మృత్యువును వెతుక్కుంటూ వెళ్లారు!
మరికొన్ని గంటల్లో తెల్లారుతుంది. అప్పటిదాకా బోరు తవ్వకాన్ని ఆసక్తిగా గమనించిన వారు పచ్చటి పంట పొలంలో నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపట్లోనే గాఢనిద్రలోకి జారుకున్నారు. అదే ‘శాశ్వత నిద్ర’ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. బోర్‌వెల్ లారీ రూపంలో మృత్యువు వారిని కబళించుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. శెట్టూరు మండలం పర్లచేడులో శనివారం తెల్లవారుజామున బోర్‌వెల్ లారీ దూసుకెళ్లి నలుగురు దుర్మరణం చెందారు.
వారంతా రెక్కల కష్టంపై ఆధారపడ్డ కూలీలు.. ఉగాది పండుగ కావడంతో ఇంటి పట్టునే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి హాయిగా పండుగ చేసుకున్నారు. రాత్రైంది. అంతా కలసి భోజనాలు చేశారు. ఎంతకూ నిద్ర రాకపోవడంతో గ్రామ సమీపంలో బోరు వేస్తున్నారని అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రయ్యేసరికి అలసటకు తోడు చల్లని గాలి వీచడంతో వారంతా పొలంలోనే నిద్రించారు. అంతే.. బోరుబండి వారి జీవితాలను బుగ్గి చేసింది. తెల్లారేసరికి ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ఊరంతా ఉలిక్కిపడింది. చనిపోయిన నలుగురి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.
కళ్యాణదుర్గం : ప్రమాదవశాత్తు బోర్‌వెల్ లారీని రివర్స్‌లో నడపగా వెనుక భాగంలో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో శెట్టూరు మండలం పర్లచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో బోయ సంజీవ (38), బోయ తిమ్మప్ప (35), బోయ మాంతేష్ (30), నరసింహమూర్తి (28) మృతి చెందారు. ఒకేరోజు నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దలు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆయా కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. మృతులంతా కూలీ పని చేసుకుని కుటుంబాల్ని పోషించుకునేవారు. అలాంటి వారు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబ సభ్యుల పోషణ చూసే వారు కరువయ్యారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతుల కుటుంబ స భ్యులు, భార్యలు, పిల్లల రోధనలు చూపరులను కలిసివేశాయి. ‘మాకు ఇక దిక్కెవరంటూ.. గుండెలు బాదుకుని రోధించారు.’
మృతులంతా కూలీలే...
ప్రమాదంలో మృతి చెందిన బోయ సంజీవ, బోయ తిమ్మప్ప, బోయ మాంతేష్, నరసింహమూర్తి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సంజీవ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య నాగలక్ష్మి, కుమార్తె బుజ్జెమ్మ, కొడుకు తిప్పేస్వామి ఉన్నారు. బోయ తిమ్మప్ప స్వగ్రామం బొచ్చుపల్లి కాగా పదేళ్ల క్రితం పర్లచేడులో బయలమ్మను పెళ్ళి చేసుకుని అదే గ్రామంలో స్థిరపడ్డాడు. బోయ మాంతేష్ కూడా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మిదేవి, 18 నెలల కూతురు అక్షిత ఉన్నారు. నరసింహమూర్తి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వికలాంగురాలైన తల్లి హనుమక్క ఆలనాపాలన కోసం టైలర్ పనిచేస్తూ కాలం గడిపేవాడు.
మృతుల్లో ఇద్దరు బావ, బామర్దులు, మరో ఇద్దరు స్నేహితులు..
మృతుడు సంజీవ పిన తల్లి సుశీలమ్మ కూతురు బయలమ్మను మృతుడు తిమ్మప్ప పెళ్ళిచేసుకోగా వీరిద్దరూ బావ, బామర్దులు. అదేవిధంగా మృతుడు సంజీవ, నరసింహమూర్తి ప్రాణస్నేహితులు. ఎక్కడికెళ్లాలన్నా కలిసిమెలిసి వెళ్లేవారు. చివరికి మరణంలో కూడా వారి బంధం వీడలేదు.
కాగా... రెవెన్యూ అధికారులు వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దీంతో అమాయకులైన పేదలు నలుగురు బలి కావాల్సి వచ్చిందని శెట్టూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతదేహాలతో శెట్టూరులో బైఠాయించి ఆందోళన చేపట్టారు.