మృత్యువులోనూ వీడని బంధం | The belief is bound to death | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Published Tue, Jan 6 2015 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

మృత్యువులోనూ వీడని బంధం

మృత్యువులోనూ వీడని బంధం

ఆ అన్నదమ్ముల బంధం మృత్యువులోనూ వీడలేదు. ఒకే తల్లి బిడ్డలైనా స్నేహితుల్లా మెలిగారు. చిన్నోడా, పెద్దోడా అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. ప్రతి పని కలిసే చేసేవారు. సీజనల్ వ్యాపారం చేస్తూ యడ్లపాడు, దాసరిపాలెం, మైదవోలు గ్రామస్తులతో కలివిడిగా ఉండే పల్లపు సాంబయ్య, ఎర్రయ్యలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలియడంతో ఆ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

యడ్లపాడు :జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యడ్లపాడులో ఆదివారం అర్ధరాత్రి  జరిగింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.. మైదవోలు గ్రామానికి చెందిన పల్లపు సాంబయ్య (55), పల్లపు ఎర్రయ్య (48)లు చిరువ్యాపారులు. సీజనల్‌గా వచ్చే పండ్లు చేపలు విక్రయిస్తూ జీవిస్తున్నారు.

యడ్లపాడు మసీదు సెంటర్లో సాంబయ్య, గుంటూరు రూరల్ మండలం దాసరి పాలెంలో ఎర్రయ్య ఉంటున్నారు.
ఆదివారం సాయంత్రం ఎర్రయ్య తన సోదరుని ఇంటికి వచ్చి అక్కడే భోజనం చేసుకుని తిరిగి దాసరిపాలెం వెళ్తానని చెప్పడంతో ఇరువురు కలసి జాతీయ రహదారికి చేరుకున్నారు.

అప్పటికే రాత్రి 12.30 గంటలు కావడంతో సర్వీసురోడ్డులోకి బస్సులు రావని భావించి హైవే రోడ్డు పక్కనే ఉన్న గ్రిల్స్ సందులోంచి ఎక్స్‌ప్రెస్ రోడ్డుపైకి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయంలో గుంటూరు నుంచి వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో  అక్కడికక్కడే మృతి చెందారు.
 
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం. ఉమామహేశ్వరరావు తెలిపారు. మృతదేహాలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
 
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రెండు కుటుంబాల్లో ఎవరిని ఓదార్చాలో బంధువులకు అర్థం కాలేదు. సోదరుల స్వగ్రామం మైదవోలులో ఒకేచోట అంత్యక్రియలు నిర్వహించారు.
 
సాంబయ్యకు భార్య కుమారి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎర్రయ్య భార్య సుబ్బులు మూడేళ్ల కిందట మృతి చెందింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 
తెల్ల కారుగా గుర్తించాం.. నంబర్ చూడలేకపోయాం...
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతికి కారణమైన వాహనాన్ని తాము చూశామని అయితే నంబర్ గుర్తించలేకపోయినట్లు గ్రామస్తులు కొందరు చెబుతున్నారు. సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే రోడ్డుపక్కనే ఉన్న జయలక్ష్మీ మూవీ ల్యాండ్‌లో రెండవ ఆట సినిమా చూసి వస్తున్న గ్రామస్తులు కొందరు వాహనాన్ని చూసినట్లు చెబుతున్నారు. తెల్లకారును చూశామని, కారు అద్దం కూడా పగిలిపోయిందని మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు.

తొలుత కారు ఎర్రయ్యను ఢీకొనడంతో అక్కడే రోడ్డుపై పడి మృతి చెందాడని, సాంబయ్య శాలువ కప్పుకొని ఉండటంతో అది కారుకు చుట్టుకొని కొద్దిదూరం అతన్ని ఈడ్చుకు పోవడాన్ని చూసినట్లు చెప్పారు. అదే కారు గణపవరం సెంటర్లో కూడా మరో బైక్‌ను ఢీకొట్టినట్లు తెలిసిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement