రైతుకు శాపం
తోటపల్లిగూడూరు : అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. లెవీకి పోనూ మిగిలిన బియ్యానికి సంబంధించి పర్మిట్లు ఇవ్వడం లేదని మిల్లర్లు కొన్నిరోజులుగా అధికారుల మీద ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాక మిల్లర్లకు చెందిన బియ్యం లారీలను భారీగా అధికారులు ఇటీవల వెంకటాచలం సమీపంలో పట్టుకుని సీజ్ చేశారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన మిల్లర్లు ధాన్యం కొనుగోలును అర్ధంతరంగా నిలిపివేశారు.
గిట్టుబాటుకాని ధర
ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరి సాగవుతోంది. అందులో ఇప్పటికే 20 శాతం వరికోతలు పూర్తయి, నూర్పులు అనంతరం ధాన్యం మిల్లర్లకు కూడా చేరింది. ఓ వైపు 1010 రకానికి సంబంధించి పుట్టికి రూ.12వేలకు తగ్గకుండా రైతులకు చెల్లించాలని అధికారులు మిల్లర్లను ఆదేశిస్తూ వస్తున్నారు. కానీ మిల్లర్లు మాత్రం రూ.10,500లకు మించి రైతులకు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆరుగాలాలు కష్టించి పండించిన రైతన్నలు గిట్టుబాటు ధర లభించక లబోదిబోమంటున్నారు. ఇది ఇలా ఉంటే నాలుగు రోజులుగా అధికారులు, మిల్లర్లకు మధ్య తలెత్తిన వివాదంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలును నిలిపివేశారు. దీంతో కోతలు పూర్తయి విక్రయాలకు సిద్ధంగా ఉంచిన ధాన్యం కల్లాల్లో
దిక్కుమొక్కులేకుండా పడి ఉన్నాయి. అసలే వర్షాకాలం.. వానలు పడితే కల్లాల్లో ఉన్న ధాన్యపు రాసుల్లో గింజ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మిల్లర్లపై ఆధారపడకుండా నేరుగా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం మండలంలోని పలు ప్రాంతాల్లో దాదాపు ఐదు వేల పుట్లు వరకు ధాన్యం కల్లాల్లోనే ఉన్నట్లు తెలిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో పాలకులు వెంటనే ఓ నిర్ణయానికి రాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.