కావలి: ప్రజల అమాయకత్వాన్నే పెట్టుబడిగా మార్చుకున్న సిరిగోల్డ్ సంస్థ వారిని నిలువునా ముంచింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలే టార్గెట్‌గా కోట్లాది రూపాయలు వసూలు చేసి నెత్తిన టోపీ పెట్టేసింది. డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి దోచుకున్న కోట్ల రూపాయలను బినామీల పేర్లతో రియల్‌ఎస్టేట్ వెంచర్లు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి డబ్బుకట్టిన జనం మాత్రం మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. సిరిగోల్డ్ వ్యవహారాన్ని ‘సాక్షి’ జనవరిలోనే వెలుగులోకి తెచ్చింది. పోలీసు అధికారులు అప్పుడే స్పందించి ఉంటే కొంతమేరైనా ప్రయోజనం దక్కివుండేదని బాధితులు వాపోతున్నారు. తిరుపతికి చెందిన వేలా సుందరం మరో నలుగురితో కలిసి 2008లో తిరుపతి కేంద్రంగా సిరిగోల్డ్ ఫామ్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రారంభించారు. డిపాజిట్లకు రియల్‌ఎస్టేట్ వ్యాపారం ద్వారా అధిక వడ్డీ చెల్లిస్తామని ప్రజలను ఆకర్షించారు. రాష్ట్రంలో 17 శాఖలు ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు కూడా వ్యాపారాన్ని విస్తరించారు.
కావలి బ్రాంచ్ ద్వారా సుమారు 2 వేల మంది నుంచి దాదాపు రూ.5 కోట్ల వరకు డిపాజిట్లుగా సేకరించారు. మొత్తం అన్ని బ్రాంచ్‌ల్లో కలిపి సుమారు రూ.95 కోట్లు సేకరించినట్లు కావలి ఒకటో పట్టణ పోలీసుల విచారణలో వెల్లడైంది. డిపాజిట్ల సేకరణలో వేలా సుందరం స్నేహితుడైన ఓ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడి పాత్ర కూడా ఉందనే ఆరోపణలపై పోలీసుల విచారణ జరుగుతోంది. సిరిగోల్డ్‌కు అనుబంధంగా మరో ఏడు సంస్థలు పని చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు.
పొద్దుతిరుగుడు, నిమ్మ, మామిడి, సపోటా, యూకలిఫ్టస్ తదితర పంటలను పండించడం, పెద్ద నగరాలు, పట్టణాల్లో ఇంటి నిర్మాణాలను చేయడం, హెర్బల్ ఉత్పత్తులు, కూరల్లో వాడే పసుపు, కారం, మసాలా తదితర ఉత్పత్తులు, వాటర్ ప్లాంట్, తదితరాల తయారీ ఆ సంస్థల ద్వారా జరుగుతుందని జనాన్ని నమ్మించారు. ఈ విషయంలో ఎక్కువగా ఏజెంట్లను వాడుకున్నారు. కంపెనీ నిర్వాహకుల మాటలు విన్న ఏజెంట్లు కమీషన్‌కు కక్కుర్తిపడి ప్రధానంగా మహిళలను టార్గెట్ చేసుకుని డిపాజిట్లు సేకరించారు. కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన ఓ ఏజెంట్ అయితే, కంపెనీ చెల్లింపులు ఆపితే తన ఆస్తులు అమ్మయినా కడుతానని నమ్మబలికాడు. అలా చెప్పిన వ్యక్తి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. ఆయనపై బోగోలు మండలానికి చెందిన వారు కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసివున్నారు.
ఏడాది క్రితమే నిలిచిన చెల్లింపులు
కాలపరిమితి తీరిన బాండ్లకు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను గత ఏడాది జూన్ నుంచే సిరిగోల్డ్ నిర్వాహకులు నిలిపేశారు. ఆందోళనకు గురైన డిపాజిట్‌దారులు ఏజెంట్లను నిలదీశారు. తిరుపతిలోని కేంద్ర కార్యాలయం నుంచి నగదు రావడం ఆలస్యమవుతుందని తాత్సారం చేస్తూ గడిపారు. ఫలితం లేకపోవడంతో బాధితులను పోలీసులను ఆశ్రయించారు. డిపాజిట్లుగా సేకరించిన రూ.95 కోట్లలో రూ.20 కోట్లు నగదు సేకరణ, నిర్వహణ కోసం ఏజెంట్లు, ఉద్యోగులకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో కంపెనీ ఎండీ ఒప్పుకున్నారు. ఆస్తులను పరిశీలించగా సుమారు 172 ఎకరాలు ఆ సంస్థ పేరున ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.10 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.65 కోట్లతో బినామీల పేరుతో బోగోలు, ఉదయగిరి, గూడూరు, ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోనూ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మాయమాటలకు మోసపోయాం : దుగ్గిరాల భూలక్ష్మి, కడనూతల
సిరిగోల్డు కంపెనీ నిర్వాహకులు చెప్పిన మాయమాటలను విని మోసపోయాను. రోజుకు రూ.20 లెక్కన పాలసీని కట్టాను. కాలపరిమితి తీరిన తర్వాత డబ్బులడిగితే జూలై నుంచి ఇవ్వలేదు. నాకు రూ.6, 500 రావాలి. ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పిందని తెలిసింది.
కట్టిన డిపాజిట్ ఇప్పించాలి: ఎల్. లలితమ్మ, బోగోలు
మూడేళ్ల పాటు డబ్బులు కట్టాను. కావలిలోని కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా రెండు రోజుల్లో ఇస్తామని ఏడాది పాటు తిప్పారు. ఇప్పుడేమో కంపెనీని మూసేశారని చెబుతున్నారు. పేదలమైన మాకు పోలీసులు డబ్బులు తిరిగి ఇప్పించాలి.
సిరి మాయ
Published Fri, Jul 18 2014 2:46 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement