SiriGold
-
సిరి మాయ
కావలి: ప్రజల అమాయకత్వాన్నే పెట్టుబడిగా మార్చుకున్న సిరిగోల్డ్ సంస్థ వారిని నిలువునా ముంచింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌గా కోట్లాది రూపాయలు వసూలు చేసి నెత్తిన టోపీ పెట్టేసింది. డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి దోచుకున్న కోట్ల రూపాయలను బినామీల పేర్లతో రియల్ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బుకట్టిన జనం మాత్రం మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. సిరిగోల్డ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ జనవరిలోనే వెలుగులోకి తెచ్చింది. పోలీసు అధికారులు అప్పుడే స్పందించి ఉంటే కొంతమేరైనా ప్రయోజనం దక్కివుండేదని బాధితులు వాపోతున్నారు. తిరుపతికి చెందిన వేలా సుందరం మరో నలుగురితో కలిసి 2008లో తిరుపతి కేంద్రంగా సిరిగోల్డ్ ఫామ్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభించారు. డిపాజిట్లకు రియల్ఎస్టేట్ వ్యాపారం ద్వారా అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రజలను ఆకర్షించారు. రాష్ట్రంలో 17 శాఖలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు కూడా వ్యాపారాన్ని విస్తరించారు. కావలి బ్రాంచ్ ద్వారా సుమారు 2 వేల మంది నుంచి దాదాపు రూ.5 కోట్ల వరకు డిపాజిట్లుగా సేకరించారు. మొత్తం అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి సుమారు రూ.95 కోట్లు సేకరించినట్లు కావలి ఒకటో పట్టణ పోలీసుల విచారణలో వెల్లడైంది. డిపాజిట్ల సేకరణలో వేలా సుందరం స్నేహితుడైన ఓ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలపై పోలీసుల విచారణ జరుగుతోంది. సిరిగోల్డ్కు అనుబంధంగా మరో ఏడు సంస్థలు పని చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. పొద్దుతిరుగుడు, నిమ్మ, మామిడి, సపోటా, యూకలిఫ్టస్ తదితర పంటలను పండించడం, పెద్ద నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణాలను చేయడం, హెర్బల్ ఉత్పత్తులు, కూరల్లో వాడే పసుపు, కారం, మసాలా తదితర ఉత్పత్తులు, వాటర్ ప్లాంట్, తదితరాల తయారీ ఆ సంస్థల ద్వారా జరుగుతుందని జనాన్ని నమ్మించారు. ఈ విషయంలో ఎక్కువగా ఏజెంట్లను వాడుకున్నారు. కంపెనీ నిర్వాహకుల మాటలు విన్న ఏజెంట్లు కమీషన్‌కు కక్కుర్తిపడి ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసుకుని డిపాజిట్లు సేకరించారు. కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన ఓ ఏజెంట్ అయితే, కంపెనీ చెల్లింపులు ఆపితే తన ఆస్తులు అమ్మయినా కడుతానని నమ్మబలికాడు. అలా చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఆయనపై బోగోలు మండలానికి చెందిన వారు కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసివున్నారు. ఏడాది క్రితమే నిలిచిన చెల్లింపులు కాలపరిమితి తీరిన బాండ్లకు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను గత ఏడాది జూన్ నుంచే సిరిగోల్డ్ నిర్వాహకులు నిలిపేశారు. ఆందోళనకు గురైన డిపాజిట్‌దారులు ఏజెంట్లను నిలదీశారు. తిరుపతిలోని కేంద్ర కార్యాలయం నుంచి నగదు రావడం ఆలస్యమవుతుందని తాత్సారం చేస్తూ గడిపారు. ఫలితం లేకపోవడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. డిపాజిట్లుగా సేకరించిన రూ.95 కోట్లలో రూ.20 కోట్లు నగదు సేకరణ, నిర్వహణ కోసం