రామాపురం, న్యూస్‌లైన్ : రామాపురం మండలంలోని కుమ్మరపల్లె దళితవాడకు చెందిన ఓదేటి వీరప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. వివరాలలోకెళితే .. అదే దళితవాడకు చెందిన ఒక వివాహితతో వీరప్రసాద్ వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. రెండు నెలల క్రితం అతను సదరు మహిళను తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి ఆమె బంగారు నగలను విక్రయించి కాలం గడిపారు. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరప్రసాద్ ఆమెను వెంటబెట్టుకుని స్వగ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు పంచాయతీ చేసి సదరు మహిళను భర్తతో కాపురానికి వెళ్లేలా ఒప్పించారు. ఈ తరుణంలో వివాహేతర సంబంధం నెరపడం ద్వారా తమ కుటుంబాన్ని అవమానపరిచాడన్న తలంపుతో వీరప్రసాద్‌పై సదరు మహిళ భర్త గంగయ్య కక్ష పెంచుకున్నాడు. కాగా వీరప్రసాద్ వీరబల్లి మండలం సానిపాయవద్ద గల కంకర మిషన్‌లో కూలీగా పనిచేసేవాడు. అతనికి మద్యం తాగే అలవాటు వుండేది.
తరచుగా అదే దళితవాడకు చెందిన నాగేంద్ర, అంజన్‌కుమార్, చంద్ర తదితరులతో కలిసి మద్యం సేవించేవాడు. ఇటీవల అతను స్వగ్రామానికి వచ్చి సమీపంలోనున్న దూదేకులపల్లెలో జరిగే మోహర్రం వేడుకలకు నాగేంద్ర, చంద్ర, గంగయ్య, అంజన్‌కుమార్‌లతో కలిసి వెళ్లారు. ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున పీర్లను బండపల్లె పీర్లచావిడికి తీసుకెళుతుండగా వాటి వెంట వెళుతూ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగేందుకు దారిపక్కనే గల పొలంలోకి వెళ్లారు. ముందస్తు పథకం ప్రకారం వీరప్రసాద్‌పై గంగయ్య, చంద్ర ,నాగేంద్రలు దాడి చేస్తుండగా ‘నన్ను చంపొద్దు, ఊరు వదలివెళ్లిపోతానంటూ ప్రాధేయపడినా వినకుండా అంజన్‌కుమార్ పెద్ద బండరాాయితో వీర ప్రసాద్ తలపై బాదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
తిరిగి నలుగురు దూదేకులపల్లెకు వెళ్లారు. కాగా అంజన్‌కుమార్ తరచూ వీరప్రసాద్‌తోపాటు తల్లి వెంకటలక్షుమమ్మను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో అనుమానపడిన ఆమె అంజన్ కుమార్‌ను తన కుమారుడి ఆచూకీ గురించి నిలదీసింది. ఇప్పటికే మీకుమారుడిని చంపాను.. నిన్నుకూడా చంపుతానంటూ అతను వెంకటలక్షుమమ్మను బెదిరించాడు. అప్పటికే వీరప్రసాద్‌ను హత్యచేసినట్లు దళితవాడలో సమాచారం గుప్పుమంది. వెంకటలక్షుమమ్మ తన కుమారుడి హత్య విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా పరారయ్యారు. విచారణలో వీరప్రసాద్‌ను తనతోపాటు పైముగ్గురు కలిసి హత్యచేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.
వివాహేతర సంబంధంతోనే హత్య
Published Thu, Nov 21 2013 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement