- ఇళ్ల స్థలాల పేరిట పిలిచి... ‘ప్రత్యేక హోదా’ కోసం ఆందోళన
- రాజుపాలెం నుంచి మహిళలను గుంటూరు రప్పించిన ప్రభుత్వ ఉద్యోగి..
- ఆ వ్యక్తి కోసం ఆరా తీస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు : తాము చేసే ఆందోళనలకు కొందరు ప్రజాసంఘాల నాయకులు మాయమాటలు చెప్పి పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తున్నారు. ప్రజా సంఘాల నాయకుల మాటలు నిజమేనని నమ్మి ఆందోళనల్లో పాల్గొంటున్న అమాయక ప్రజలు చివరకు మోసపోతున్నారు.
ఇలాంటి సంఘటనలు గుంటూరు నగరంలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సోమవారం నగరంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆందోళన కార్యక్రమం జరిగింది. దీంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వినతిపత్రం ఇచ్చేందుకు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. ఇళ్ల స్థలాల కోసం మీ తరఫున పోరాడుతున్నామని నమ్మించి తమను ఈ కార్యక్రమానికి రప్పించారనీ, ప్రత్యేక హోదా కోసం ఆందోళ చేస్తున్న విషయమే తమకు తెలియదని కొందరు మహిళలు పోలీసుల వద్ద వాపోయినట్లు తెలిసింది.
ఓప్రభుత్వ ఉద్యోగి తమను నమ్మించి రాజుపాలెం నుంచి గుంటూరు రప్పించారనీ, అసలు ఇక్క డ ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి మధ్యాహ్న సమయమైందని వారు వాపోయారు. ఏదో కార్యక్రమం కోసం ఆందోళన చేసి ఏదైనా కేసుల్లో ఇరుక్కుంటే రక్షించేదెవరం టూ పోలీసుల వద్ద మహిళలు ఆవేదన చెందినట్లు సమాచారం. విషయం అర్థం చేసుకున్న పోలీసు అధికారులు ఆ ప్రభుత్వ ఉద్యోగి గురించి ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఇదో రకం మోసం..!
Published Thu, May 14 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement