bommanahal
-
భర్త రెండో పెళ్లి.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొదటి భార్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ నివాసి సుధాకర్‌కు విడపనకల్లు మండలం మల్లాపురానికి చెందిన శ్రీలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. కొన్ని రోజులుగా శ్రీలేఖకు దూరంగా వచ్చిన సుధాకర్.. గురువారం ఉదయం కుటుంసభ్యులతో కలసి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన యువతిని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీలేఖ వెంటనే బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ అనంతరం సుధాకర్‌తో పాటు అతణ్ని రెండో వివాహానికి ప్రేరేపించిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ) -
కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో..
సాక్షి, బొమ్మనహాళ్ (అనంతపురం): అనామకుడు కాదు.. చదువు సంధ్య లేని వాడు అంతకంటే కాదు. సమాజంలో తనకంటూ ఓ గుర్తింపుతో ఉత్తముడిలా చలామణి అవుతున్న వ్యక్తి. అయితే కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలాంటి విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వ్యాయామ విద్యతో విద్యార్థుల శారీరక దృఢత్వానికి బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడే వక్ర బుద్ధిని చూపించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా.. బొమ్మనహాళ్ మండలం శ్రీధరఘట్టలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం పదో తరగతి విద్యార్థిని ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. చదవండి: (దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి) అతని మాట తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వాట్సాప్‌లో ఆడియో చాటింగ్‌లో వ్యాయామ ఉపాధ్యాయుడి మాటలు ఉన్నాయి. తన భార్యకు ఏడాదిగా ఆరోగ్యం సరిగా లేదని, పాఠశాలలోని తన గదిలోకి ఒంటరిగా వచ్చి తన కోరిక తీరిస్తే ఏమి కావాలన్నా తాను చూసుకుంటాననే ఉపాధ్యాయుడి మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చదవండి: (పుస్తకాలు బస్టాప్‌లో.. స్రవంతి హెచ్చెల్సీలో దూకి..) ఈ విషయం తెలుసుకున్న వెంటనే వ్యాయామ ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెట్టి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. ప్రధానోపాధ్యాయుడి దృష్టికి కామాంధుడి వైఖరిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమ బాట పడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. -
విషాదం.. తండ్రీకొడుకు జలసమాధి
సాక్షి, బొమ్మనహాళ్: శిద్దరాంపురంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయి కుమారుడు, రక్షించబోయి తండ్రి నీటమునిగి చనిపోయారు. ఎస్ఐ నాగమధు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జిలాన్ (35) లారీ డ్రైవర్‌గా వెళ్తూ పొలం పనులు కూడా చూసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆదివారం ఉదయం జిలాన్ తన కుమారుడు మహమ్మద్ గౌస్ (7)తో పాటు మరో బాలుడు ఆదివారం ఉదయం పొలం చూడటానికి వెళ్లారు. అక్కడ ఉన్న వ్యవసాయ బావిలో నీటిని చూద్దామని ప్రయత్నించిన మహమ్మద్ గౌస్ అదుపుతప్పి నీటిలో పడ్డాడు. కుమారుడిని రక్షించేందుకని జిలాన్ వెంటనే బావిలోకి దూకాడు. ఇద్దరూ నీటిలో మునిగి పైకి రాలేకపోయారు. వెంట వెళ్లిన మరో బాలుడు కేకలు వేయడంతో గ్రామ సమీపంలోని ప్రజలు బావి వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. ఎంతసేపటికీ ఆచూకీ లభించకపోవడంతో చివరకు గ్రామంలోని గజ ఈతగాళ్లను పిలిపించారు. మధ్యాహ్నానికి తండ్రీకొడుకులు జిలాన్, మహమ్మద్ గౌస్‌ల మృతదేహాలు వెలికితీశారు. వీరు బురదలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందారు. జిలాన్‌కు భార్య ఫరీదా, కుమార్తె రోషిణి ఉన్నారు. ఎస్ఐ నాగమధు కేసు నమోదు చేశారు. -
జిల్లాలో విస్తారంగా వర్షాలు
- అనంతపురం, బొమ్మనహాల్‌లో భారీ వర్షం - వారం రోజుల్లోనే 71 మి.మీ వర్షపాతం నమోదు అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పగలు ఎండ, రాత్రి వానతో గత వారం రోజులుగా పది మండలాలు మినహా మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. 71 మి.మీ భారీ వర్షపాతం నమోదయ్యింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 71.3 మి.మీ నమోదైంది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 55 మండలాల పరిధిలో 10.4 మి.మీ సగటు వర్షం కురిసింది. అందులో అనంతపురం, బొమ్మనహాల్ మండలాల్లో అత్యధికంగా 48.9 మి.మీ చొప్పున వర్షం పడింది. రొద్దం, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, పుట్లూరు, రాయదుర్గం, కూడేరు తదితర ఏడెనిమిది మండలాల్లో వేరుశనగ, ఆముదం, పత్తి, మిరప, టమోటా, కర్బూజా, కళింగర లాంటి పంటలకు రూ.70 లక్షల నుంచి రూ.ఒక కోటి వరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. శుక్రవారం కూడా గుత్తిలో గుడిసె కూలబడి 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వారం రోజులుగా జిల్లా అంతటా వర్షం పడుతున్నా ఎన్పీకుంట మండలంలో కేవలం 12.9 మి.మీ, బ్రహ్మసముద్రం మండలంలో 16.9 మి.మీ, యల్లనూరులో 27.9 మి.మీ మాత్రమే కురిసింది. అలాగే రొళ్ల, గోరంట్ల, మడకశిర, గుమ్మగట్ట, తలుపుల, తనకల్లు, రాయదుర్గం, ఉరవకొండ, యాడికి మండలాల్లో కూడా వర్షపాతం 50 మి.మీ లోపు నమోదైంది. -
ఇంటర్ విద్య.. మిథ్య!
