పోలీసుల అదుపులో సిరిగోల్డ్ ఎండీ
ఉదయగిరి: తప్పించుకు తిరుగుతున్న సిరిగోల్డ్ ఎండీ వేల సుందరాన్ని బుధవారం ఉదయగిరిలో పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ ఏజెంట్లు, లబ్ధిదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతికి చెందిన వేల సుందరం, సత్యవేడు వాసి సుధాకర్, ఒంగోలు నివాసి వెంకయ్య గతంలో అగ్రిగోల్డ్‌లో పనిచేసేవారు. అనంతరం వీరు విడిపోయి 2007లో సిరిగోల్డ్‌ను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ జిల్లాలోని కావలి, గూడూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లా పామూరు, అద్దంకి, గిద్దలూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తిరుపతి, కడప, విజయవాడ, చెన్నై, గుల్బర్గాల్లో 20కి పైగా బ్రాంచీలు ఏర్పాటు చేసి పది వేలమందికి పైగా ఏజెంట్లను నియమించుకుని రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.120 కోట్లుపైగా వసూలు చేశారు.
పలు జిల్లాలలో ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, పొలాలను బినామీ పేర్లపై కొనుగోలు చేశారు. జిల్లాలోని నెర్ధనంపాడులో వంద ఎకరాలు, మర్రిపాడు మండలంలో 20 ఎకరాలు, వాసిలిలో 50 ఎకరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. 2013 నవంబరులో బోర్డు తిప్పేశారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది.
ఎండీ ఎలా పట్టుబడ్డాడంటే..
ఒక్క సీతారామపురంలోనే 12 మంది ఏజెంట్లు రూ.1.20 కోట్లు పైగా సేకరించి సిరిగోల్డ్‌లో పెట్టుబడిగా పెట్టారు. సంస్థ మూసివేయడంతో లబ్ధిదారులంతా ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చారు. ఎండీ కోసం సీతారామపురం ఏజెంట్లు ఏడాదికిపైగా కాపుకాస్తున్నారు.
నెర్ధనంపాడుకు చెందిన భూములను అమ్మకానికి పెట్టారని, రిజిస్ట్రేషన్ చేసేందుకు సిరిగోల్డ్ ఎండీ సుందరం ఉదయగిరి వస్తున్నారని తెలుసుకున్న ఏజెంట్లు మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో కాపుకాశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దస్తావేజులపై సంతకం చేయించుకునేందుకు ఓ హోటల్‌లో ఉన్న వేల సుందరం వద్దకు సిబ్బంది తీసుకెళుతుండగా ఏజెంట్లు వెంబడించి వేల సుందరాన్ని పట్టుకున్నారు.
అనంతరం పోలీస్‌స్టేషన్‌కు లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై సీఐకి ఎస్‌ఐ విజయకుమార్ సమాచారం ఇచ్చారు. వేల సుందరాన్ని సీతారామపురం పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
మూడు రోజలు కాపు కాశాం
రోజువారీ పనిచేసుకొని జీవనం సాగించే నేను కమీషన్‌కు ఆశపడి ఏజెంట్‌గా చేరి రూ.4 లక్షలు వసూలుచేసి సిరిగోల్డ్‌లో పెట్టాం. తీరా తిరిగి చెల్లించే సమయానికి బోర్డు తిప్పేయడంతో బాధితులు మాపై ఒత్తిడి పెంచారు. ఎండీ వేల సుందరం కోసం ఏడాదినుంచి తిరుగుతూనే ఉన్నాం. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తాడని తెలుసుకొని మూడు రోజులుగా కాపుకాసి బుధవారం పట్టుకున్నాం. పోలీసులు న్యాయం చేసి మా డబ్బు మాకు ఇప్పించాలి. సుజాత, ఏజెంట్, సీతారామపురం
న్యాయం చేయాలి
సిరిగోల్డ్‌లో ఏజెంట్‌గా చేరి రూ.20 లక్షల డిపాజిట్లు సేకరించి ఇచ్చాను. సీతారామపురంలో రూ.1.2 కోట్లు సిరిగోల్డ్‌లో డిపాజిట్లు సేకరించాం. ఏడాదిన్నర క్రితం బోర్డు తిప్పేయడంతో మా బతుకులు బజారునపడ్డాయి. ఎండీని పట్టుకునేందుకు అనేక ఇబ్బందులుపడ్డాం. మా డబ్బు మాకు ఇప్పించాలి. వెంకటసుబ్బయ్య, ఏజెంట్, సీతారామపురం