మరో ఇద్దరిని కాపాడిన స్నేహితులు
రెండురోజులు గడవకముందే బాపట్ల జిల్లా రామాపురం బీచ్‌లో మరో ఘటన
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.
సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.
అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment