ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రిటైర్డ్ నావికాదళ అధికారి బలరాజ్ దేశ్‌వాల్ (55) ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చోటు చేసుకున్న వివాదమే ఈ హత్యకు దారి తీసినట్టు సమాచారం. నిందితుడు దేశ్‌వాల్‌ను అతి సమీపంనుంచి కాల్చి చంపినట్టు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీనియర్ పోలీసుల సమాచారం ప్రకారం ద్వారకలోని సెక్టార్ 12 లోని అపార్ట్‌మెంటును దేశ్వాల్ అతని వ్యాపార భాగస్వాములు కలిసి నిర్మించారు. ఇక్కడ నిందితుడు ప్రదీప్ ఖోకర్ కూడా ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి అతను దేశ్‌వాల్‌కు 5 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆగ్రహంతో పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చి దేశ్‌వాల్‌తో వాగ్వివాదానికి దిగాడు.
ఈ సంఘర్షణలోఆవేశంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో దేశ్వాల్ నోట్లో బుల్లెట్ దూసుకు పోయిందని తెలిపారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశామని నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ద్వారకా డీసీపీ సంతోష్ కుమార్ మీనా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment