
నేటినుంచి బడ్జెట్ సమావేశాలు
- ఉదయం 8.55 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం
- అనంతరం బీఏసీ సమావేశంలో ఎజెండాపై నిర్ణయం
- 12న బడ్జెట్.. 13న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ సమర్పణ
- వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు
- అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ
- మరోవైపు ప్రతిపక్షం దాడిని ఎదుర్కొనేందుకు అధికారపక్షం సన్నాహాలు..
హైదరాబాద్: రాష్ట్ర 14వ శాసనసభ నాలుగో విడత(బడ్జెట్) సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. తొమ్మిది నెలల పాలనా కాలంలో చేపట్టిన కార్యక్రమాలను సభలో వినిపించడంతోపాటు విపక్షం నుంచి వచ్చే విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు అధికార టీడీపీ వ్యూహాలకు పదును పెడుతుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణం, భూసమీకరణ, వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ తదితర అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలనుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సభలో వీటిపై సెగలు రేగనున్నాయి. రాజధాని ప్రాంతంలో భూసమీకరణను అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు మద్దతుగా నిలిచారు. వామపక్షాలు కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. అధికారపక్షం తన వాదనలను సిద్ధం చేస్తోంది.
ఉభయసభల నుద్దేశించి గవర్నర్ ప్రసంగం..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 8.55 గంటలకు ఏపీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. తర్వాత సభ నిర్వహణ అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం నిర్ణయించనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ను 12వ తేదీన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు.ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సభకు సమర్పిస్తారు. సెలవుదినాలు పోను సభ 16 రోజులు జరిగే అవకాశముంది.
అధికారపక్షం అంశాలివే...
శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం నుంచి తీవ్రస్థాయిలో విమర్శల దాడి తప్పదని భావిస్తున్న అధికార తెలుగుదేశం పార్టీ దాన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇతర అంశాలను తెరపైకి తేవడం ద్వారా ప్రధానాంశాలను పక్కదారి పట్టించేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చి సిద్ధం చేయిస్తోంది. అదే సమయంలో సభలో తాను లేవనెత్తాల్సిన అంశాలను కూడా అధికారపక్షం సిద్ధం చేసింది. రైతు రుణమాఫీ, రైతు సాధికార సంస్థ ఏర్పాటు, డ్వాక్రా రుణాల మాఫీ, మహిళా సాధికార కమిటీ ఏర్పాటు, చంద్రన్న కానుక వంటి అంశాలను ప్రస్తావించనుంది. రాజధాని నిర్మాణం, భూసమీకరణ వివాదం, వేసవిలో విద్యుత్తు సరఫరా, తాగునీటి సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నందున వాటిపై సమాధానాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై,పట్టిసీమ వ్యవహారంపై ఆరోపణలు వస్తుండడంతో సమాధానాలను రూపొందించుకుంటోంది.
ప్రజాసమస్యలపై ప్రధాన ప్రతిపక్షం..
ప్రజాసమస్యలను అసెంబ్లీలో చర్చకు లేవనెత్తేందుకు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజధానికి భూ సమీకరణలో రైతుల మనోవ్యథను సభద్వారా ప్రభుత్వానికి వినిపించాలని నిర్ణయించింది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ అంటూ వారిని ప్రభుత్వం మోసగించిన వైనాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులపై పడిన వడ్డీ భారం, కొత్త రుణాలు అందకుండా పోవడం తదితర అంశాలను ప్రస్తావించనుంది. డ్వాక్రా రుణాలపై సేవాపన్ను వేయడాన్ని ప్రస్తావించనుంది. వ్యవసాయ విద్యుత్తుకు మంగళం పాడేందుకు ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలపై నిలదీయనుంది. విద్యుత్తు చార్జీల పెంపుపై ఈఆర్సీ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం చార్జీల పెంపునకు ప్రభుత్వం పావులు కదుపుతుండడాన్ని ఎండగట్టనుంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, ప్రత్యేకహోదాను సాధించడంలో, పోలవరంతోపాటు వివిధ ప్రాజెక్టులకు నిధులు పొందడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సభలో ప్రస్తావించి నిరసన తెలియచేయనుంది. ెగవర్నర్ గతంలో నిలిపివేసిన జీఓ నం.22 పునరుద్ధరణను నిరసించనుంది. పట్టిసీమ అంశాన్నీ ప్రస్తావించనుంది.
రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి..
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. పక్కపక్కనే రెండు అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు పోలీసులకు సవాలుగా మారాయి. ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులను మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రవేశమార్గాల్లో కొన్ని మార్పులు చేశారు. సందర్శకులకు అనుమతి లేదు. గ్యాలరీలోకి కూడా పరిమిత సంఖ్యలోనే పాసులు జారీచేయాలని నిర్ణయించారు.