అనుమానాలు అనేకం | The body of the sparks concerns | Sakshi
Sakshi News home page

అనుమానాలు అనేకం

Published Thu, Sep 19 2013 3:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

The body of the sparks concerns

రాయచోటి టౌన్, న్యూస్‌లైన్:  ఓ మృతదేహం ఎన్నో సందేహాల ను రేకెత్తిస్తోంది. తలకు బలమైన గాయాలుండడం అనుమానాలకు మరింత బ లం చేకూరుస్తోంది. ఏదేని గుర్తు తెలియ ని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా? లేక పథకం ప్రకారం ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులేమో ఇది కచ్చితంగా హత్యేన ని పేర్కొంటున్నారు. వాస్తవాలు ఏమిటో పోలీసులే నిగ్గు తేల్చాలి.
 వెలుగు చూసింది ఇలా...
 రామాపురం మండలం దిగువబండపల్లె గ్రామం మాదిగపల్లెకు చెందిన బందెల నారాయణమ్మ, పెద్ద గంగులు దంపతుల రెండో కుమారుడైన బందెల ప్రభాకర్ మృతదేహాన్ని రాయచోటి-కడప మార్గంలోని మాసాపేట మిట్ట వద్ద రోడ్డు పక్కన బుధవారం కనుగొన్నారు. తలకు బలమైన గాయమై ఉండడంతో అసలేం జరిగిందన్న విషయం అంతుబట్టడం లేదు. కొందరు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉండొచ్చని అంటుండగా, బంధువులు మాత్రం హత్యే అయి ఉంటుందంటున్నారు. తలకు ఓ వైపున కోసినట్లుగా లోతైన గాయం ఉండడం కూడా అనేక సందేహాలకు కారణమవుతోంది. లారీకి ఓ వైపున ఉండే పదునైనా రేకు తగిలి కోసుకుపోవడం వల్ల గాయమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
 
 భార్య మరణించిన
 నాలుగు నెలలకే...
 బందెల ప్రభాకర్ భార్య కళావతి కాన్పు కష్టమై నాలుగు నెలల కిందటే మరణించినట్లు బంధువులు తెలిపారు. అంతలోనే ఈ సంఘటన జరగడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సానిపాయ వద్దనున్న కంకరమిషన్‌లో కూలి పనులకు వెళ్లే ప్రభాకర్ వారానికోసారి ఇంటికి వచ్చేవాడని వారు వివరించారు.
 
 భార్య చనిపోయినప్పటి నుంచి రెండు వారాలకోసారి మాత్రమే వచ్చేవాడని అతని తల్లి నారాయణమ్మ తెలిపారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూలి పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగిందని ఆమె బోరున విలపిస్తోంది. అసలు తన కుమారుడు ఇక్కడికి ఎందుకు వచ్చింటాడని ఆమె ప్రశ్నిస్తోంది. పని పూర్తయ్యాక రాయచోటిలోని ఠాణా వద్ద గాని, బస్టాండ్ వద్ద గానీ ఏదైనా వాహనం ఎక్కి ఇంటికి వచ్చేవాడని ఆమె తెలిపింది.
 
 ఎటూ కాకుండా మాసాపేట మిట్ట వద్దకు అతను రావాల్సిన అవసరం కూడా లేదంటోంది.
 దీన్ని బట్టి చూస్తే తన కుమారుడ్ని ఎవరైనా ఏదైనా చేసి ఇక్కడికి తెచ్చి పడేశారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం  చేస్తోంది. కాగా ప్రభాకర్ ఛాతిపై ఎడమ వైపున ‘లక్ష్మీ’ అని పచ్చబొట్టు కూడా ఉండడంపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. సంఘటనా స్థలాన్ని రాయచోటి సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు.  తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు ఏమిటో వెల్లడవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement