Ramapuram
-
సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. -
Eguvaramapuram: సైనికుల ఊరు.. సరిలేరు మీకెవ్వరు
భారత భూభాగాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ, పొరుగు దేశాల దురాక్రమణలను అడ్డుకుంటూనే, ఎప్పటికప్పుడు యుద్ధానికి సన్నద్ధులై కీలకమైన ఆపరేషన్లలో ప్రధాన పాత్రధారులుగా ఆ గ్రామ యువత దేశరక్షణలో నిమగ్నమైంది. సాధారణ సిపాయి నుంచి అత్యున్నత శిక్షణ పొందిన కమాండో, సెంట్రల్ మిలటరీ పోలీసు (సీఎంపీ) వరకూ ఆ గ్రామానికి చెందిన వారు సేవలందిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధభూమిలో ఆ గ్రామ యువత కీలకంగా వ్యవహరిస్తోంది. వైఎస్సార్ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్న ఆ గ్రామం పేరు ఎగువరామాపురం. కలసపాడు మండలంలోని ఒక్క ఎగువ రామాపురం నుంచే దాదాపు 300 మంది యువకులు దేశరక్షణలో ఉండడం విశేషం. సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 2200 మంది భారతదేశ రక్షణ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తుంటే ఒక్క కలసపాడు మండలంలోనే దాదాపు 700 మందికి పైగా ఉన్నారు. అంటే జిల్లా నుంచి సైన్యంలో పనిచేస్తున్న వారిలో 30 శాతం వాటా కలసపాడు మండలానిదేనని స్పష్టమవుతోంది. ఈ మండలంలో ప్రధానంగా ఎగువరామాపురం, ఎగువ తంబళ్లపల్లె, రాజుపాళెం గ్రామాల నుంచే ఆర్మీలో ఉండడం మరో విశేషం. వారిలో అత్యధికంగా ఎగువరామాపురం వాసులు ఉన్నారు. పాకిస్థాన్‌తో తలపడిన కార్గిల్ యుద్ధంలో సైతం వీరి భాగస్వామ్యం ఉంది. ముంబయి తాజ్ హోటల్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులతో తలపడ్డ ఆపరేషన్ ‘సైక్లోన్’లో కూడా ఎగువరామాపురం గ్రామానికి చెందిన కమాండో ఉన్నారు. ఇలా అనేక ఆపరేషన్లలో ఆ గ్రామానికి చెందిన యువత భాగస్వామ్యం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్గిల్ యుద్ధంలో.. నిత్యం మంచు ముద్దలు, మంచు కొండలు విరిగిపడుతుంటాయి. అలాంటి ప్రాంతంలో 1999 మే 13వతేదీ నుంచి 28 వరకు కార్గిల్‌లో యుద్ధం జరిగింది. భారతదేశ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ ముష్కరులను భారత సైన్యం తరిమికొట్టింది. ఈ యుద్ధంలో ఎగువరామాపురానికి చెందిన వారు 20 మంది ఉండడం మరో విశేషం. 2008 డిసెంబర్లో భారతదేశ ఆర్థిక రాజధానిగా పేరుబడ్డ ముంబయి నగరంలో తాజ్ హోటల్‌పై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. వారిని తుదముట్టించేందుకు ఢిల్లీ నుంచి బ్లాక్ క్యాట్ క మాండోలను ముంబయికి తరలించారు. ఆపరేషన్ ‘సైక్లోన్’ పేరుతో నిర్వహించిన ఈ టాస్క్‌లో ఎగువరామాపురానికి చెందిన కమాండో బండి ప్రతాప్‌రెడ్డి పాల్గొని విజయకేతనం ఎగురవేసి దేశ ప్రతిష్టలో భాగస్వామి అయ్యాడు. అన్నదమ్ములం ఇద్దరం ఆర్మీలో చేరాం మేం ఇద్దరం అన్నదమ్ములం. ఇద్దరం ఆర్మీలో చేరాం. మా అమ్మా నాన్న పొలంలో కష్టం చేసి మా ఇద్దరిని చదివించారు. జీవనోపాధికి ఆర్మీలో చేరినా దేశ భద్రతలో మేం కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మిలటరీలో చేరి 13 సంవత్సరాలు అయింది. సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు వ్యవసాయ పనుల్లో అమ్మా నాన్నకు చేదోడుగా ఉంటున్నాం. – వై.వెంకటరెడ్ధి ఆర్మీ ఉద్యోగి,ఎగువ రామాపురం దేశసేవ తృప్తిగా ఉంది మాది చాలా పేద కుటుంబం. పదవ తరగతి పూర్తయిన వెంటనే పై చదువులకు వెళ్లే పరిస్థితులు లేవు. ఆర్మీలో అయితే త్వరగా జాబ్ వస్తుందని పదవ తరగతి పూర్తి అయిన వెంటనే సెలక్షన్‌కు పోయా, ఉద్యోగం వచ్చింది. దాంతో బతుకు దెరువు దొరికింది. అమ్మా నాన్నలు కూడా ఆర్మీలోనే చేరమని చెప్పారు. దేశ సేవ చేస్తున్నానన్న ఆనందం ఉంది. ఇప్పటికి 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయింది. ఆర్మీ కమ్యూనికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. – కె.కిరణ్‌కుమార్ ఆర్మీ ఉద్యోగి.ఎగువ రామాపురం మాకెంతో గర్వకారణం దేశ రక్షణలో మా గ్రామస్తుల భాగస్వామ్యం ఉండడం మాకెంతో గర్వకారణం. తరాలు మారినా ఆర్మీకి వెళ్లడంలో గ్రామ యువత ఎప్పటికీ ముందుంటుంది. గ్రామానికి చెందిన ఉదయగిరి చెన్నయ్య(40), నడిపి మస్తాన్(45) మరో ఇరువురు ప్రమాదవశాత్తు, అనారోగ్య పరిస్థితులతో మృత్యువాత పడ్డారు. అయినప్పటికీ ఆర్మీకి పంపేందుకు తల్లిదండ్రులు సంకోచించరు. దేశానికి సేవ చేస్తున్నామనే తృప్తే మెండుగా ఉంటుంది. ఆర్మీలో ఎంతో క్రమశిక్షణతో మా గ్రామానికి చెందిన వారు వివిధ హోదాల్లో రాణిస్తున్నారు. మాజీ సైనికోద్యోగులను ఆదుకోవాలి. – వెంకటయ్య సర్పంచ్, ఎగువ రామాపురం -
బాపట్లలో విషాదం.. నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
చీరాల టౌన్: విహారయాత్ర కోసం బీచ్‌కు వచ్చిన నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యా రు. వారిలో ఒకరి మృతదేహం లభించింది. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో గురువారం జరిగింది. చీరాల డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరుకు చెందిన జీవీఆర్‌ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు రామాపురం బీచ్‌కు వచ్చా రు. వారు సముద్రంలో స్నానం చేస్తుండగా పెద్ద అలలు వచ్చాయి. తెనాలికి చెందిన యడవల్లి రమణ (19), పులివర్తి గౌతమ్ (20), అమరావతి మండలం పరిమి గ్రామానికి చెందిన తాళ్లూరి రోహిత్ (20), హైదరాబాద్‌కు చెందిన తిరుణగిరి మహదేవ్ (18) అలల తాకిడికి నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో కేకలు వేస్తున్న విద్యార్థుల ను కాపాడేందుకు రామాపురం మత్స్యకారులు ప్రయత్నించినా, ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మహదేవ్ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొ చ్చింది. మిగిలిన ముగ్గురు విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. మహదేవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తీరంలో మిన్నంటిన రోదనలు... గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సహచర విద్యార్థులు రామాపురానికి చేరుకున్నారు. కుమారులు సముద్రంలో గల్లంతుకావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్న తమపై విధి కక్షగట్టి తీసుకెళ్లిందని, తమకు కడుపుకోత మిగిల్చిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా రు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అక్కడికి చేరుకుని విద్యార్థులు, డీఎస్పీ పి.శ్రీకాంత్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
చెత్త కదిలింది
► రామాపురం వాసులతో చర్ఛలు సఫలం ► 22 వరకు చెత్త తరలింపునకు అనుమతి ► పేరుకుపోయిన వ్యర్థాలకు మోక్షం ► తరలిన 760 మెట్రిక్ టన్నుల చెత్త ► ప్రత్యామ్నాయంపై తర్జన భర్జన తిరుపతి నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. నాలుగు రోజులుగా పేరుకుపోయిన చెత్త కదిలింది. సీ రామాపురం ప్రజలు ఈనెల 22వరకూ అనుమతించడంతో అధికారులు హమ్మయ్య అనుకున్నారు. తమ బతుకులను ఇబ్బందిపాల్జేసే చెత్తను ఇక్కడ వేయవద్దంటూ సి.రామాపురం గ్రామస్తులు డంపిం గును అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో నగరంలో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. గ్రామస్తుల అంగీకరించిన వెం టనే శనివారం మధ్యాహ్నం నుంచి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. తిరుపతి తుడా/రామచంద్రాపురం: తిరుపతి చెత్త కదిలింది. నాలుగు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడ నిలిచిన సంగతి తెలిసిందే. 760 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. శుక్రవా రం సాయంత్రం కొద్దిపాటి వర్షానికి ఈ చెత్త నుంచి దుర్వాసన రావడంతో నగర వాసులు అసౌకర్యానికి లోనయ్యారు. సి.రామాపురంలోని కార్పొరేషన్ డంపింగ్ యార్డ్‌లో చెత్త తరలింపును గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ సమస్య నెలకుంది. గ్రామస్తులు ఎందుకు వద్దన్నారంటే.. రామచంద్రాపురం మండలం రామాపురం పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకు తిరుపతిలోని చెత్తాచెదారం, ఇతరత్రా వ్యర్థపదార్థాలను 12 సంవత్సరాలుగా తరలిస్తున్నారు. కంపోస్టు లోడ్‌తో వెళ్లే మున్సిపల్ వాహనాలన్నీ ఈ ఊరు మీదగానే యార్డుకు వెళతాయి. అయితే తమ గ్రామం పక్కనున్న డంపింగ్ యార్డు వల్ల త్వరగా రోగాల బారిన పడుతున్నామని, ఎంతో మందికి డెంగీ జ్వరాలు కూడా వచ్చాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారు చెత్త తరలింపును అడ్డుకున్నారు. దీని వల్ల గడచిన 4రోజుల్లో 760 మెట్రిక్ టన్నుల చెత్త తిష్టవేసింది. సమస్య జఠిలం కావడంతో శనివారం ప్రజాప్రతినిధులు సమావేశమై తాత్కాలిక పరి ష్కారం చూపారు. దీంతో చెత్త కదిలింది. 22 వరకే గడువు.. సీ.రామాపురం వద్ద డంపింగ్‌యార్డును తరలించేంతవరకు ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని శాసన సభ్యుడు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ శివప్రసాద్ చెప్పారు. శనివారం రామాపురంలో గ్రామస్తులతో ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి చర్చించారు. ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యేతో చర్చించి సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు కొంత గడువు ఇప్పిస్తే మంచిదని కోరారు. దీనిపై స్పందించిన చెవిరెడ్డి తిరుపతి ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొంత గడువిద్దామని అక్కడి ప్రజలను కోరారు. 22వరకు చెత్త తరలింపునకు అనుమతిద్దామని చెప్పారు. తర్వాత తరలింపు జరగనివ్వమన్నారు. 2012లో మూడు నెలల్లో డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి మారుస్తామని అధికారులు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చి స్పందిం చకుండా ప్రజలను ఇబ్బంది పెట్టుతున్నారన్నారు. ప్రత్యామయంగా డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి మార్చుకోకపోతే పార్టీలకతీతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో గ్రామ ప్రజలు శాంతించి ఎమ్మెల్యే ప్రతిపాదనకు అంగీకరించారు. ఆందోళన తాత్కాలికంగా విరమించారు. -
వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
రామాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రక్షణయాత్రలో భాగంగా సోమవారం రామాపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 58 శాతం మంది ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. కుటుంబ పోషణ భారమై అప్పులు తీర్చలేక గత 15 సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా సుమారు 4.15 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 26 శాతం పెరిగాయన్నారు. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా ఆచరణలో కరువు సహాయక చర్యలు లేవన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల రైతాంగాలను చైతన్యపరిచేందుకు డిశంబర్ 20న రైతు రక్షణ యాత్ర నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి రంగారెడ్డి, సిపీఐ ఏరియా కార్యదర్శి శ్రీనివాసులు, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చెండ్రాయుడు, చీకటి పెద్ద క్రిష్ణయ్య పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి ఎర్రగుంట్ల: రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రగుంట్లలోని స్థానిక కార్యలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలు వర్షభావం వల్ల దెబ్బతిని పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రెయిన్గన్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు భవానీశంకర్, నారాయణ, ఓబుళరెడ్డి పాల్గొన్నారు. -
విలేకరిపై దాడి చేసిన ఫారెస్ట్ సిబ్బంది
-
ఆచరణీయం శ్రీకృష్ణ తత్వం
రామాపురం : ఆచరణీయమైనది భగవాన్ శ్రీ కృష్ణ తత్వమని హంపి పీఠాధిపతి జగత్గురు శంకారాచార్య విద్యారమ్యభారతి మహాస్వామిజీ అన్నారు. శ్రీ కృష్ణ విగ్రహ(మూలవీరాట్) ప్రతిష్ఠ ఆలయ గోపురం కుంభాభిషేకం అనంతర స్వామిజీ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని గ్రహించి గోప్పఅనుభూతి పొందిన మహనీయులు ఎందరో ఉన్నారన్నారు. గీత ద్వారా ప్రపంచానికి ఎంతో విజ్ఞానాభాండగారాన్ని ధార్మిక, ఆధ్యాత్మిక భక్తి మార్గాన్ని నిర్దేశించిన భగవాన్‌గా నేటికి అందరితో ఆధారింపబడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం పెరగాలి : ప్రస్తుత సమాజంలో పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ భక్తిభావంతో వ్యవహరించాల్సి ఉందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆధాత్మిక చింతనకు మానసిక ప్రశాంతతకు ఆలయాలే నిలయాలుగా మారుతున్నాయన్నారు. ప్రేమాలయ వ్యవస్థాపకులు చింతం వెంకటరెడ్డి దాతల సహకారంతో మందిరాన్ని నిర్మించి విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించడం హర్షించతగ్గ విషయం అన్నారు. అనంతరం టీటీడీకి చెందిన గాయకులు అన్నమయ్య గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ఆశ్రమ కార్యదర్శి పెద్దిరెడ్డి గంగిరెడ్డి, కోశాధికారి నారాయణమ్మ, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. -
39 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– వాటి విలువ సుమారు రూ.4లక్షలు – నలుగురు అరెస్టు రామాపురం: మండలంలోని సరస్వతిపల్లె బీట్ పరిధిలో వంగిమళ్ల పాలకొండల అటవీ ప్రాంతంలోని రేనిమాకుల కుంట సమీపంలో శనివారం తెల్లవారుజామున 1005 కేజీల బరువు గల 39 ఎర్రచందనం దుంగలను రాయచోటి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. రాయచోటి రేంజర్ జి.జె ప్రసాద్‌రావు తన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం బేస్‌క్యాంపు స్రై్టక్ ఫోర్స్ సిబ్బంది అటవీశాఖ సిబ్బందితో కలిసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన తిరుణామలై జిల్లా గుందలత్తూర్ గ్రామానికి చెందిన చిన్నప్పయన్ శశికుమార్, అతీమూర్ గ్రామానికి చెందిన గోపాల్ రాజమూర్తి, అమర్తి గ్రామానికి చెందిన పాపన్నమణి, అనంతపురం జిల్లా నంబులపూలుకుంట గ్రామానికి చెందిన పప్పూరి సాంబశివయ్యలు అడవిలో దుంగలతో ఉన్నారని తెలిసి మెరుపుదాడి నిర్వహించామన్నారు. మొత్తం 7 మంది స్మగ్లర్లు ఉండగా వారిలో నలుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్దగ ల 38 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. అవి సుమారు 1005 కేజిల బరువు ఉన్నట్లు తెలిపారు. పరారైన వారిలో అనంతపురం జిల్లా ఎన్పీ కుంటకు చెందిన హరి ప్రధాన నిందితుడన్నారు. తమిళనాడు నుంచి బెంగళూరు మీదుగా కదిరికి వచ్చి ఇక్కడ అటవీ ప్రాంతంలో ఎర్రచందన ం స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ కే శ్రీనివాసులు, ఎఫ్‌బీఓలు శ్రీనాథరెడ్డి, బి. కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ: యువకుడి మృతి
రామాపురం (వైఎస్సార్ జిల్లా) : రామాపురం జాతీయరహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వస్థలం రామాపురం మండలం సుద్ధమళ్ల గ్రామం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
రామాపురంక్రాస్రోడ్(కోదాడరూరల్): రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం శివారు రామాపురంక్రాస్ రోడ్‌లోని పాలేరు వంతెన వద్ద తెలంగాణ తల్లి బారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోబాటు ఈ ప్రాంత తెలంగాణ పోరాట యోదుడు కీసర జీతేందర్‌రెడ్డి విగ్రహాన్ని, అమర వీరుల స్థూప నిర్మాణానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్లులో ఎపీ నుంచి∙వచ్చే ప్రజలకు, ప్రయాణికులకు స్వాగతం పలికే విధంగా తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులచే ఈ పనుల ప్రారంభానికి శంస్థాపన జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమరయోధుల సంఘం సభ్యులు కత్రం సీతరారంరెడ్డి, కొడారు వెంకటయ్య, సీహెచ్.విశ్వేశ్వరావు, శివాజీరెడ్డి, తిరపతయ్య, సత్యనారాయణ, నాయకులు వాచేపల్లి వెంకటేశ్వరెడ్డి, ఈదుల కృష్ణయ్య, ముండ్రా వెంకట్రావ్, నల్లపాటి శ్రీనివాసరావు, ఎర్రమళ్ల వెంకటేశ్వర్లు , నిరంజన్‌రెడ్డి తదితరులున్నారు. -
గండి పడిన చెరువు- నేలకూలిన ఇళ్లు
రామపురం (వైఎస్ఆర్ జిల్లా) : కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుకు గండి పడి ఒకరు మృతి చెందగా, పది ఇళ్లు నేలమట్టం అయిన సంఘటన రామపురం మండలం సురకావాండ్లపల్లి, వీరబల్లిలో మంగళవారం జరిగింది. కుమ్మరపల్లి సురకావాండ్లపల్లికి చెందిన షాయిక్ వాల్, షాయిక్ సయ్యద్, ఖాసీ, జయమ్మ ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పది లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. వీరబల్లిలో మండలం ఈడిగపల్లెలో విద్యుత్‌షాక్‌తో ధనమ్మ (40) అనే మహిళ మృతి చెందింది. -
తల్లీబిడ్డలు సజీవ దహనం
వైఎస్సార్ జిల్లా : పూరిల్లు తగలబడటంతో రెండేళ్ల చిన్నారితో సహా తల్లి మంటల్లో కాలి బూడిదైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌసల్య ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఆమెతో పాటు చిన్నారి భాను(2) కాలి బూడిదయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు మంటలంటుకుని సజీవ దహనమైందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
కాటికి పంపిన కలహాలు
భార్యను నరికి చంపిన భర్త హతురాలు హాస్టల్ వార్డెన్ అతనిది అంతంత మాత్రం చదువు.. ఆమె ఉన్నత విద్యావంతురాలు. అతను నిరుద్యోగి.. ఆమె ప్రభుత్వోద్యోగి. చిన్నప్పటి నుంచి మేనమామ అంటే ఆమెకు ప్రేమ.. ఒకరికి ఉద్యోగం లేకపోయినా మరొకరికి ఉంది కదా అని సొంత తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత అతనిలో అనుమానపు బీజం మొలకెత్తింది. అది పెనుభూతంగా మారింది. పచ్చని వారి సంసారంలో చిచ్చు రగిల్చింది. భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. తరచూ కలహాలకు కారణమైంది. అదే వారి మధ్య రక్త సంబంధాన్ని తెంచేసింది. తాళి కట్టిన భర్తే వైవాహిక బంధాన్ని ఎగతాళి చే శాడు. భార్యను పట్టపగలే నరికి చంపి హంతకుడిగా మిగిలాడు. - రామాపురం రామాపురం మండలం నీలకంఠరావుపేట ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ గొట్టివీటి లక్ష్మీదేవి(40) గురువారం భర్త గొట్టివీడు శ్రీరాములు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రామాపురం నుంచి విధి నిర్వహణ నిమిత్తం మధ్యాహ్నం ఆమె నీలకంఠరావుపేటకు ఆటోలో బయలుదేరారు. అదే ఆటోలో శ్రీరాములు కూడా వెళ్లాడు. ఆటోలోనే భ్యాతో అతను గొడవపెట్టుకున్నాడు. మాటామాటా పెరిగింది. అంతలోనే నీలకంఠరావుపేట వచ్చింది. ఇద్దరూ దిగి హాస్టల్ వద్దకు కాలినకడన బయలుదేరారు. హాస్టల్ సమీపించగానే తన వెంట తెచ్చుకున్న మచ్చుకొడవలితో శ్రీరాములు తన భార్య లక్ష్మీదేవిని దారుణంగా నరికాడు. దాడిలో ఆమె చేతులు, తల, శరీరంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిదేవిని చూసిన అక్కడి జనం 108కు సమాచారం అందించారు. చాలా సేపటి వరకు అంబులెన్స్ రాకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు వదిలేశారు. స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఎస్ఐ వెంకటాచలపతి తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి చేరుకున్నారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. తరచూ గొడవలు.. రామాపురం మండలం మిద్దెకాడపల్లెకు చెందిన లక్ష్మిదేవిని గాలివీడు మండలం కరివిరెడ్డిగారిపల్లెకు చెందిన తన మేనమామ గొట్టివీటి శ్రీరాములుకు 1981లో ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఒక కుమార్తె. ప్రస్తుతం ఆమె తిరుపతిలో ఉండి బీడీఎస్ చదువుతోంది. ఏడాది కిందట లక్ష్మిదేవి నీలక ంఠరావుపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె భర్తతో కలసి రామాపురంలో నివాసముంటున్నారు. ప్రతిరోజూ విధులకు వచ్చివెళ్లేవారు. భార్యపై అనుమానంతో అతను తరచూ ఆమెతో గొడవకు దిగేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో అతను ఒకసారి నిద్ర మాత్రలు మింగిన అతను, మరోసారి విషపు మందు తాగినట్లు తెలుస్తోంది. భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు తమ వార్డెన్‌ను హాస్టల్ సమీపంలోనే భర్త చంపడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన వెళ్లిన హాస్టల్ వార్డెన్ మాధవీలత వెంటనే లక్కిరెడ్డిపల్లె ఏఎస్‌డబ్ల్యూఓకు సమాచారం అందించారు. ఆమె సూచన మేరకు మాధవీలత హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి నేర ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. -
నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి
వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈతకు వెళ్లి నీటిలో ముగినిపోయి చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు వావెల సుజాత(9), రాముడు(10), అంజమ్మ(7), ఆంజనేయులు(9)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. చిన్నారులు మృతిని తట్టుకోలేక వాళ్ల అమ్మమ్మ నాగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో రామాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
హైవేపై ‘నిఘా’నేత్రాలు!
రాజంపేట : జిల్లాలోని కడప-చెన్నై ప్రధానరహదారిలో నిఘానేత్రాలు (సీసీకెమెరాలు) ఏర్పాటయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రాజంపేట ఫారెస్టు డివిజన్లోని రామాపురం వద్ద 2013లో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ఈ చెక్‌పోస్టు వద్ద జిల్లాలోనే ప్రప్రథంగా మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో కూడా ఇటువంటి తరహాలో నిఘానేత్రాలు ఏర్పాటుచేసినట్లు అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఎర్రచందనం అక్రమరవాణా విషయంలో ఇటీవల స్మగ్లర్లు బరి తెగిస్తున్నారు. వాహనాల్లో తరలిస్తున్న క్రమంలో చెక్‌పోస్టులను కొట్టేసుకుని వెళ్లిపోతున్నారు. చెక్‌పోస్టు సిబ్బందిపై దాడికి కూడా దిగుతున్న సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. సీసీకెమెరాలకు అనుబంధంగా ప్రత్యేకంగా ఒక గదిని కూడా నిర్మించారు. ఈ గదిలో బ్రాడ్‌బ్యాండ్ , కంప్యూటర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. రామాపురం చెక్‌పోస్టులో అత్యధిక సంఖ్యలో ఇప్పటికే 90కిపైగా వాహనాలతోపాటు లక్షలాది రూపాయిలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. పైస్థాయి నుంచి పర్యవేక్షణ.. చెక్పోస్టులపై అటవీశాఖ పరంగా పైస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు పర్యవేక్షించేందుకు దశలవారీగా నిఘానేత్రాలను ఏర్పాటుచేస్తున్నారు. రామాపురంలో మూడు సీసీ కెమెరాలను చెక్‌పోస్టు రోడ్డు, గేటు కవర్ అయ్యే రీతిలో ఏర్పాటుచేసుకున్నారు. ఈ కెమెరాల ద్వారా స్థానికంగా ఉండే డీఎఫ్ఓ స్థాయి అధికారులు చెక్‌పోస్టు సిబ్బంది పనితీరును పరిశీలిస్తారు. స్మగ్లర్లతో కుమ్మక్కై ఎర్రచందనం వాహనాలను వదిలివేయడం జరుగుతుందో లేదో అని కూడా సీసీకెమెరాల ద్వారా పసిగట్టేందుకు వీలుంటుంది. వివిధ రకాలుగా వాహనాల్లో ఎర్రబంగారం చెక్‌పోస్టులను దాటుకుని వెళుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. చెక్‌పోస్టులను దాటుకుని అక్రమంగా వెళ్లే వారి వాహనాలను గుర్తించి తర్వాతి ఫారెస్టు స్టేషన్‌కు సమాచారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వాహనం పట్టుబడితే ..మరికొన్ని వాహనాలు చెక్‌పోస్టు దాటుకుని వెళ్లిపోతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న క్రమంలో సీసీకెమెరాలను తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుశాఖకు చేదోడుగా.. నేరాలు..ఘోరాలు చోటుచేసుకుంటున్న తరుణంలో చెక్‌పోస్టులో ఉన్న నిఘానేత్రాలు పోలీసుశాఖకు చేదోడువాదోడుగా నిలవనున్నాయి. రోడ్డు ప్రమాదాలు చేసి తప్పించుకునే వెళ్లే వారిని ఇట్టే పసిగట్టేందుకు అవకాశాలు ఉంటాయి. నేరగాళ్లు సులభంగా వాహనాల్లో తప్పించుకునేందుకు వీలులేకుండా సీసీకెమెరాల ద్వారా పట్టుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.. అటవీ సిబ్బందితోపాటు పోలీసుశాఖ పరంగా కూడా సిబ్బందిని రామాపురం చెక్‌పోస్టు వద్ద నియమించారు. -
