‘అప్పు తిరిగి కట్టొద్దు.. డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేసేస్తా..’ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ఈ వాగ్దానాలే తమ ఆర్థిక స్వావలంబనకు తూట్లు పొడిచిన బాణాలయ్యూయని డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. సాఫీబాటలో సజావుగా నడుస్తున్న బండిని ముళ్లబాటకు మళ్లించాయని మొత్తుకుంటున్నారు. ఆయన మాట నమ్మి, ఎంతో కొంత భారం తగ్గుతుందని ఆశించడమే నేరమైందని, అందుకు శిక్షగా తమ పరపతి ఇగిరిపోరుుందని వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆరాటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎడాపెడా ఇచ్చిన ఎన్నికల హామీలను నమ్మిన వారంతా ఇప్పుడు హతాశులవుతున్నారు. గ్రామాల్లో తమకు, బ్యాంకులకు ఆనవారుుతీగా వస్తున్న ‘రుణానుబంధాన్ని’ చావుదెబ్బ కొట్టింది బాబు రుణమాఫీ హామీయేనని రైతులు ఆక్రోశిస్తున్నారు. డ్వాక్రా మహిళలదీ అదే వ్యధ, అదే కథ. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించనందుకు జిల్లాలో మహిళా సంఘాల సభ్యులకు కొత్త రుణాలు కూడా పుట్టడం లేదు. అన్ని అర్హతలుండి కూడా కొన్ని సంఘాలు రుణం పొందలేకపోతున్నాయి.
ఇందుకు ఒకపక్క బ్యాంకుల సిబ్బంది, మరోవైపు అధికారులు ఎవరి కారణాలు వారు చెబుతున్నారు. ఇచ్చిన రుణం చెల్లించకుంటే కొత్త రుణం ఇవ్వలేమని బ్యాంకులు చేతులెత్తేస్తున్నాయి. రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు వాగ్దానం జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న రుణప్రణాళికను తీవ్రంగా దెబ్బతీసింది. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డ్వాకా సంఘాలకు నిర్దేశించిన రుణ ప్రణాళికలు, వాస్తవంగా మహిళల చేతికి దక్కిన పరపతిని నిశితంగా పరిశీలిస్తే పై కారణాలన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. రుణాల కోసం డ్వాక్రా మహిళలు తిరగని బ్యాంకు అంటూ లేదు. ఏ బ్యాంకుకు వెళ్లినా ‘రుణం ఎంత ఉంది. ఎంత చెల్లించా’రనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చివరకు పాత బకాయిలు చెల్లిస్తే కొత్త రుణాల సంగతి పరిశీలిస్తామంటూ బ్యాంకులు తప్పించేసుకుంటున్నాయి.
లక్ష్యం.. రూ.1,730 కోట్లు..
ఇప్పటికి ఇచ్చింది.. రూ.66 కోట్లు
జిల్లాలో 81,218 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటి పరిధిలో సుమారు 8,52,789 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల్లో ఉన్న ప్రతి సభ్యురాలికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,523 సంఘాలకు రూ.1,730.70 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 2,076 సంఘాలకు రూ.66.40 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ‘ఏడిచే పిల్లాడి చేతిలో బెల్లం ముక్క పెట్టిన’ మాదిరిగా కూడా లేదని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నాలుగున్నర నెలలు గడుస్తున్నా.. లక్ష్యంలో కనీసం 5 శాతం కూడా ఇవ్వలేకపోయారని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అదే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ 11,326 సంఘాల పరిధిలోని మహిళలకు రూ.367.25 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. అంతకు ముందు సంవత్సరం 2013-14లో 26,363 డ్వాక్రా సంఘాలకు రుణ లక్ష్యం రూ.687.88కోట్లుగా నిర్దేశించారు. ఆ ఆర్థిక సంవత్సరంలో అంతకు మించే రుణాలు ఇవ్వగలిగారు. ఆ ఆర్థిక సంవత్సరంలో 29,705 సంఘాలకు రూ.900.80 కోట్ల రుణాలు మంజూరు చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయూసంగా అధిగమించేశారు. అంటే రుణాల మంజూరులో ఆ ఏడాది 131 శాతం లక్ష్యాన్ని సాధించారు. తర్వాత సంవత్సరం చతికిలబడడానికి కారణం రుణాలు మాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత వాగ్దానమే.
వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రరుుస్తున్న మహిళలు
‘ఒక్క పైసా కట్టొద్దు.. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలన్నీ మాఫీ చేస్తా’మన్న ‘బాబు’ ఎన్నికలప్పుడు భారీ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా రుణాలు మాఫీ కాదని చెప్పకుండానే కాదన్నారు. జిల్లాలోని 71 వేల సంఘాలు పరిధిలో 2015 ఫిబ్రవరి నాటికి డ్వాక్రా రుణాలు రూ.1,200 కోట్లు పై మాటేనంటున్నారు. రుణమాఫీని అటకెక్కించి ఒక్కొక్క సంఘానికి లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ క్రమంలోనే సంఘంలో సభ్యుడికి రూ.10 వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ అంటూ మూలనిధిని సంఘాల ఖాతాలకు జమచేశారు. కానీ అదే సమయంలో రుణమాఫీకి మంగళం పాడారని మహిళలు మండిపడుతున్నారు. 79 వేల డ్వాక్రా సంఘాలకు సర్కార్ మూలనిధి రూపంలో రూ.790 కోట్లు మంజూరు చేసింది. ఈ సొమ్మంతా బ్యాంకుల్లో తమ పేరున జమ అయిందే తప్ప చిల్లిగవ్వ ప్రయోజనం లేదని మహిళలు మథనపడుతున్నారు. కొత్తరుణాలు పుట్టక మహిళలు బయట వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఇప్పటికైనా మేలుకొని రుణాలను వేగవంతం చేయాలని మహిళలు కోరుతున్నారు.
డ్వాక్రాపై పేలిన తూటా..
Published Thu, Aug 13 2015 1:54 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement