పల్లె కన్నీరు
- అక్కినేని మృతితో వెంకటరాఘవపురంలో విషాదఛాయలు
- పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న గ్రామస్తులు
- కడసారి చూపుకోసం హైదరాబాద్ పయనం
నందివాడ, న్యూస్‌లైన్ : ఏఎన్నార్ పుట్టినూరు రామాపురంలో సర్పంచి మొండ్రు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, పెరిగిన పల్లె వెంకటరాఘవపురంలో అక్కినేని పేరిట నిర్మించిన కళాక్షేత్రం వద్ద సర్పంచి మెరుగుమాల సత్యనారాయణమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం నివాళులర్పించారు. నటననే నమ్ముకున్న ఆయన వెండితెరపై నవరసాలను ఒలికించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుని కృష్ణా జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు.
నాలుగో తరగతి వరకు గ్రామంలోనే..
‘‘అక్కినేని నాలుగో తరగతి వరకు వెంకటరాఘవపురం గ్రామంలో చదువుకున్నారు. అప్పట్లో తల్లితో కలిసి వ్యవసాయం చేసేవారు.. ఆ తర్వాత నాటకాల్లో ఆడ పాత్రలు పోషిస్తూ గుడివాడకు మకాం మార్చారు. అప్పుడు ఆయన్ను ఘంటసాల బలరామయ్య మద్రాసు తీసుకుకెళ్లి సినిమాల్లో వేషాలు ఇప్పించారు...’’ అంటూ గ్రామస్తులు ఒకరికొకరు చెప్పుకొంటూ కని పించారు.
అభివృద్ధి భలే చేశారు..
‘‘సినిమాల్లోకి వెళ్లాక కూడా అక్కినేని అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి బాగోగులు పట్టించుకునేవారు. గ్రామంలో రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలు కల్పించారు. జన్మభూమి పథకం కింద గ్రామంలో రోడ్లు, డ్రెయిన్లు కూడా నిర్మించారు...’’ అంటూ కొందరు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధిని చర్చించుకున్నారు.
బుడమేరుపై వారధి నిర్మాణం..
‘‘అక్కినేని స్వగ్రామానికి పశ్చిమగోదావరి జిల్లా హద్దుగా ఉండేది. గ్రామం సరిహద్దులో ఉన్నా వెళ్లాలంటే బుడమేరు అడ్డుగా నిలిచింది. దీంతో బుడమేరు డ్రెయిన్‌పై వంతెనను నిర్మింపజేశారు..’’ అంటూ రామాపురం, కుదరవల్లి గ్రామాలకు చెందిన రైతులు చెప్పారు. దీనికి వారు అక్కినేని వారధిగా నామకరణం కూడా చేశారట.
విద్యకు ప్రాధాన్యతనిచ్చేవారు..
‘‘అక్కినేని కుటుంబంలో ఆయనకు మాత్రమే సంతకం చేయడం, చదవడం వచ్చు. అందుకే ఆయన ఎందరికో విద్యాదానం చేశారు. గుడివాడ భూషణగుళ్ల సమీపంలో కళాశాల భవన నిర్మాణానికి పర్వతనేని వెంకటరత్నం, వెంకట్రామయ్య శ్రీకారం చుట్టారు. వారు సినీహీరోగా వెలుగొందుతున్న అక్కినేని నాగేశ్వరరావు సాయం కోరారు. అప్పటికి పెద్దగా సంపాదించకపోయినా విద్యపై ఆమితమైన ఆపేక్షను కనబరుస్తూ కళాశాల నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దాంతో కళాశాలకు ఆయన పేరే పెట్టారు..’’ అంటూ అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సిబ్బంది గుర్తుచేసుకున్నారు.
అక్కినేని కళాక్షేత్రం..
‘‘స్వగ్రామానికి ఎన్నో సేవలందించినందుకు గుర్తుగా గ్రామస్తులు, అభిమానులు, స్నేహితులు వెంకటరాఘవపురంలో కళాకేంద్రాన్ని నిర్మించారు. అందుల్లో ఏఎన్నార్ మధురస్మృతులుగా పాత ఫొటోలను ఏర్పాటుచేశారు.. 2009లో డిసెంబర్ రెండున అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి చేతుల మీదుగా అక్కినేనితోపాటు ఆయన కుటుంబసభ్యులు వచ్చి కళాకేంద్రాన్ని ప్రారంభించారు...’’ ఇలా పట్టణ ప్రముఖులు ఏఎన్నార్ గొప్పతనాన్ని కీర్తించారు.
హైదరాబాద్ బయలుదేరిన గ్రామస్తులు....
అక్కినేని పార్థివదేహాన్ని సందర్శించేందుకు రామాపురం, వెంకటరాఘవపురం గ్రామాలవారు రాజధాని వెళుతున్నట్లు రామాపురం సర్పంచి వెంకటేశ్వరరావు తెలిపారు. అక్కినేనికి గ్రామం తరఫు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు.