ఆ ఎద్దు పొలంలో దిగితే..
రాయదుర్గం రూరల్: ఒంటెద్దు గొర్రు అని చిన్నచూపుచూడొద్దు.. తన ఎద్దు తలచుకుంటే జోడెద్దుల గొర్రునే తలదన్నుతుందని నిరూపించాడు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలానికి చెందిన వన్నూరుస్వామి. రాయదుర్గం మండలం కొంతానపల్లిలో ఆదివారం ఒంటెద్దు గొర్రుతో ఏకంగా 12 ఎకరాల్లో వేరుశెనగ విత్తనాలు విత్తి ఔరా అనిపించాడు.
సూర్యుడు ఉదయించి.. అస్తమించే లోపు ఈ పని పూర్తిచేశాడు. సాధారణంగా జోడెద్దుల నాలుగుసాళ్ల గొర్రుతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల్లో విత్తనం వేయవచ్చు. అయితే.. వన్నూరుస్వామి ఒంటెద్దు గొర్రుతోనే 12 ఎకరాల్లో విత్తనం వేయడాన్ని రైతులు ఆసక్తిగా గమనించారు. ఈ దృశ్యాన్ని పరిసర ప్రాంత రైతులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించారు.