వంటచెరకు సేకరణకని వెళ్లిన ఓ మహిళ గెడ్డలో శవమై తేలింది. వంటచెరకు నరకడానికి ఆమె తీసుకువెళ్లిన కొడవలి తోనే
అగనంపూడి: వంటచెరకు సేకరణకని వెళ్లిన ఓ మహిళ గెడ్డలో శవమై తేలింది. వంటచెరకు నరకడానికి ఆమె తీసుకువెళ్లిన కొడవలి తోనే ఆమె పీక కోసి హతమార్చిన ఈ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. నాలుగు మాసాల క్రితం అండమాన్ నుంచి కూతురింటికి వచ్చిన మహిళ ఇలా కడతేరిపోవడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. కొడవలితో ఆమె పీక కోసి గెడ్డలో పడేయడడంతో ఇందుకు కారకులెవరన్నది మిస్టరీగా మారింది. పరవాడ మండలం, జీవీఎంసీ 56వ వార్డు పరిధిలోని మంత్రిపాలెంకు చెందిన సేనాపతి లక్ష్మి (52) తన ఇద్దరు కుమారులు అప్పారావు, సూరప్పారావు, పెద్ద కూతురు సత్యవతితో కలిసి అండమాన్‌లో ఉంటోంది.
చిన్న కుమార్తె అమ్మాజీ 56వ వార్డులోని మంత్రిపాలెంలో ఉండడంతో నాలుగు మాసాల క్రితం లక్ష్మి అండమాన్ నుంచి వచ్చింది. అల్లుడు స్థిరమైనవాడు కాకపోవడంతో మనుమరాలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఇక్కడే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం రెండున్నరకు గ్రామానికి సమీపంలోని యూకలిప్టస్ తోటలోకి వంటచెరకు కోసం వెళ్లింది. నాలుగు గంటలకు కట్టెల మోపు తెచ్చిన లక్ష్మి మళ్లీ నాలుగున్నరకు తోటలోకి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుమార్తె, మనుమరాళ్లు రాత్రి పది గంటల వరకు పరిసర ప్రాంతాల్లో వెదికారు. మంగళవారం ఉదయం ఆరు గంటలకు మనుమరాలు భారతి మళ్లీ వెతుకుతూ ఉండగా తోటను ఆనుకొని ఉన్న గెడ్డలో లక్ష్మి మృతదేహం కనిపించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. గెడ్డ ఒడ్డున ఉన్న కట్టెల మోపుపై కొడవలికి రక్తపు మరకలు ఉండడం, మెడపై కోసిన గాట్లు ఉండడం, ఆమెను గెడ్డలోకి ఈడ్చుకుని వెళ్లినట్టు ఆధారాలు ఉండడం, చీర ఒడ్డునే ఉండడంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేశారు.