Borvel
-
పేలుళ్లతో పరేషాన్..!
► పగుళ్లు తేలుతున్న గృహాలు ► విపరీతమైన ధ్వని కాలుష్యం ►ఎండిపోయిన బావులు ► హామీలు పట్టించుకునే అధికారులు కరువయ్యారు కాసిపేట : సింగరేణి అధికారులు హామీలకు మాత్రమే పరిమితం కావడం మినహా సంస్థ ద్వారా నష్టపోతున్న వారిని పట్టించుకోవడం లేదు. కాసిపేట భూగర్భ గని ద్వారా తీవ్రంగా నష్టపోతున్నట్లు ముత్యంపల్లి, కాసిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి ఏరియా కాసిపేటగని ప్రారంభమైన 20 ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముత్యంపల్లి వాసులు వాపోతున్నారు. గని పని స్థలాలు గ్రామం కింద నడుస్తుండటంతో గృహాలు పగుళ్లు తేలుతూ కూలిపోయే దశకు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గని పేలుళ్లకు ఇంటి గోడలు నెర్రెలు బారి సామగ్రి కింద పడుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో నలభై శాతం గృహాలు పగుళ్లు తేలినట్లు సింగరేణి, రెవెన్యూ అధికారులు గతంలో సర్వేచేసి నిర్ధరించారు. పరిహరం అందజేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పట్టించుకోవడం లేదని కాసిపేట ముత్యంపల్లి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనిస్థలాల్లో సక్రమంగా ఇసుక నింపక పొవడం గ్రామం క్రింద పనులు నడవడటంతో గ్రామస్తులంతా ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో కనీసం ఒక్క బావి లేకుండా ఎండిపోగా కనీసం బోర్వెల్ వేసినా పనిచేసే పరిస్థితి లేదని దీంతో సింగరేణి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. జాయింట్సర్వే ఏమైనట్లు సింగరేణి అధికారులు పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి పరిహారం చెల్లిస్తామని ఇందుకోసం జాయింట్ సర్వేచేసి నివేదిక రూపించనున్నట్లు చెప్తూవస్తున్నారు. జాయింట్సర్వే, నష్టపరిహరం ఏమైనట్లు అని స్థానికులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. గతం నుంచి రెవెన్యూ, సింగరే ణి అధికారులు పగుల్లు తేలిన ఇళ్లు, ఎండిపోయి న బావులు, గని ద్వారా జరిగిన నష్టాన్ని జా యింట్ సర్వే చేసి పరిహారం అందజేస్తామని సింగరేణి అధికారులు హమీలు ఇస్తూ వచ్చారు. 2012లో బుంగ పడ్డ సందర్భంలో ఉన్నాతాధికారులు పరిశీలించి గృహాలను చూసి విస్తుపోయా రు. పరిహరం అందించె భాధ్యత మాదే అయి నా అంచనా వ్యయం రెవెన్యూ, ఇంజనీరింగ్ అ ధికారులతో సర్వే చేయించి పరిహారం నిర్ణయిం చాల్సి ఉందని త్వరలో సర్వే చేపిస్తామన్నారు. అధికారులు మారుతున్నా నేటికీ పరిహారం ఊ సేలేదు.అలాగే భూగర్భ గనుల వల్ల తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేలుళ్ల సమయంలో తీవ్ర ధ్వని కాలుష్యం, ఇంటి గోడలు నెర్రెలు బారుతున్నాయని పరిహారం అందించి తమను ఆదుకోవాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పేలుళ్ల తాకిడికి తట్టుకోలేకపోతున్నాం ఇండ్ల కింద పనులు నడుస్తుండటంతో గనిలో జరిగే పేలుళ్ల శబ్ధం తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లోని సామాగ్రి కిందపడుతోంది. ప్రహరీ గోడలు కూలిపోతున్నాయి. నిర్మించుకున్న ఇళ్లు పగుల్లు తేలాయి. సింగరేణి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ, అధికారులు పాలకులు శ్రద్ధ పెట్టి పరిహారం అందించెలా చూడాలి.- కుర్మ నర్సయ్య నీటి చుక్క లేకుండా పోయింది.. కాసిపేటని ఏర్పాటు చేసిన నాటి నుంచి ముత్యంపల్లి, కాసిపేట గ్రామాలలో నీటిచుక్క లేకుండా పోయింది. వందల సంఖ్యలో బావులు ఎండిపోయాయి. ఇళ్లు పగుల్లు తేలుతున్నట్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులు సింగరేణి వాళ్లపై చెప్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలి. - బోగె రాజారాం అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టిం చుకోవడం లేదు. నష్టం సింగరేణి ద్వా రా జరుగుతున్నా దాన్ని నివేదించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద లే దా? ఏదైనా ఘటన జరిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు సింగరేణి అధికారులు సర్వే చేపించి పరిహారం అందిస్తామంటారు. మళ్లీ కనిపిం చారు. నష్టపోతున్న బాధితులకు అధికారులు, పాలకులు సహకరించి పరిహరం అందించాలి. - జాడి మల్లేష్ -
మృత్యువును వెతుక్కుంటూ వెళ్లారు!
