కాటికి పంపిన కలహాలు
భార్యను నరికి చంపిన భర్త
హతురాలు హాస్టల్ వార్డెన్
అతనిది అంతంత మాత్రం చదువు.. ఆమె ఉన్నత విద్యావంతురాలు. అతను నిరుద్యోగి.. ఆమె ప్రభుత్వోద్యోగి. చిన్నప్పటి నుంచి మేనమామ అంటే ఆమెకు ప్రేమ.. ఒకరికి ఉద్యోగం లేకపోయినా మరొకరికి ఉంది కదా అని సొంత తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత అతనిలో అనుమానపు బీజం మొలకెత్తింది. అది పెనుభూతంగా మారింది. పచ్చని వారి సంసారంలో చిచ్చు రగిల్చింది. భార్యాభర్తల మధ్య అగాధాన్ని సృష్టించింది. తరచూ కలహాలకు కారణమైంది. అదే వారి మధ్య రక్త సంబంధాన్ని తెంచేసింది. తాళి కట్టిన భర్తే వైవాహిక బంధాన్ని ఎగతాళి చే శాడు. భార్యను పట్టపగలే నరికి చంపి హంతకుడిగా మిగిలాడు. - రామాపురం
రామాపురం మండలం నీలకంఠరావుపేట ఎస్సీ బాలికల వసతి గృహం వార్డెన్ గొట్టివీటి లక్ష్మీదేవి(40) గురువారం భర్త గొట్టివీడు శ్రీరాములు చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రామాపురం నుంచి విధి నిర్వహణ నిమిత్తం మధ్యాహ్నం ఆమె నీలకంఠరావుపేటకు ఆటోలో బయలుదేరారు. అదే ఆటోలో శ్రీరాములు కూడా వెళ్లాడు. ఆటోలోనే భ్యాతో అతను గొడవపెట్టుకున్నాడు. మాటామాటా పెరిగింది. అంతలోనే నీలకంఠరావుపేట వచ్చింది. ఇద్దరూ దిగి హాస్టల్ వద్దకు కాలినకడన బయలుదేరారు. హాస్టల్ సమీపించగానే తన వెంట తెచ్చుకున్న మచ్చుకొడవలితో శ్రీరాములు తన భార్య లక్ష్మీదేవిని దారుణంగా నరికాడు. దాడిలో ఆమె చేతులు, తల, శరీరంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న లక్ష్మిదేవిని చూసిన అక్కడి జనం 108కు సమాచారం అందించారు. చాలా సేపటి వరకు అంబులెన్స్ రాకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు వదిలేశారు. స్థానికులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఎస్‌ఐ వెంకటాచలపతి తమ సిబ్బందితో కలసి నేర స్థలానికి చేరుకున్నారు. తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు.
తరచూ గొడవలు..
రామాపురం మండలం మిద్దెకాడపల్లెకు చెందిన లక్ష్మిదేవిని గాలివీడు మండలం కరివిరెడ్డిగారిపల్లెకు చెందిన తన మేనమామ గొట్టివీటి శ్రీరాములుకు 1981లో ఇచ్చి పెళ్లి చేశారు. వారికి ఒక కుమార్తె. ప్రస్తుతం ఆమె తిరుపతిలో ఉండి బీడీఎస్ చదువుతోంది. ఏడాది కిందట లక్ష్మిదేవి నీలక ంఠరావుపేటలోని ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె భర్తతో కలసి రామాపురంలో నివాసముంటున్నారు. ప్రతిరోజూ విధులకు వచ్చివెళ్లేవారు. భార్యపై అనుమానంతో అతను తరచూ ఆమెతో గొడవకు దిగేవాడని సమాచారం. ఈ నేపథ్యంలో అతను ఒకసారి నిద్ర మాత్రలు మింగిన అతను, మరోసారి విషపు మందు తాగినట్లు తెలుస్తోంది.
భయభ్రాంతులకు గురైన విద్యార్థినులు
తమ వార్డెన్‌ను హాస్టల్ సమీపంలోనే భర్త చంపడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు. గతంలో ఇక్కడ పని చేసిన వెళ్లిన హాస్టల్ వార్డెన్ మాధవీలత వెంటనే లక్కిరెడ్డిపల్లె ఏఎస్‌డబ్ల్యూఓకు సమాచారం అందించారు. ఆమె సూచన మేరకు మాధవీలత హాస్టల్‌కు చేరుకుని విద్యార్థినులకు ధైర్యం చెప్పారు. లక్కిరెడ్డిపల్లె సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి నేర ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.