
కేంద్ర హామీల్లో స్పష్టతనివ్వండి
నేడు మోడీని కలవనున్న వైఎస్సార్‌సీపీ బృందం
విభజన హామీల్లో స్పష్టత కోరనున్న జగన్
పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై విజ్ఞప్తి
ఎన్నికల్లో ఘన విజయానికి అభినందనలు
హైదరాబాద్: త్వరలో దేశ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోడీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన లోక్‌సభ సభ్యుల ప్రతినిధి బృందం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం కలవనుంది. మధ్యాహ్నం ఢిల్లీలో మోడీని కలిసి, తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయనుంది. దాంతోపాటు, రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లోని అస్పష్టతను తొలగించాలని ఆయనకు విజ్ఞప్తి చేయనుంది. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయం అందించాలని కోరనుంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మరింతగా అండదండలు అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
అలాగే ఆ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటికీ కేంద్రం ప్రత్యేకంగా సాయం చేయాలని అర్థించనున్నారు. అలాగే తెలంగాణలో జలయజ్ఞం ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని మోడీకి వైఎస్సార్‌సీపీ బృందం విజ్ఞప్తి చేయనున్నట్టు ఆదివారం పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. విభజన సందర్భంగా కేంద్రం, అప్పటి ప్రధానమంత్రి ప్రకటించిన ప్యాకేజీలో స్పష్టత లేదని, దానిపై స్పష్టతనివ్వడంతో పాటు మరింత సహాయం అందించాలని కోరనున్నట్టు పేర్కొంది.