వృద్ధురాలి దారుణ హత్య
పట్టపగలే కనకాద్రిపల్లెలో
ఘటనదర్యాప్తు
చేపట్టిన పోలీసులు
కొలిమిగుండ్ల: పట్టపగలు ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. కొలిమిగుండ్ల మండల పరిధిలోని కనకాద్రిపల్లె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కనకాద్రిపల్లెకు చెందిన బోయలదిన్నె వెంకటలక్ష్మమ్మ(63) ప్రధాన రహదారి పక్కన ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకుంది. నాలుగు నెలల క్రితం భర్త భూషన్న అనారోగ్యంతో మృతి చెందాడంతో ఆ ఇంట్లోనే జీవనాధారంగా బట్టలు,చెప్పుల దుకాణం నడుపుకుంటుంది. గురువారం ఉదయం ఒంటరిగా ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి అతి కిరాతకంగా గొంతు కోసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో ఈమె ఇంటి పక్కనే ఉన్న టీకొట్టుకు పాలు పోసేందుకు వచ్చిన మహిళ రక్తం మడుగులో ఆచేతనంగా పడి ఉన్న వెంకటలక్ష్మమ్మను గుర్తించి స్థానికుల తెలియజేసింది. వీరు పోలీసులకు సమాచారమివ్వడంతో కోవెలకుంట్ల సీఐ పీటీ కేశవరెడ్డి,ఎస్‌ఐ పులిశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గంగాదేవిపల్లె సమీపంలోని ఇగుడూరు గంగమ్మ ఆలయంలో పూజారిగా పని చేసే విషయంలో కొంత కాలం నుంచి సమీప బంధువులతో మృతురాలికి వివాదం నడుస్తోంది. ఈ విషయంలోనే అడ్డుతొలగించుకోవాలనే ఉద్దేశంతో వెంకటలక్ష్మమ్మను దారుణంగా హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా వారికి వివాహాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.