ఏజెంట్లు, ఉద్యోగులకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో కంపెనీ ఎండీ ఒప్పుకున్నారు. ఆస్తులను పరిశీలించగా సుమారు 172 ఎకరాలు ఆ సంస్థ పేరున ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.10 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.65 కోట్లతో బినామీల పేరుతో బోగోలు, ఉదయగిరి, గూడూరు, ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాయమాటలకు మోసపోయాం : దుగ్గిరాల భూలక్ష్మి, కడనూతల సిరిగోల్డు కంపెనీ నిర్వాహకులు చెప్పిన మాయమాటలను విని మోసపోయాను. రోజుకు రూ.20 లెక్కన పాలసీని కట్టాను. కాలపరిమితి తీరిన తర్వాత డబ్బులడిగితే జూలై నుంచి ఇవ్వలేదు. నాకు రూ.6, 500 రావాలి. ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పిందని తెలిసింది. కట్టిన డిపాజిట్ ఇప్పించాలి: ఎల్. లలితమ్మ, బోగోలు మూడేళ్ల పాటు డబ్బులు కట్టాను. కావలిలోని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా రెండు రోజుల్లో ఇస్తామని ఏడాది పాటు తిప్పారు. ఇప్పుడేమో కంపెనీని మూసేశారని చెబుతున్నారు. పేదలమైన మాకు పోలీసులు డబ్బులు తిరిగి ఇప్పించాలి. -
కటకటాల్లోకి మోసగాడు
ఎట్టకేలకు సిరిగోల్డ్ ఎండీ అరెస్ట్‌ను చూపిన పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేసినట్లు వెల్లడి కావలి: ఐదురోజుల క్రితంలో బాధితులు పట్టుకుని అప్పగించిన సిరిగోల్డ్ ఎండీ వేలా సుందరంను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎట్టకేలకు ప్రకటించారు. బుధవారం ఉదయగిరిలోని ఓ లాడ్జిలో సుందరం చిక్కగా ఆదివారం అరెస్ట్ చేసినట్లు కావలి రూరల్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లా కోర్సులో గోల్డ్‌మెడలిస్ట్ అయిన సుందరం మరికొందరితో కలిసి ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం. తాను ఎండీగా, రమేష్ బాబు, జి.సుబ్రహ్మణ్యం, వెం కయ్య, పి.సుధాకర్ డెరైక్టర్లుగా సిరిగోల్డ్ ఫామ్స్ అండ్ ఎస్టేట్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థను తిరుపతి కేంద్రంగా 2008లో ప్రారంభించారు. కొంతకాలానికి జి.సుబ్రహ్మణ్యం సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ సంస్థకు రాష్ట్రంలో 17 బ్రాంచి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కోలార్, గుల్బర్గా, తమిళనాడులోని తిరువళ్లూరుకు కూడా వ్యాపారాన్ని విస్తరించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రోజువారి, నెలవారీ వాయిదాల్లో నగదు చెల్లిస్తే మూడు నుంచి ఐదేళ్లలో 18 శాతం వడ్డీ కలిపిస్తామని ప్రచారం చేశారు. నగదు అవసరం లేదనుకుంటే సంస్థ నిర్వహించే రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు రిజిస్టర్ చేస్తామని నమ్మించారు. ఇలా రూ.95 కోట్లు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భూములు కొనుగోలు చేశారు. మోసం బయటపడిందిలా.. కాలపరిమితి తీరిన డిపాజిట్లకు సంబంధించి నగదు చెల్లించకపోవడంతో ఖాతాదారులు సిరిగోల్డ్ బ్రాంచ్ కార్యాలయాల్లోని సిబ్బందిని నిలదీయసాగారు. తిరుపతిలోని ప్రధాన కార్యాలయం నుంచి డబ్బు వస్తేనే చెల్లిస్తామని సిబ్బంది కొంతకాలం పాటు నచ్చజెబుతూ వచ్చారు. రోజులు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడంతో సిరిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కావలి ఒకటో పట్టణ, రెండో పట్టణ, రూరల్, నెల్లూరు మూడో నగరం, ఆత్మకూరు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎండీ, డెరైక్టర్లు పరారయ్యారు. డిపాజిట్‌దారులు మళ్లీ కేసులు పెట్టకుండా బాపట్లకు చెందిన ప్రవీణ్దాస్ను ఆర్థిక సలహాదారుడిగా నియమించుకున్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఆయనతో కార్యకలాపాలు నిర్వహించసాగారు. కంపెనీ నష్టాల్లో ఉందని, పొలాలను అందరికీ కొద్దికొద్దిగా ఇవ్వగలమని తమ ప్రతినిధులతో చెప్పించసాగారు. ఎంతో కొంత వసూలు చేసుకుందామని భావించిన పలువురు తక్కువ విలువ కలిగిన పొలాలను తీసుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 30 ఎకరాల స్థలాన్ని డిపాజిట్‌దారుల్లో పలువురికి రిజిస్టర్ చేశారు. ఇలా నలుగురు ప్రవీణ్దాస్ తో కలిసి ప్రజలను మోసం చేస్తు న్నట్టు పోలీసుల దృష్టికి రావడంతో వారిపై నిఘా పెట్టారు. బోగోలు మండలం కొండబిట్రగుంటలోని మూడు ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నంలో ఉండగా వేలా సుందరంను ఆదివారం అరెస్ట్ చేశారు. డెరైక్టర్లలో ఒకరైన రమేష్‌ను గతంలోనే అరెస్ట్ చేశారు. బి.సుధాకర్, వెంకయ్య కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు. న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్ వేలా సుందరం న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. బీఎల్, ఎంఎల్ చేసిన సుందరం రెండింటిలోనూ యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటి గోల్డ్‌మెడల్ పొందాడు. రియల్ ఎస్టేట్ భూమ్‌పై ఆశలుపెట్టుకుని ప్రజల నుంచి నగదు డిపాజిట్లు సేకరించి పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. సంస్థ ఇబ్బందులను గమనించిన తన పేరున వరదయ్యపాళెంలో ఉన్న ఇళ్లను ముందుగానే సోదరుడు కుమారుడి పేరున రిజిస్టర్ చేశారని పోలీసుల దృష్టికి వచ్చింది. -
పోలీసుల అదుపులో సిరిగోల్డ్ ఎండీ
ఉదయగిరి: తప్పించుకు తిరుగుతున్న సిరిగోల్డ్ ఎండీ వేల సుందరాన్ని బుధవారం ఉదయగిరిలో పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ ఏజెంట్లు, లబ్ధిదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతికి చెందిన వేల సుందరం, సత్యవేడు వాసి సుధాకర్, ఒంగోలు నివాసి వెంకయ్య గతంలో అగ్రిగోల్డ్‌లో పనిచేసేవారు. అనంతరం వీరు విడిపోయి 2007లో సిరిగోల్డ్‌ను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ జిల్లాలోని కావలి, గూడూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లా పామూరు, అద్దంకి, గిద్దలూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తిరుపతి, కడప, విజయవాడ, చెన్నై, గుల్బర్గాల్లో 20కి పైగా బ్రాంచీలు ఏర్పాటు చేసి పది వేలమందికి పైగా ఏజెంట్లను నియమించుకుని రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.120 కోట్లుపైగా వసూలు చేశారు. పలు జిల్లాలలో ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, పొలాలను బినామీ పేర్లపై కొనుగోలు చేశారు. జిల్లాలోని నెర్ధనంపాడులో వంద ఎకరాలు, మర్రిపాడు మండలంలో 20 ఎకరాలు, వాసిలిలో 50 ఎకరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. 