కటకటాల్లోకి మోసగాడు
ఎట్టకేలకు సిరిగోల్డ్ ఎండీ అరెస్ట్‌ను చూపిన పోలీసులు
ఆదివారం అరెస్ట్చేసినట్లు వెల్లడి
కావలి: ఐదురోజుల క్రితంలో బాధితులు పట్టుకుని అప్పగించిన సిరిగోల్డ్ ఎండీ వేలా సుందరంను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఎట్టకేలకు ప్రకటించారు. బుధవారం ఉదయగిరిలోని ఓ లాడ్జిలో సుందరం చిక్కగా ఆదివారం అరెస్ట్ చేసినట్లు కావలి రూరల్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లా కోర్సులో గోల్డ్‌మెడలిస్ట్ అయిన సుందరం మరికొందరితో కలిసి ఈ వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం. తాను ఎండీగా, రమేష్ బాబు, జి.సుబ్రహ్మణ్యం, వెం కయ్య, పి.సుధాకర్ డెరైక్టర్లుగా సిరిగోల్డ్ ఫామ్స్ అండ్ ఎస్టేట్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థను తిరుపతి కేంద్రంగా 2008లో ప్రారంభించారు. కొంతకాలానికి జి.సుబ్రహ్మణ్యం సంస్థ నుంచి తప్పుకున్నారు. ఈ సంస్థకు రాష్ట్రంలో 17 బ్రాంచి కార్యాలయాలు ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని కోలార్, గుల్బర్గా, తమిళనాడులోని తిరువళ్లూరుకు కూడా వ్యాపారాన్ని విస్తరించారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రోజువారి, నెలవారీ వాయిదాల్లో నగదు చెల్లిస్తే మూడు నుంచి ఐదేళ్లలో 18 శాతం వడ్డీ కలిపిస్తామని ప్రచారం చేశారు. నగదు అవసరం లేదనుకుంటే సంస్థ నిర్వహించే రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్లాట్లు రిజిస్టర్ చేస్తామని నమ్మించారు. ఇలా రూ.95 కోట్లు సేకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భూములు కొనుగోలు చేశారు.
మోసం బయటపడిందిలా..
కాలపరిమితి తీరిన డిపాజిట్లకు సంబంధించి నగదు చెల్లించకపోవడంతో ఖాతాదారులు సిరిగోల్డ్ బ్రాంచ్ కార్యాలయాల్లోని సిబ్బందిని నిలదీయసాగారు. తిరుపతిలోని ప్రధాన కార్యాలయం నుంచి డబ్బు వస్తేనే చెల్లిస్తామని సిబ్బంది కొంతకాలం పాటు నచ్చజెబుతూ వచ్చారు. రోజులు గడుస్తున్నా నగదు చెల్లించకపోవడంతో సిరిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కావలి ఒకటో పట్టణ, రెండో పట్టణ, రూరల్, నెల్లూరు మూడో నగరం, ఆత్మకూరు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎండీ, డెరైక్టర్లు పరారయ్యారు. డిపాజిట్‌దారులు మళ్లీ కేసులు పెట్టకుండా బాపట్లకు చెందిన ప్రవీణ్‌దాస్‌ను ఆర్థిక సలహాదారుడిగా నియమించుకున్నారు. అజ్ఞాతంలో ఉంటూ ఆయనతో కార్యకలాపాలు నిర్వహించసాగారు. కంపెనీ నష్టాల్లో ఉందని, పొలాలను అందరికీ కొద్దికొద్దిగా ఇవ్వగలమని తమ ప్రతినిధులతో చెప్పించసాగారు. ఎంతో కొంత వసూలు చేసుకుందామని భావించిన పలువురు తక్కువ విలువ కలిగిన పొలాలను తీసుకునేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 30 ఎకరాల స్థలాన్ని డిపాజిట్‌దారుల్లో పలువురికి రిజిస్టర్ చేశారు. ఇలా నలుగురు ప్రవీణ్‌దాస్ తో కలిసి ప్రజలను మోసం చేస్తు న్నట్టు పోలీసుల దృష్టికి రావడంతో వారిపై నిఘా పెట్టారు. బోగోలు మండలం కొండబిట్రగుంటలోని మూడు ఎకరాల భూమిని అమ్మే ప్రయత్నంలో ఉండగా వేలా సుందరంను ఆదివారం అరెస్ట్ చేశారు. డెరైక్టర్లలో ఒకరైన రమేష్‌ను గతంలోనే అరెస్ట్ చేశారు. బి.సుధాకర్, వెంకయ్య కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చేపట్టారు.
న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్
వేలా సుందరం న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. బీఎల్, ఎంఎల్ చేసిన సుందరం రెండింటిలోనూ యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటి గోల్డ్‌మెడల్ పొందాడు. రియల్ ఎస్టేట్ భూమ్‌పై ఆశలుపెట్టుకుని ప్రజల నుంచి నగదు డిపాజిట్లు సేకరించి పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. సంస్థ ఇబ్బందులను గమనించిన తన పేరున వరదయ్యపాళెంలో ఉన్న ఇళ్లను ముందుగానే సోదరుడు కుమారుడి పేరున రిజిస్టర్ చేశారని పోలీసుల దృష్టికి వచ్చింది.