ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణారెడ్డి(50), లక్ష్మిదేవి(44) దంపతులు ఈ నెల 16న విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కంచెపై 11కేవీ విద్యుత్ తీగ తెగిపడటంతో పొలంలో పనులు చేసుకుంటున్న దంపతులిద్దరూ మృతి చెందారు.
విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన శేఖర్ (18) ఈ నెల 17న విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వ్యవసాయ పనులు ముగించుకొని తోట నుంచి ఇంటికెళుతుండగా మార్గ మధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు.
అనంతపురం టౌన్ : విద్యుత్ తీగలు ప్రజల పాలిట యమ పాశాలుగా మారాయి. కరెంట్ తీగలు ఎక్కడ ఎప్పుడు తెగిపడతాయో.. ఎంత మంది ప్రాణాలు బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లనే నేటికీ కొనసాగిస్తున్నారు. కాలపరిమితి దాటినా వాటిని మార్చడం లేదు. చిన్నపాటి గాలులకే తెగిపడుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి ఇప్పటి వరకూ అధికారికంగా 25 మంది మృతి చెందారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 50 దాటి ఉంటుంది.
జిల్లాలో వ్యవసాయ బోర్లకు, గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడానికి 48,723 కిలోమీటర్ల మేర లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్‌టీ లైన్లు 28,106 కి.మీ, 11కేవీ లైన్లు 18,034 కి.మీ, 33 కేవీ లైన్లు 2,583 కి.మీ మేర విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అటవీభూములు, పొలాల మీదుగా వెళుతున్న విద్యుత్‌లైన్ల నిర్వహణ కుంటుపడింది. వాస్తవానికి విద్యుత్ తీగలకు 25 ఏళ్ల గడువు (లైఫ్) ఉంటుంది. అవి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్తంభాల ఏర్పాటు దగ్గర నుంచి అన్నింట్లోనూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 50 అడుగులకు ఒకటి చొప్పున విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 100-120 అడుగుల దూరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల తీగలు కిందకు వేలాడుతున్నాయి. ఎర్త్ అవుతున్నాయి.
మెటీరియల్ కొరత : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి, ప్రమాదాలను అరికట్టడానికి మెటీరియల్ కొరత అధికారులను వే ధిస్తోంది. వ్యవసాయ కనెక్షన్ల కోసం 32 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. వీరికి కనెక్షన్లు మంజూరు చేయాలంటే ఇప్పట్లో కష్టసాధ్యంగా కన్పిస్తోంది. ప్రతి ఐదు కనెక్షన్లకు ఒకటి చొప్పున 7 వేల ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు లాగడానికి దాదాపు 40 వేల వరకూ స్తంభాలు అవసరమవుతాయి.
దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో కొంతమంది రైతులు అనధికారికంగానే విద్యుత్ వినియోగిస్తున్నారు. దీని వల్ల విద్యుత్ తీగలపై అదనపు భారం పడుతోంది. 11 కేవీ విద్యుత్ వైరుకు 100 హెచ్‌పీ మాత్రమే వాడాలి. ఆపై భారం పడితే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలి. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు అధికంగా పడుతున్నా, పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో రైతులు వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
యమపాశాలు
Published Mon, Jul 21 2014 2:17 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement