సిటీ, పల్లెవెలుగు, లగ్జరీ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ లేదు
ప్రయాణికుల భద్రత పట్టించుకోని సంస్థ
లబ్బీపేట : ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖ వంతం అనేది నినాదానికే పరిమితమైంది. బస్సుల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రథమ చికిత్సా పరికరాలనైనా ఏర్పాటు చేయడం లేదు. దీంతో అకస్మాత్తుగా వేసే బస్సు బ్రేకులతో ప్రమాణికులు ముందుకు పడి చిన్న చిన్న రక్త గాయాలకు గురైన సమయంలో ప్రథమ చికిత్స కూడా చేయలేని దయనీయ స్థితి నెలకొంది. సిటీలో తిరిగే బస్సుల్లోనే కాదు...గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు.. దూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో సైతం ఫస్ట్ ఎయిడ్ కిట్‌ల ఏర్పాటును గాలికొదిలేసారు. పండిట్ నెహ్రూ బస్టేషన్‌లో శనివారం ‘సాక్షి’ పలు బస్సులను పరిశీలించగా ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి.
50 శాతం బస్సుల్లో కిట్‌లే లేవు
బస్టాండ్‌లో వేర్వేరు డిపోలకు చెందిన 30 బస్సులను పరిశీలించగా వాటిలో సగం బస్సులకు అసలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లే కనిపించలేదు. ఆర్టీసీతో పాటు పలు అద్దె బస్సులదీ అదే పరిస్థితి. కనీసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లను ఏర్పాటు చేయడమే సంస్థ మరిచిందంటే ప్రయాణికుల రక్షణకు ఏ మాత్రం చర్యలు తీసుకుంటుందో అర్ధమవుతుంది. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేసి, దానిలో కాటన్, గాజుగుడ్డతో పాటు, టించర్, సిజర్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను అందుబాటులో ఉంచాలి. కానీ ఏ ఒక్కబస్సులోనూ కూడా వైద్యానికి సంబంధించి సామగ్రి కాదుకదా. 50 శాతం బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కూడా లేవు
బాక్స్‌లున్నా..కిట్‌లు లేవు
బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నా అవి అలంకార ప్రాయంగానే వేలాడుతున్నాయి. వాటిలో ఒక్కదానిలో వైద్య సామగ్రి లేదు. వి జయవాడ-గుంటూరు ఏసీ నాన్‌స్టాప్ బస్సు ను పరిశీలించగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో నామ మాత్రంగా కాటన్‌ను ఉంచారు. అంతే ఏదో ఒకటి ఉంచాలని మొక్కుబడిగా వుంచినట్లు తెలుస్తోంది.
గుడివాడ- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా, ఫస్ట్ ఎయిడ్‌బాక్స్ ఉంది కాని ఫస్ట్ ఎయిడ్ సామగ్రి లేదు.మచిలీపట్నం.- విజయవాడ తిరిగే నాన్‌స్టాప్ బస్సును పరిశీలించగా పాడైన బ్యాండెడ్ లు మాత్రమే దర్శనమిచ్చారు. ఇతర సామగ్రి ఏమి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో కనిపించలేదు. నాగాయలంక తిరిగే పల్లెవెలుగు బస్సులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బ్యాక్స్‌లో గ్రీజు ప్యాకెట్‌లు..ఇతర సావమగ్రి ఉన్నాయి. ఇలా ఏ బస్సు చూసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉన్న దాఖలాలు లేవు. అంటే ప్రయాణికుల రక్షణను ఆర్టీసీ గాలికొదిలేసిందనే వెల్లడవుతోంది. పైకి మాత్రం సురక్షిత ప్రయాణం అంటూ ఊదరగొట్టే ప్రచారం చేస్తున్న ఆర్టీసీ సంస్థ ..ప్రథమ చికిత్స కిట్‌లనే విస్మరించడం పలు విమర్శలకు తావిస్తోంది.
హసన్‌కా హుకూం...తెరుచుకో శశీ
ఆర్టీసీ బస్సులోని ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు నెలల తరబడి తెరుచుకోవడంలేదని ప్రయాణికులు అంటు న్నారు. ఇందుకు అవి దుమ్ముకొట్టుకుపోయి ఉండడమే అని అంటున్నారు. బాక్స్‌లయితే ఉన్నాయి కాని, అందులో ఫస్ట్ ఎయిడ్ ఉందో లేదో తెలియదని చెబుతున్నారు. తెరుచుకోని ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లును చూసి మూడు దశాబ్దాలనాటి ఆలీబాబా 40దొంగలు సినిమాలోని అప్పటి ప్రేక్షకుల నాలుకపై నాట్యం చేసిన డైలాగ్‌ను గుర్తుచేసు కుంటున్నారు. ‘హసన్‌కా హుకూం.. ఖుదాకీ కసం...తెరుచుకో శశీ’ అని అంటే కూడా బస్సుల్లోని ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు తెరుచుకోవని చలోక్తి విసురుతున్నారు.