2013 నవంబరులో బోర్డు తిప్పేశారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఎండీ ఎలా పట్టుబడ్డాడంటే.. ఒక్క సీతారామపురంలోనే 12 మంది ఏజెంట్లు రూ.1.20 కోట్లు పైగా సేకరించి సిరిగోల్డ్‌లో పెట్టుబడిగా పెట్టారు. సంస్థ మూసివేయడంతో లబ్ధిదారులంతా ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చారు. ఎండీ కోసం సీతారామపురం ఏజెంట్లు ఏడాదికిపైగా కాపుకాస్తున్నారు. నెర్ధనంపాడుకు చెందిన భూములను అమ్మకానికి పెట్టారని, రిజిస్ట్రేషన్ చేసేందుకు సిరిగోల్డ్ ఎండీ సుందరం ఉదయగిరి వస్తున్నారని తెలుసుకున్న ఏజెంట్లు మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో కాపుకాశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దస్తావేజులపై సంతకం చేయించుకునేందుకు ఓ హోటల్లో ఉన్న వేల సుందరం వద్దకు సిబ్బంది తీసుకెళుతుండగా ఏజెంట్లు వెంబడించి వేల సుందరాన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై సీఐకి ఎస్ఐ విజయకుమార్ సమాచారం ఇచ్చారు. వేల సుందరాన్ని సీతారామపురం పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మూడు రోజలు కాపు కాశాం రోజువారీ పనిచేసుకొని జీవనం సాగించే నేను కమీషన్‌కు ఆశపడి ఏజెంట్‌గా చేరి రూ.4 లక్షలు వసూలుచేసి సిరిగోల్డ్‌లో పెట్టాం. తీరా తిరిగి చెల్లించే సమయానికి బోర్డు తిప్పేయడంతో బాధితులు మాపై ఒత్తిడి పెంచారు. ఎండీ వేల సుందరం కోసం ఏడాదినుంచి తిరుగుతూనే ఉన్నాం. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తాడని తెలుసుకొని మూడు రోజులుగా కాపుకాసి బుధవారం పట్టుకున్నాం. పోలీసులు న్యాయం చేసి మా డబ్బు మాకు ఇప్పించాలి. సుజాత, ఏజెంట్, సీతారామపురం న్యాయం చేయాలి సిరిగోల్డ్‌లో ఏజెంట్‌గా చేరి రూ.20 లక్షల డిపాజిట్లు సేకరించి ఇచ్చాను. సీతారామపురంలో రూ.1.2 కోట్లు సిరిగోల్డ్‌లో డిపాజిట్లు సేకరించాం. ఏడాదిన్నర క్రితం బోర్డు తిప్పేయడంతో మా బతుకులు బజారునపడ్డాయి. ఎండీని పట్టుకునేందుకు అనేక ఇబ్బందులుపడ్డాం. మా డబ్బు మాకు ఇప్పించాలి. వెంకటసుబ్బయ్య, ఏజెంట్, సీతారామపురం -
సిరిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ సుందరం అరెస్ట్
నెల్లూరు: సిరిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సుందరంని ఉదయగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో సిరిగోల్డ్ మనీ స్కీం సంస్థను 2008లో స్థాపించారు. అతి కొద్ది కాలంలోనే వందలాది మంది ఏజంట్లు - లక్షకుపైగా ఖాతాదారులు - వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు. డిపాజిట్లు రెండేళ్లలో రెట్టింపవుతాయని చెప్పడంతో వేలాది మంది ఎగబడిమరీ కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. ఒక్కొక్కరు వేయి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేశారు. ఆర్బిఐ నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన ఈ సంస్థ కాలపరిమితి తీరినా డబ్బు చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళన చెందారు. ఆ తరువాత ఈ సంస్థకు చెందిన నెల్లూరు, కావలి, గూడూరు... బ్రాంచ్‌లను ఈ ఏడాది ప్రారంభంలో మూసివేశారు. సంస్థ మూతబడడంతో తాము ఘోరంగా మోసపోయామని బాధితులు బావురుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత సంస్థ డైరెక్టర్ రమేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో సీతారామపురంలో 2 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు సిరిగోల్డ్ ఎండి సుందరంపై ఆరోపణలు ఉన్నాయి. అనేక మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉదయగిరి పోలీసులు అతనిని ఈరోజు అరెస్ట్ చేశారు.