
ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించేందుకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఈవీఎంలు తెరవనున్నారు. 8.30 గంటల నుంచి ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లు మొదలు కానున్నాయి.
ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు వెయ్యి సీసీ కెమెరాలు కౌంటింగ్ కేంద్రంలోని ఈవీఎంలపై నిఘా ఉంచుతాయి. ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, ఇతర బ్యాలెట్ పేపర్‌లను పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 100కు పైగా కెమెరాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల ఎన్నికల ఫలితాలపై మధ్యాహ్నం 12 గంటలకల్లా ఒక స్పష్టత వస్తుందని ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశం ఉందని అన్నారు.
మే 25న ఢిల్లీలో జరిగిన లోక్‌సభ పోలింగ్‌లో 58.70 శాతం ఓటింగ్ జరిగింది. రెండు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచారు. ఢిల్లీలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. 15 నుంచి 18 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment