విజయనగరంఫోర్ట్: రబీ సీజన్ ఆరంభమైంది. కొంతమంది రైతులు ఇప్పటకే విత్తనాలు కొనుగోలు చేశారు. మరి కొంతమంది ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. విత్తనాలు నాణ్యతపైనే పంట దిగుబడి అధారపడి ఉంటుంది. విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించకపోతే నష్ట పోవలసి వస్తుందని వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఎ.నాగభూషణరావు తెలిపారు. విత్తనాలు సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆయన వివరించారు. గత 5, 6 సంవత్సరాల్లో పత్తి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, మిర్చి , కాయగూరల్లో ప్రైవేటు విత్తన ఉత్పత్తి సంస్థలు అనేక రకాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. అయితే వాటిని సాగుచేసినప్పుడు ఆయా సంస్థలు ప్రకటించిన దిగుబడి కన్నా తక్కువ దిగుబడి రావడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ విత్తనాల తేడా: విత్తనాలలో ప్రభుత్వ పరంగా విడుదలయ్యేవి, ప్రైవేటుపరంగా విడదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వపరంగా రూపొందించిన రకాలు నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేటు సంస్థలు రూపొందించిన విత్తనాలను నాన్ నోటిఫైడ్ పేరిట విడుదల చేస్తారు.
నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలు మొదలైనవి 1966 నాటి విత్తన చట్టం, 1983 నాటి విత్తన నియంత్రణ పరిధిలోకివస్తాయి. విత్తనాలు నాణ్యతాప్రమాణాలకు అనుణంగా లేటనట్లయితే ఉత్పత్తిదారులు, పంపిణీ దారులు చట్టరీత్యా శిక్షార్హులు.
విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మండల వ్యవసాయఅధికారి లేదా సంబంధిత వ్యవసాయ సహాయ సంచాలకుల సలహా మేరకు ఆయా ప్రాంతాలకు అనువైన నోటిఫైడ్ లేదా నాన్ నోటిఫైడ్ రకాలను కొనుగోలు చేయాలి.
ప్రైవేటు కంపెనీలు ప్రచురించిన ఆకర్షణీయమైన కరపత్రాలను నమ్మకూడదు. ఆయా రకాలను వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు ప్రయోగత్మకంగా సాగుచేసినప్పుడు సత్ఫలితాలు వస్తే ప్రభుత్వం వాటిని ఎంపిక చేసుకోవాలి.
వ్యవసాయశాఖ జారీ చేసిన లెసైన్సు ఉన్నవారి నుంచి మాత్రమే విత్తనాలను కొనుగోలుచేయాలి. లెసైన్సు లేకుండా , బిల్లులు ఇవ్వకుండా తక్కువ ధరలతో, నాణ్యత లేని విత్తనాలను అమ్మడానికి కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. వాటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి.
సంబంధిత అధీకృత డీలరు వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలే తప్ప ఇతరులు వద్ద కొనుగోలు చేయకూడదు. ఎలాంటి అనుమానమున్నా వెంటనే నేరుగా జిల్లా సంయుక్త సంచాలకులు లేదా కమిషనర్ కార్యాలయానికి తెలియపర్చాలి.
కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లను , వాటికి కుట్టిన లేబుళ్లను విత్తనాలను వినియోగించిన తరువాత భద్రపరచుకోవాలి. ఇవి మున్ముందు విత్తనాలకు సంబంధించిన నాణ్యత సమస్యలకు , పరిహారం పొందడానికి ముఖ్యమైన అధారంగా ఉంటాయి.
ఒక వేళ ఏదైనా విత్తనం, నాణ్యత ప్రమాణాలకు తగినట్టు లేకపోతే... అంటే తక్కువ మొలకశాతం, జన్యుస్వచ్ఛత లేకపోవడం, కల్తీ వంటి వాటిని గమనించినట్లుయితే సంబంధిత వ్యవసాయ అధికారికి తెలియజేయాలి. వారి సలహా మేరకు తదుపరి చర్య తీసుకోవాలి.
విత్తన కొనుగోలులో జాగ్రత్త అవసరం
Published Wed, Nov 25 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement