హాజరైన దిగ్విజయ్, రఘువీరా,13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు
బెజవాడలో తొలి పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం
ఇకపై ఆంధ్రరత్నభవన్ నుంచే పూర్తిస్థాయి పార్టీ వ్యవహారాలు
విజయవాడ బ్యూరో : ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా వెలుగొందిన విజయవాడ ఆంధ్రరత్న భవన్ మళ్లీ కొత్తరూపు సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారింది. శుక్రవారం ఉదయం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పార్టీ పతాకాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రరత్న భవన్ ప్రాంగణం పార్టీ శ్రేణులు, నేతలతో కిటకిటలాడింది. జై కాంగ్రెస్ .. నినాదాలతో మార్మోగింది.
ఇకపై ఇక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు అవసరమైన కార్యాచరణ రూపకల్పనతో పాటు ఇతరత్రా పార్టీ వ్యవహారాలన్నీ ఇకపై ఇక్కడి నుంచే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ నేతల సమావేశాలకు అనుగుణంగా ఏసీ సమావేశ మందిరాన్ని, రెండు విశ్రాంతి గదులను నిర్మించారు. పీసీసీ అధ్యక్షుని కోసం ప్రత్యేకంగా ఏసీ గదిని ఏర్పాటు చేశారు. వెయిటింగ్ హాల్, కార్యకర్తల విశ్రాంతి గదులను కూడా ఏర్పాటుచేశారు. 200 మంది కంటే ఎక్కువ మంది విచ్చేసినపుడు సమావేశం నిర్వహించేందుకు వీలుగా ఆంధ్రరత్నభవన్‌కు తూర్పున ఉన్న ఖాళీ స్థలాన్ని ఉంచారు. గతంలో ఉత్తరాన ఉన్న మెట్లను తొలగించి ప్రత్యేకంగా నైరుతీ భాగాన ఐరన్‌మెట్లు ఏర్పాటు చేశారు.
తొలి సమన్వయ కమిటీ సమావేశం..
శుక్రవారం దిగ్విజయ్‌సింగ్ ప్రారంభించిన పీసీసీ రాష్ట్ర కార్యాలయంలో తొలిసారిగా సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. దిగ్విజయ్‌తోపాటు రఘువీరా, కొప్పుల రాజు, తిరువనక్కరుసు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అవసరమైన కార్యాచరణపై సమీక్షించారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన వెంటనే తన ముందున్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని దిగ్విజయ్ పలకరించి నేతల సమక్షంలోనే క్షమాపణ కోరారు. ఇటీవల అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన రాహుల్‌గాంధీ సభలో కోట్లకు జరిగిన అవమానాన్ని, ఎదురైన ఇబ్బందిని ప్రస్తావించి పార్టీ పక్షాన సారీ చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటలకు వరకూ జరిగిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో దిగ్విజయ్‌తో పాటు రఘువీరారెడ్డి నేతలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ప్రజల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా పోరాడుతూనే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దిగ్విజయ్ ధ్వజమెత్తారు. మేడిన్ ఇండియా నినాదంతో ప్రధాని మోదీ అడుగులు వేస్తుంటే, మేడిన్ సింగపూర్ నినాదంతో చంద్రబాబు పరుగులు తీస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడారు. ఏపీసీసీ అధికార ప్రతినిధులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు పరసా రాజీవ్త్రన్ తదితరులు పాల్గొన్నారు.
పనితీరు భేష్
ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పనితీరు భేషుగ్గా ఉందంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కితాబిచ్చారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడం శుభపరిణామం అన్నారు.
నేడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ.. సమ్మేళనం
శనివారం ఉదయం 10 గంటల నుంచి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విభాగాల ప్రత్యేక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీసీసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన డీసీసీ అధ్యక్షులను కోరారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో నేతలు సాకే శైలజానాథ్, కనుమూరి బాపిరాజు, పళ్లంరాజు, నాదెండ్ల మనోహర్, సి.రామచంద్రయ్య, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గంగాభవానీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
Published Sat, Feb 20 2016 12:51 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement