ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఈరోజు(సోమవారం) ఐదో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైనా యూపీలోని ఒక గ్రామంలో ఇప్పుటికీ ఒక్క ఒటు కూడా పడలేదు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం యూపీలోని కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో గ్రామానికి చెందిన వేలాది మంది గ్రామస్తులు ఓటు వేయడానికి నిరాకరించారు. గ్రామంలోని కూడలి వద్ద ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. అయితే ఓటరు కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటర్ల కోసం వేచి చూస్తున్నారు. మధ్యాహ్నం కావస్తున్నా ఒక్కరు కూడా ఓటు వేయలేదు.
గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, దీనిపై ఇంత వరకు ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా నోరు మెదపలేదని వారు మీడియా ముందు వాపోయారు. అందుకే తాము ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. గ్రామపెద్ద వీరేంద్ర యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని, రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తున్నదన్నారు. గ్రామానికి చెందిన పిల్లలు చదువుకోడానికి రైల్వే లైన్ దాటి వెళుతున్నారన్నారు.
తాము ఇక్కడి రైల్వేలైన్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులు కోరగా హామీ ఇచ్చి, దానిని విస్మరించారన్నారు. గ్రామస్తులంతా పోలింగ్ కేంద్రం బయటే నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వారిని ఒప్పుంచేందుకు ప్రయత్నించినా , వారు తమ డిమాండ్లు నెరవేరేవరకూ ఓటు వేయబోమని తెగేసి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment