రామాపురం బీసీ కాలనీకి చెందిన రాజేంద్ర, పెద్ద సుబ్బయ్య, నాగేశ్వరరావు కూలీలు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే మేదరపల్లె వద్ద రాళ్లు కొట్టే పనికి వెళ్లాలని ముగ్గురూ జత అయ్యారు. బైక్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజేంద్ర , పెద్ద సుబ్బయ్య మృతిచెందారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల బతుకులు తెల్లారిపోయాయి. వారి కుటుంబీకులకు తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. నాగేశ్వరరావు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.
రామాపురం, న్యూస్‌లైన్: కర్నూలు - చిత్తూరు జాతీయ రహ దారిలో రామాపురం మండలం నల్లగుట్టపల్లె పంచాయితీ బీసీ కాలనీ సమీపంలో గురువారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రౌతు రాజేంద్ర(35), గంపా పెద్ద సుబ్బయ్య(40) అనే ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీసీ కాలనీకి చెందిన రౌతు రాజేంద్ర, గంపా పెద్ద సుబ్బయ్య, నాగేశ్వరరావు అనే ముగ్గురు కూలీలు. వీరు రోజూ కాలనీ నుంచి మండలంలోని మేదరపల్లె వద్ద రాళ్లు కొట్టే పనికి వెళుతుంటారు. రోజూ మాదిరిగానే వీరు ముగ్గురూ గురువారం ఉదయాన్నే పనికి వెళ్లాలనుకున్నారు. బైక్‌పై ముగ్గురూ కలసి మేదరపల్లెకు వెళుతుండగా జాతీయ రహదారిలో రాయచోటి నుంచి కడప వైపునకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొంది.
ఈ ప్రమాదంలో రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద సుబ్బయ్య కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన నాగేశ్వరరావు రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఇంటి నుండి బయలుదేరిన కొద్ద నిమిషాలకే మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద వార్త తెలియడంతో మృతుల కుటుంబీకులు, కాలనీవాసులంతా ఘటనా స్థలికి చేరుకున్నారు. కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ నరసింహరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, గంపా పెద్దసుబ్బయ్యకు భార్య,ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో‘ఇక మాకు దిక్కెవరు’ అంటూ కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు.
తెల్లారిన బతుకులు
Published Fri, Dec 20 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement
Advertisement