ఆడుకుంటూ నీటి గుంతలో పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన వైఎస్సార్‌జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఇందిరానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే మేదరి రాజు (10) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. అతడి కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించలేదు. కాగా, ఆదివారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది తీసిన గుంతలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. వర్షానికి ఆ గుంతలో నీరు చేరి ఉండడంతో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందినట్టు తెలుస్తోంది. రాజు చిన్నప్పుడే తల్లిదండ్రులు మృతి చెందడంతో పెద్దనాన్న వద్ద ఆశ్రయం పొందుతున్నాడు.