ముందుగా తెలుసుకున్న సీఐ మల్లికార్జునరావు, పోలీసులు స్టేషన్ వద్ద భారీగా మోహరించారు. ఆందోళనకారులను స్టేషన్ అడ్డుకున్నారు. దీంతో వారు తాలూకాసెంటర్‌లో రోడ్డుపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. తన కుమార్తెను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి రూముకు తీసుకెళ్లి చిప్పల నాగరాజుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు హత్య చేశారని వారు పోలీసులకు తెలియజేశారు. అయితే తేజశ్విని ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు చేయడం ఏమిటని ప్రజా సంఘాల నాయకులు పోలీసులను నిలదీశారు. సీఐ మల్లిఖార్జునరావుపై తేజశ్విని తల్లిదండ్రులు రాజేశ్వరి, సాంబశివవరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి యజమాని తాను నాగరాజుకు అద్దెకు ఇచ్చిన రూమ్‌లో ఓ బాలిక పడి ఉందని ఇచ్చిన ఫిర్యాదుపై సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ మల్లిఖార్జునరావు శవం కింద పండుకోబెట్టి ఉండటాన్ని గమనించి ఎలా ఆత్మహత్యగా కేసు నమోదు చేశారని పోలీసుల తీరును తప్పుపట్టారు. వెంటనే నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాపట్ల డీఎస్పీ మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నివేదిక అందిన వెంటనే నిర్భయ చట్టం వర్తింప చేసి హత్యకేసు నమోదు చేస్తామని తెలియజేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. తేజశ్విని మృతిపై సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇవ్వటంతో బాధితులు ఆందోళన విరమించారు. అనంతరం మృత దేహాన్ని 14వ వార్డులోని సాంబశివవరప్రసాద్ ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
ఇదో రకం మోసం..!
- ఇళ్ల స్థలాల పేరిట పిలిచి... ‘ప్రత్యేక హోదా’ కోసం ఆందోళన - రాజుపాలెం నుంచి మహిళలను గుంటూరు రప్పించిన ప్రభుత్వ ఉద్యోగి.. - ఆ వ్యక్తి కోసం ఆరా తీస్తున్న పోలీసులు సాక్షి, గుంటూరు : తాము చేసే ఆందోళనలకు కొందరు ప్రజాసంఘాల నాయకులు మాయమాటలు చెప్పి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకుల మాటలు నిజమేనని నమ్మి ఆందోళనల్లో పాల్గొంటున్న అమాయక ప్రజలు చివరకు మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనలు గుంటూరు నగరంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోమవారం నగరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన కార్యక్రమం జరిగింది. దీంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వినతిపత్రం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఇళ్ల స్థలాల కోసం మీ తరఫున పోరాడుతున్నామని నమ్మించి తమను ఈ కార్యక్రమానికి రప్పించారనీ, ప్రత్యేక హోదా కోసం ఆందోళ చేస్తున్న విషయమే తమకు తెలియదని కొందరు మహిళలు పోలీసుల వద్ద వాపోయినట్లు తెలిసింది. ఓప్రభుత్వ ఉద్యోగి తమను నమ్మించి రాజుపాలెం నుంచి గుంటూరు రప్పించారనీ, అసలు ఇక్క డ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి మధ్యాహ్న సమయమైందని వారు వాపోయారు. ఏదో కార్యక్రమం కోసం ఆందోళన చేసి ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే రక్షించేదెవరం టూ పోలీసుల వద్ద మహిళలు ఆవేదన చెందినట్లు సమాచారం. విషయం అర్థం చేసుకున్న పోలీసు అధికారులు ఆ ప్రభుత్వ ఉద్యోగి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
ప్రత్యేక హోదా కోసం ఉద్యమం ఆరంభం
కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగిన సినీ నటుడు శివాజీ రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యమం విస్తరించాలని నేతల పిలుపు మద్ధతు పలికిన ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు గుంటూరు ఈస్ట్ : రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలంతా వలస కూలీలుగా మారక ముందే రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించాలని సినీ నటుడు శివాజీ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా 48 గంటల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఆయన దీక్షకు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు మద్దతు పలికారు. దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు మాట్లాడుతూ నిధులు లేకుండా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా అభివృద్ధి చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ ఉద్యమం పెను ఉద్యమగా మారితేనే ప్రభుత్వాలు దిగి వచ్చి ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటిస్తాయన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపు నిచ్చారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఉద్యమానికి తల ఒగ్గక పోతే ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో గడపగడపకు తీసుకువెళతామన్నారు. గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్‌నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్‌కళ్యాణ్ ఈ ఉద్యమంలోకి రావాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన జనసేన నాయకుడు నరహర శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేకప్రతిపత్తి రావటం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పవన్‌కళ్యాణ్ ఈ ఉద్యమంలోకి వస్తారని ఆశిస్తున్నారన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు రమణబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ తన అభివృద్ధి చూసుకుంటున్నారే కానీ రాష్ర్ట ప్రజల భవిష్యత్ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీక్షా శిబిరంలో ప్రసంగించిన పలు పార్లీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు పవన్ కళ్యాణ్ ఉద్యమంలోకి రావాలని ఆకాంక్షించారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి శిబిరం వద్దకు వచ్చి తనను కలిసిన విద్యార్థులతో శివాజీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని కోరారు. చీకటి మెల్లి మంగరాజు, వీరవెంకటవరప్రసాద్, సవరం రోహిత్ తదితర నాయకులు దీక్షకు మద్దతును ప్రకటించారు.