మరికొన్ని గంటల్లో తెల్లారుతుంది. అప్పటిదాకా బోరు తవ్వకాన్ని ఆసక్తిగా గమనించిన వారు పచ్చటి పంట పొలంలో నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపట్లోనే గాఢనిద్రలోకి జారుకున్నారు. అదే ‘శాశ్వత నిద్ర’ అవుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. బోర్వెల్ లారీ రూపంలో మృత్యువు వారిని కబళించుకుపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. శెట్టూరు మండలం పర్లచేడులో శనివారం తెల్లవారుజామున బోర్వెల్ లారీ దూసుకెళ్లి నలుగురు దుర్మరణం చెందారు. వారంతా రెక్కల కష్టంపై ఆధారపడ్డ కూలీలు.. ఉగాది పండుగ కావడంతో ఇంటి పట్టునే ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలసి హాయిగా పండుగ చేసుకున్నారు. రాత్రైంది. అంతా కలసి భోజనాలు చేశారు. ఎంతకూ నిద్ర రాకపోవడంతో గ్రామ సమీపంలో బోరు వేస్తున్నారని అక్కడికి వెళ్లారు. అర్ధరాత్రయ్యేసరికి అలసటకు తోడు చల్లని గాలి వీచడంతో వారంతా పొలంలోనే నిద్రించారు. అంతే.. బోరుబండి వారి జీవితాలను బుగ్గి చేసింది. తెల్లారేసరికి ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో ఊరంతా ఉలిక్కిపడింది. చనిపోయిన నలుగురి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. కళ్యాణదుర్గం : ప్రమాదవశాత్తు బోర్వెల్ లారీని రివర్స్‌లో నడపగా వెనుక భాగంలో నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో శెట్టూరు మండలం పర్లచేడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో బోయ సంజీవ (38), బోయ తిమ్మప్ప (35), బోయ మాంతేష్ (30), నరసింహమూర్తి (28) మృతి చెందారు. ఒకేరోజు నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో ఎక్కడ చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దలు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆయా కుటుంబాలకు తీరని నష్టం జరిగింది. మృతులంతా కూలీ పని చేసుకుని కుటుంబాల్ని పోషించుకునేవారు. అలాంటి వారు మృత్యువాత పడటంతో బాధిత కుటుంబ సభ్యుల పోషణ చూసే వారు కరువయ్యారు. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. మృతుల కుటుంబ స భ్యులు, భార్యలు, పిల్లల రోధనలు చూపరులను కలిసివేశాయి. ‘మాకు ఇక దిక్కెవరంటూ.. గుండెలు బాదుకుని రోధించారు.’ మృతులంతా కూలీలే... ప్రమాదంలో మృతి చెందిన బోయ సంజీవ, బోయ తిమ్మప్ప, బోయ మాంతేష్, నరసింహమూర్తి కూలీ పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సంజీవ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య నాగలక్ష్మి, కుమార్తె బుజ్జెమ్మ, కొడుకు తిప్పేస్వామి ఉన్నారు. బోయ తిమ్మప్ప స్వగ్రామం బొచ్చుపల్లి కాగా పదేళ్ల క్రితం పర్లచేడులో బయలమ్మను పెళ్ళి చేసుకుని అదే గ్రామంలో స్థిరపడ్డాడు. బోయ మాంతేష్ కూడా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మిదేవి, 18 నెలల కూతురు అక్షిత ఉన్నారు. నరసింహమూర్తి టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వికలాంగురాలైన తల్లి హనుమక్క ఆలనాపాలన కోసం టైలర్ పనిచేస్తూ కాలం గడిపేవాడు. మృతుల్లో ఇద్దరు బావ, బామర్దులు, మరో ఇద్దరు స్నేహితులు.. మృతుడు సంజీవ పిన తల్లి సుశీలమ్మ కూతురు బయలమ్మను మృతుడు తిమ్మప్ప పెళ్ళిచేసుకోగా వీరిద్దరూ బావ, బామర్దులు. అదేవిధంగా మృతుడు సంజీవ, నరసింహమూర్తి ప్రాణస్నేహితులు. ఎక్కడికెళ్లాలన్నా కలిసిమెలిసి వెళ్లేవారు. చివరికి మరణంలో కూడా వారి బంధం వీడలేదు. కాగా... రెవెన్యూ అధికారులు వాల్టా చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దీంతో అమాయకులైన పేదలు నలుగురు బలి కావాల్సి వచ్చిందని శెట్టూరులో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మృతదేహాలతో శెట్టూరులో బైఠాయించి ఆందోళన చేపట్టారు.