భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై.. | Police Arrested four Accused in Bhimolu Murder Case | Sakshi
Sakshi News home page

భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురితో పెళ్లికోసం.. బావపై..

Published Wed, Oct 5 2022 7:31 AM | Last Updated on Wed, Oct 5 2022 7:31 AM

Police Arrested four Accused in Bhimolu Murder Case - Sakshi

సాక్షి, దేవరపల్లి: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమోలు రోడ్డులో ఇటీవల జరిగిన హత్య కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దేవరపల్లిలోని సర్కిల్‌ కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ (క్రైం) గోగుల వెంకటేశ్వరరావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆకుతీగపాడుకు (ప్రస్తుతం తాడేపల్లిగూడెం) చెందిన మల్లోజు రాజు హత్యకు గురయ్యాడు.

గోపాలపురం – భీమోలు రోడ్డులో పోలవరం కుడి కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తగులబెట్టి ఉందని వీఆర్‌ఓ గోతం తాతారావు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దేవరపల్లి సీఐ ఎ.శ్రీనివాసరావు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిగా తగులబెట్టడంతో హతుడి వివరాలు తెలియరాలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేశారు. హతుని వివరాలు తెలుసుకుని నిందితులను బుట్టాయగూడెం శివాలయం వద్ద మంగళవారం అరెస్టు చేశారు.

భార్యను పుట్టింటికి పంపించి.. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని..
బుట్టాయగూడెం మండలం బుసురాజుపల్లికి చెందిన ఆదిమూలపు ఏసుపాదం ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడికి ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె. సొంత అక్క కూతురును రెండో పెళ్లి చేసుకోవాలనే దురుద్దేశంతో ఏసుపాదం భార్యను పుట్టింటికి పంపాడు. మేడకోడలిని రెండో పెళ్లి చేసుకుంటానంటూ బావ మల్లోజు రాజుపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి రాజు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో అతడిని చంపేయాలని ఏసుపాదం నిర్ణయించుకున్నాడు. ఇందుకు స్నేహితులు బుట్టాగూడేనికి చెందిన దార రామచంద్రరావు, బేతాళ శేఖర్, కొల్లి పవన్‌ కల్యాణ్‌ కుమార్‌లతో కలిసి పథకం రూపొందించాడు. దీని నిమిత్తం రూ.2 లక్షలకు సుపారీ మాట్లాడారు.

చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) 

పథకంలో భాగంగా బావ రాజును ఏసుపాదం తన ఇంటికి పిలిచాడు. అందరూ కలిసి మద్యం తాగారు. ఇంకా మద్యం తాగుదామని చెప్పి వారిని కొల్లి పవన్‌ కల్యాణ్‌ తన కారులో పోగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకువెళ్లాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో రాజు మెడ వెనుక భాగంలో నిందితుల బలంగా కొట్టి హతమార్చారు. సాక్ష్యాలను రూపుమాపడానికి పథ కం ప్రకారం మృతదేహాన్ని కారులో తీసుకుని బయలుదేరారు. కొయ్యలగూడెం వద్ద బంకులో పెట్రోలు కొన్నారు. గోపాలపురం – భీమోలు రోడ్డులో పోలవరం కుడి కాలువ గట్టు వద్దకు తీసుకువచ్చి రాజు మృతదేహంపై పెట్రోలు పోసి తగులబెట్టి వెళ్లిపోయారు.

ఈ కేసును జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అడిషనల్‌ ఎస్పీ వెంకటేశ్వరరావు, కొవ్వూరు డీఎస్పీ బి.శ్రీనాథ్‌ పర్యవేక్షణలో కేసు మిస్టరీని దర్యాప్తు బృందం ఛేదించింది. నిందితులు ఏసుపాదం, రామచంద్రరావు, బేతాళ శేఖర్, పవన్‌ కల్యాణ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, ఇనుప రాడ్డు, రూ.7,500 నగదు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రామచంద్రరావు గతంలో హత్యాయత్నం కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బేతాళ శేఖర్‌ కూడా గతంలో హత్యాయత్నం, పోక్సో కేసులలో రెండుసార్లు జైలుకు వెళ్లాడు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ శ్రీనాథ్, దేవరపల్లి సీఐ ఎ.శ్రీనివాసరావు, దేవరపల్లి, గోపాలపురం ఎస్సైలు కె.శ్రీహరిరావు, కె.రామకృష్ణ, సీసీఎస్‌ ఎస్సై రవీంద్రబాబు, సిబ్బంది పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement