కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: జిల్లాలో పత్తి సాగు జోరందుకుంది. ధరలు ఆశాజనకంగా ఉండడం.. పంటసాగుకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో రైతులు పత్తిపై దృష్టిసారించారు. దీనికితోడు పంట సాగుకు పెద్దగా కష్టం ఉండకపోవడంతో రైతన్నలు రెట్టించిన ఉత్సాహంతో బోరుబావుల కింద సాగు చేపట్టారు.
జిల్లాలో ప్రస్తుతం బోరుబావుల కింద చింతకొమ్మదిన్నె, కమలాపురం, పెండ్లిమర్రి, వల్లూరు, వీరపునాయునిపల్లె, వేంపల్లె, వేముల, తొండూరు, లింగాల, బి మఠం, పోరుమావిళ్ల, బద్వేలు మండలాల్లో అధికంగాను, మిగతా మండలాల్లో తక్కువగాను సాగు చేస్తున్నారు.
దాదాపు 75 వేల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 30 వేల ఎకరాల్లో పత్తి పంటసాగైందని అధికారులు తెలిపారు. జిల్లాలో గత ఏడాది 85,235 ఎకరాలు పత్తి పంటను సాగు చేశారు. ఈ పంట నుంచి 7,02,340 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో ప్రారంభంలో క్వింటా రూ.3800లు ఉండేది. రానురాను క్వింటా రూ. 4800లుగా ధర పలుకుతోందని రైతులు తెలిపారు.
దళారులు, వ్యాపారులు కుమ్మక్కు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న వాస్తవ ధరలను దళారులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కుమ్మక్కై అసలు ధరను ఇవ్వడం లేదని రైతు లు వాపోతున్నారు. క్వింటా రూ 5100 ధర పలుకుతుండగా దాన్ని రూ. 4800లు మాత్రమే ప్రకటింపజేసి రైతులను నిలువునా ముంచుతున్నారని రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్లో ఉన్న ధర రైతులకు అందితే లాభాలు చవిచూస్తామని రైతులు అంటున్నారు.
వేరుశనగ కంటే పత్తే మేలు..
పత్తి సాగుకు దుక్కులు,పశువుల ఎరువులు, సేంద్రీయ ఎరువులు, పత్తిగింజల కొనుగోలు తదితరవాటికి ఎకరానికి రూ. 22 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు తెలిపారు. మార్కెట్‌లో క్వింటా ధర రూ. 5000లు పలికితే, ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి ఉంటుందని ఆ ప్రకారం రూ. 40 వేలు వస్తుందని రైతులు తెలిపారు. దీంతో పెట్టుబడులు పోను రూ. 18 వేలు ఆదాయం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పత్తి పంటే అదుకుంటోందని రైతులు తెలిపారు.