ఇది బొమ్మనహాల్ మండల కేంద్రంలోని ఫెర్రర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు నిర్వహిస్తుండగా.. 235 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 12 మంది అధ్యాపకులు అవసరం కాగా.. ఒక రెగ్యులర్, ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే పని అందుబాటులో ఉన్నారు. ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇంగ్లిష్ అధ్యాపకునికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అధ్యాపకుల కొరత కారణంగా ఎంపీసీ గ్రూపులో ఈ విద్యా సంవత్సరం ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి. బోధన కుంటు పడటంతో పది మంది విద్యార్థులు ఇటీవల టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి నెలకొంది. - అనంతపురం(ఎడ్యుకేషన్): -
అక్కడక్కడ తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. బొమ్మనహాల్ 23.6 మి.మీ, ఉరవకొండ 21.6 మి.మీ, పరిగి 20.4 మి.మీ వర్షం పడింది. డి.హిరేహాల్, విడపనకల్, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, రాయదుర్గం, అమడగూరు, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 46.1 మి.మీ నమోదైంది. -
మిరప నారుకు డిమాండ్
బొమ్మనహాళ్: హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో మిరపనారుకు డిమాండ్ పెరిగింది. బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్, దేవగిరి, ఉంతకల్లు, కర్ణాటక బెంచికొట్టాల వద్ద ఎర్రనేలలతో పాటు నీరు సమృద్ధిగా ఉండటంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు రైతులు బ్యాడిగి, గంగావతి, రాయచూరు ప్రాంతాల నుంచి నాణ్యమైన మిరప విత్తనాలను సేకరించి నారు పెంచుతున్నారు.ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదల సమయం దగ్గరపడడంతో చాలా మంది మిరపనారు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా హెచ్చెల్సీకి నీరు విడుదలకు మందుగా 45 రోజుల మిరప పైరును సిద్ధం చేసుకున్నారు. -
వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవం
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్‌లో అశేష జనవాహిన మధ్య వెంకటేశ్వరస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, రథాంగ హోమం, రథ బలి, మాలవీధుల మడుగు రథోత్సవం చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సాయంత్రం శ్రీవారిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అనంతరం రథోత్సవంపై ఆసీనులు చేశారు. అనంతరం రథోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు , గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, ప్రజలు, భక్తులు లాగారు. ఆలయ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారిపై స్వామివారి రథోత్సవం ఊరేగింపుగా సాగింది. గ్రామంలో వేలాది మంది భక్తులు గోవింద నామసర్మణంతో మొక్కులు తీర్చుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బొమ్మనహాళ్ ఎస్ఐ శ్రీరాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
ఆ ఎద్దు పొలంలో దిగితే..
రాయదుర్గం రూరల్: ఒంటెద్దు గొర్రు అని చిన్నచూపుచూడొద్దు.. తన ఎద్దు తలచుకుంటే జోడెద్దుల గొర్రునే తలదన్నుతుందని నిరూపించాడు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలానికి చెందిన వన్నూరుస్వామి. రాయదుర్గం మండలం కొంతానపల్లిలో ఆదివారం ఒంటెద్దు గొర్రుతో ఏకంగా 12 ఎకరాల్లో వేరుశెనగ విత్తనాలు విత్తి ఔరా అనిపించాడు. సూర్యుడు ఉదయించి.. అస్తమించే లోపు ఈ పని పూర్తిచేశాడు. సాధారణంగా జోడెద్దుల నాలుగుసాళ్ల గొర్రుతో రోజుకు ఏడు నుంచి ఎనిమిది ఎకరాల్లో విత్తనం వేయవచ్చు. అయితే.. వన్నూరుస్వామి ఒంటెద్దు గొర్రుతోనే 12 ఎకరాల్లో విత్తనం వేయడాన్ని రైతులు ఆసక్తిగా గమనించారు. ఈ దృశ్యాన్ని పరిసర ప్రాంత రైతులు, రహదారి గుండా వెళ్లే ప్రజలు కూడా ఆసక్తిగా తిలకించారు.