ప‘వన’ విజేత
వైవీయూ, న్యూస్‌లైన్ : యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ ఫారెస్టు సర్వీసు ఫలితాల్లో కడప నగరం బాలాజీనగర్‌కు చెందిన గడికోట పవన్‌కుమార్‌రెడ్డి 26వ ర్యాంకు సాధించాడు. రామాపురం మండలం నల్లగుట్టపల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడికోట బాలకృష్ణారెడ్డి, రాజేశ్వరి దంపతుల కుమారుడైన ఈయన విద్యాభ్యాసం అంతా జిల్లాలోనే సాగింది. పాథమిక విద్య రామాపురంలోను, హైస్కూల్ కడప నాగార్జునలోను, ఇంజినీరింగ్ కేఎస్ఆర్ఎం కళాశాలలో పూర్తిచేసిన అనంతరం గేట్లో జాతీయస్థాయిలో 38వ ర్యాంకు సాధించి ముంబయ్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశాడు. అనంతరం టాటాటెక్నాలజీస్ కంపెనీలో సీఏఈ అనలిస్టుగా పనిచేశాడు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రజలకు సేవచేయాలని తరచూ చెప్పే మాటలు ఆయన చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్బాట పట్టాడు. అక్కడ ఒకటిరెండు సార్లు ఒటమి ఎదురైనా కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చిన స్ఫూర్తితో యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తొలిప్రయత్నంలోనే దేశంలోనే 26వ ర్యాంకు సాధించి తన పట్టుదలను చాటాడు. ఐఏఎస్ సాధనకు మరోసారి సివిల్స్ రాసి మెయిన్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ఎంతో సంతోషాన్నిస్తోందని పవన్‌కుమార్‌రెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. పడిన కష్టానికి తగిన ఫలితం దక్కడంతో పాటు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉందన్నాడు. -
పల్లె కన్నీరు
అక్కినేని మృతితో వెంకటరాఘవపురంలో విషాదఛాయలు పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న గ్రామస్తులు కడసారి చూపుకోసం హైదరాబాద్ పయనం నందివాడ, న్యూస్‌లైన్ : ఏఎన్నార్ పుట్టినూరు రామాపురంలో సర్పంచి మొండ్రు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, పెరిగిన పల్లె వెంకటరాఘవపురంలో అక్కినేని పేరిట నిర్మించిన కళాక్షేత్రం వద్ద సర్పంచి మెరుగుమాల సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం నివాళులర్పించారు. నటననే నమ్ముకున్న ఆయన వెండితెరపై నవరసాలను ఒలికించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుని కృష్ణా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. నాలుగో తరగతి వరకు గ్రామంలోనే.. ‘‘అక్కినేని నాలుగో తరగతి వరకు వెంకటరాఘవపురం గ్రామంలో చదువుకున్నారు. అప్పట్లో తల్లితో కలిసి వ్యవసాయం చేసేవారు.. ఆ తర్వాత నాటకాల్లో ఆడ పాత్రలు పోషిస్తూ గుడివాడకు మకాం మార్చారు. అప్పుడు ఆయన్ను ఘంటసాల బలరామయ్య మద్రాసు తీసుకుకెళ్లి సినిమాల్లో వేషాలు ఇప్పించారు...’’ అంటూ గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకొంటూ కని పించారు. అభివృద్ధి భలే చేశారు.. ‘‘సినిమాల్లోకి వెళ్లాక కూడా అక్కినేని అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి బాగోగులు పట్టించుకునేవారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించారు. జన్మభూమి పథకం కింద గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు కూడా నిర్మించారు...’’ అంటూ కొందరు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధిని చర్చించుకున్నారు. బుడమేరుపై వారధి నిర్మాణం.. ‘‘అక్కినేని స్వగ్రామానికి పశ్చిమగోదావరి జిల్లా హద్దుగా ఉండేది. గ్రామం సరిహద్దులో ఉన్నా వెళ్లాలంటే బుడమేరు అడ్డుగా నిలిచింది. దీంతో బుడమేరు డ్రెయిన్‌పై వంతెనను నిర్మింపజేశారు..’’ అంటూ రామాపురం, కుదరవల్లి గ్రామాలకు చెందిన రైతులు చెప్పారు. దీనికి వారు అక్కినేని వారధిగా నామకరణం కూడా చేశారట. విద్యకు ప్రాధాన్యతనిచ్చేవారు.. ‘‘అక్కినేని కుటుంబంలో ఆయనకు మాత్రమే సంతకం చేయడం, చదవడం వచ్చు. అందుకే ఆయన ఎందరికో విద్యాదానం చేశారు. గుడివాడ భూషణగుళ్ల సమీపంలో కళాశాల భవన నిర్మాణానికి పర్వతనేని వెంకటరత్నం, వెంకట్రామయ్య శ్రీకారం చుట్టారు. వారు సినీహీరోగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు సాయం కోరారు. అప్పటికి పెద్దగా సంపాదించకపోయినా విద్యపై ఆమితమైన ఆపేక్షను కనబరుస్తూ కళాశాల నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దాంతో కళాశాలకు ఆయన పేరే పెట్టారు..’’