
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కోదండరాం తదితరులు
ప్రభుత్వం మారినా నిర్బంధం కొనసాగుతోంది
‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ మాటలకే పరిమితమైంది
ప్రజా సంఘాల ‘నిగాహ్’ సమావేశంలో వక్తల అభిప్రాయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వంద రోజుల కాంగ్రెస్ పాలనలో పోలీసుల రాజ్యమే కనిపించిందని రాష్ట్రంలోని ప్రజా సంఘాల ప్రతినిధులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంలోనూ పోలీసుల జోక్యం పెరిగిందని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీపీసీసీ అధ్యక్షుడిగా మీడియాతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని పదేపదే చెప్పారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది మాటలకే పరిమితమైందని మండిపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశ్రాంత అధ్యాపకురాలు రమా మేల్కోటే అధ్యక్షతన శనివారం ‘నిగాహ్’రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వందరోజుల్లో అనుసరించిన కార్యక్రమాలు, చేసిన పనులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వక్తలు విశ్లేషించారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న పౌరహక్కుల నేతలపై గత ప్రభుత్వం ఉపా చట్టాలను అమలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాంటి మార్గాన్నే అనుసరిస్తోందని ఆరోపించారు.
పదిరోజులుగా అన్ని మీడియాల్లో పతాకస్థాయిలో వస్తున్న ఎస్‌ఐబీ దాదాపు 30 సంవత్సరాలుగా కొనసాగుతోందని, అత్యంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న ఎస్‌ఐబీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలని సీనియర్ సంపాదకుడు ఎన్.వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బలం పెంచుకునేందుకు బీఆర్‌ఎస్ నేతలను చేర్చుకునే పనిలో పడిందని, కానీ ప్రజాసమస్యల పరిష్కారంపై అంతగా దృష్టి పెట్టడం లేదని మరో సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన వ్యవస్థ మారినట్లు కాదని, మార్పు కోసం అన్నివర్గాలు ఉద్యమించాలని పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, దేవులపల్లి అజయ్, కె.సజయ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment