సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు.
కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ)
Comments
Please login to add a commentAdd a comment