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు. అక్కినేని కళాక్షేత్రం.. ‘‘స్వగ్రామానికి ఎన్నో సేవలందించినందుకు గుర్తుగా గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు వెంకటరాఘవపురంలో కళాకేంద్రాన్ని నిర్మించారు. అందుల్లో ఏఎన్నార్ మధురస్మృతులుగా పాత ఫొటోలను ఏర్పాటుచేశారు.. 2009లో డిసెంబర్ రెండున అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా అక్కినేనితోపాటు ఆయన కుటుంబసభ్యులు వచ్చి కళాకేంద్రాన్ని ప్రారంభించారు...’’ ఇలా పట్టణ ప్రముఖులు ఏఎన్నార్ గొప్పతనాన్ని కీర్తించారు. హైదరాబాద్ బయలుదేరిన గ్రామస్తులు.... అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రామాపురం, వెంకటరాఘవపురం గ్రామాలవారు రాజధాని వెళుతున్నట్లు రామాపురం సర్పంచి వెంకటేశ్వరరావు తెలిపారు. అక్కినేనికి గ్రామం తరఫు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు. -
తెల్లారిన బతుకులు
రామాపురం బీసీ కాలనీకి చెందిన రాజేంద్ర, పెద్ద సుబ్బయ్య, నాగేశ్వరరావు కూలీలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే మేదరపల్లె వద్ద రాళ్లు కొట్టే పనికి వెళ్లాలని ముగ్గురూ జత అయ్యారు. బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేంద్ర , పెద్ద సుబ్బయ్య మృతిచెందారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల బతుకులు తెల్లారిపోయాయి. వారి కుటుంబీకులకు తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. నాగేశ్వరరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. రామాపురం, న్యూస్‌లైన్: కర్నూలు - చిత్తూరు జాతీయ రహ దారిలో రామాపురం మండలం నల్లగుట్టపల్లె పంచాయితీ బీసీ కాలనీ సమీపంలో గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రౌతు రాజేంద్ర(35), గంపా పెద్ద సుబ్బయ్య(40) అనే ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీసీ కాలనీకి చెందిన రౌతు రాజేంద్ర, గంపా పెద్ద సుబ్బయ్య, నాగేశ్వరరావు అనే ముగ్గురు కూలీలు. వీరు రోజూ కాలనీ నుంచి మండలంలోని మేదరపల్లె వద్ద రాళ్లు కొట్టే పనికి వెళుతుంటారు. రోజూ మాదిరిగానే వీరు ముగ్గురూ గురువారం ఉదయాన్నే పనికి వెళ్లాలనుకున్నారు. బైక్‌పై ముగ్గురూ కలసి మేదరపల్లెకు వెళుతుండగా జాతీయ రహదారిలో రాయచోటి నుంచి కడప వైపునకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద సుబ్బయ్య కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన నాగేశ్వరరావు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఇంటి నుండి బయలుదేరిన కొద్ద నిమిషాలకే మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద వార్త తెలియడంతో మృతుల కుటుంబీకులు, కాలనీవాసులంతా ఘటనా స్థలికి చేరుకున్నారు. కన్నీరుమున్నీరయ్యారు. ఎస్ఐ నరసింహరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, గంపా పెద్దసుబ్బయ్యకు భార్య,ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో‘ఇక మాకు దిక్కెవరు’ అంటూ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. -
వివాహేతర సంబంధంతోనే హత్య
రామాపురం, న్యూస్‌లైన్ : రామాపురం మండలంలోని కుమ్మరపల్లె దళితవాడకు చెందిన ఓదేటి వీరప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. వివరాలలోకెళితే .. అదే దళితవాడకు చెందిన ఒక వివాహితతో వీరప్రసాద్ వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. రెండు నెలల క్రితం అతను సదరు మహిళను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఆమె బంగారు నగలను విక్రయించి కాలం గడిపారు. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరప్రసాద్ ఆమెను వెంటబెట్టుకుని స్వగ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు పంచాయతీ చేసి సదరు మహిళను భర్తతో కాపురానికి వెళ్లేలా ఒప్పించారు. ఈ తరుణంలో వివాహేతర సంబంధం నెరపడం ద్వారా తమ కుటుంబాన్ని అవమానపరిచాడన్న తలంపుతో వీరప్రసాద్‌పై సదరు మహిళ భర్త గంగయ్య కక్ష పెంచుకున్నాడు. కాగా వీరప్రసాద్ వీరబల్లి మండలం సానిపాయవద్ద గల కంకర మిషన్‌లో కూలీగా పనిచేసేవాడు. అతనికి మద్యం తాగే అలవాటు వుండేది. తరచుగా అదే దళితవాడకు చెందిన నాగేంద్ర, అంజన్‌కుమార్, చంద్ర తదితరులతో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల అతను స్వగ్రామానికి వచ్చి సమీపంలోనున్న దూదేకులపల్లెలో జరిగే మోహర్రం వేడుకలకు నాగేంద్ర, చంద్ర, గంగయ్య, అంజన్కుమార్లతో కలిసి వెళ్లారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున పీర్లను బండపల్లె పీర్లచావిడికి తీసుకెళుతుండగా వాటి వెంట వెళుతూ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగేందుకు దారిపక్కనే గల పొలంలోకి వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వీరప్రసాద్‌పై గంగయ్య, చంద్ర ,నాగేంద్రలు దాడి చేస్తుండగా ‘నన్ను చంపొద్దు, ఊరు వదలివెళ్లిపోతానంటూ ప్రాధేయపడినా వినకుండా అంజన్‌కుమార్ పెద్ద బండరాాయితో వీర ప్రసాద్ తలపై బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తిరిగి నలుగురు దూదేకులపల్లెకు వెళ్లారు. కాగా అంజన్‌కుమార్ తరచూ వీరప్రసాద్తోపాటు తల్లి వెంకటలక్షుమమ్మను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో అనుమానపడిన ఆమె అంజన్ కుమార్‌ను తన కుమారుడి ఆచూకీ గురించి నిలదీసింది. ఇప్పటికే మీకుమారుడిని చంపాను.. నిన్నుకూడా చంపుతానంటూ అతను వెంకటలక్షుమమ్మను బెదిరించాడు. అప్పటికే వీరప్రసాద్‌ను హత్యచేసినట్లు దళితవాడలో సమాచారం గుప్పుమంది. వెంకటలక్షుమమ్మ తన కుమారుడి హత్య విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారయ్యారు. విచారణలో వీరప్రసాద్‌ను తనతోపాటు పైముగ్గురు కలిసి హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. -
విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు
-
విద్యార్థినిని గర్భవతిని చేసిన గురువు
నల్లగొండ: విద్యార్థులకు చదువు, బుద్ది చెప్పవలసిన గురువే కీచకుడిగా వ్యవహరించాడు. చిలుకూరు మండలం రామాపురం ఓ గురువు తన విద్యార్థినిని గర్భవతిని చేశాడు. ఆ విద్యార్థిని పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఆ బాలికను గర్భవతిని చేశాడు. అంతే కాకుండా ఆ గర్భం తీయించడానికి ప్రయత్నించాడు. ఈ విషయాలు తెలిసి విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. డీఈఓ కలుగజేసుకొని ఆ కీచక గురువుని సస్పెండ్ చేశాడు. -
అనుమానాలు అనేకం
రాయచోటి టౌన్, న్యూస్‌లైన్: ఓ మృతదేహం ఎన్నో సందేహాల ను రేకెత్తిస్తోంది. తలకు బలమైన గాయాలుండడం అనుమానాలకు మరింత బ లం చేకూరుస్తోంది. ఏదేని గుర్తు తెలియ ని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందా? లేక పథకం ప్రకారం ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులేమో ఇది కచ్చితంగా హత్యేన ని పేర్కొంటున్నారు. వాస్తవాలు ఏమిటో పోలీసులే నిగ్గు తేల్చాలి. వెలుగు చూసింది ఇలా... రామాపురం మండలం దిగువబండపల్లె గ్రామం మాదిగపల్లెకు చెందిన బందెల నారాయణమ్మ, పెద్ద గంగులు దంపతుల రెండో కుమారుడైన బందెల ప్రభాకర్ మృతదేహాన్ని రాయచోటి-కడప మార్గంలోని మాసాపేట మిట్ట వద్ద రోడ్డు పక్కన బుధవారం కనుగొన్నారు. తలకు బలమైన గాయమై ఉండడంతో అసలేం జరిగిందన్న విషయం అంతుబట్టడం లేదు. కొందరు రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఉండొచ్చని అంటుండగా, బంధువులు మాత్రం హత్యే అయి ఉంటుందంటున్నారు. తలకు ఓ వైపున కోసినట్లుగా లోతైన గాయం ఉండడం కూడా అనేక సందేహాలకు కారణమవుతోంది. లారీకి ఓ వైపున ఉండే పదునైనా రేకు తగిలి కోసుకుపోవడం వల్ల గాయమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భార్య మరణించిన నాలుగు నెలలకే... బందెల ప్రభాకర్ భార్య కళావతి కాన్పు కష్టమై నాలుగు నెలల కిందటే మరణించినట్లు బంధువులు తెలిపారు. అంతలోనే ఈ సంఘటన జరగడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సానిపాయ వద్దనున్న కంకరమిషన్లో కూలి పనులకు వెళ్లే ప్రభాకర్ వారానికోసారి ఇంటికి వచ్చేవాడని వారు వివరించారు. భార్య చనిపోయినప్పటి నుంచి రెండు వారాలకోసారి మాత్రమే వచ్చేవాడని అతని తల్లి నారాయణమ్మ తెలిపారు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూలి పనులు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగిందని ఆమె బోరున విలపిస్తోంది. అసలు తన కుమారుడు ఇక్కడికి ఎందుకు వచ్చింటాడని ఆమె ప్రశ్నిస్తోంది. పని పూర్తయ్యాక రాయచోటిలోని ఠాణా వద్ద గాని, బస్టాండ్ వద్ద గానీ ఏదైనా వాహనం ఎక్కి ఇంటికి వచ్చేవాడని ఆమె తెలిపింది. ఎటూ కాకుండా మాసాపేట మిట్ట వద్దకు అతను రావాల్సిన అవసరం కూడా లేదంటోంది. దీన్ని బట్టి చూస్తే తన కుమారుడ్ని ఎవరైనా ఏదైనా చేసి ఇక్కడికి తెచ్చి పడేశారేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. కాగా ప్రభాకర్ ఛాతిపై ఎడమ వైపున ‘లక్ష్మీ’ అని పచ్చబొట్టు కూడా ఉండడంపై ఆమె అనుమానం వ్యక్తం చేస్తోంది. సంఘటనా స్థలాన్ని రాయచోటి సీఐ శ్రీరాములు తమ సిబ్బందితో చేరుకున్నారు. ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు ఏమిటో వెల్లడవుతాయి.