తణుకు : మీ దగ్గర డ్రైవింగ్ లెసైన్స్ ఉందా.. వాహనానికి సంబంధించి సీ బుక్, ఇతర రికార్డులన్నీ ఉన్నాయా.. అవన్నీ ఉంటే పర్వాలేదు. అవి లేకుండా వాహనం నడుపుతూ రోడ్డెక్కితే బుక్కయిపోతారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నారా...? అయితే తస్మాత్ జాగ్రత్త. పార్టీకి వెళ్లి తక్కువ మోతాదులో అయినా మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నారా. మీ డ్రైవింగ్ లెసైన్సు రద్దు చేయడానికి అధికారులు ఎక్కడిక్కడే మోహరించి ఉంటారు. నిరంతర రహదారి భద్రత పేరుతో ఇప్పుడు రవాణా, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్లర్లు, సహాయ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లతోపాటు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిబంధనల్ని ఉల్లంఘించే వారిపై చర్యలకు సిద్ధమయ్యారు.
రవాణా శాఖ కమిషనర్ ఆదే శాలతో..
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రెండ్రోజలు హడావుడి చేసే అధికారులు తర్వాత చేతులు దులుపుకోవడం ఇటీవల పరిపాటిగా మారింది. స్పెషల్ డ్రైవ్ పేరుతో నెలకు ఒకటి, రెండుసార్లు రహదారుల వెంట తనిఖీలు నిర్వహిస్తూ, పరిమితికి మంచి ప్రయాణికులను చేరవేసినా.. సరైన పత్రాలు లేకపోయినా.. మద్యం సేవించి వాహనం నడిపినా సంబంధిత వాహన చోదకులకు జరిమానా విధించేవారు.
పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రహదారులపై నిరంతర భద్రత, నిఘా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు పోలీసు, రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల హైదరాబాద్ నుంచి 13 జిల్లాల డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు, ప్రయాణికులను చేరవేసే ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలతోపాటు ఆటోలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతోపాటు మద్యం తాగి వాహనాలు నడిపేవారు గతంలో ఎన్నిసార్లు దొరికితే అన్ని పర్యాయాలు కోర్టుకు హాజరుపరచడం, జరిమానా విధించడం జరిగేది. ప్రస్తుతం ఒకే వ్యక్తి మూడు పర్యాయాలు మద్యం సేవించి పట్టుబడితే అక్కడిక్కడే డ్రైవింగ్ లెసైన్సు రద్దు చేసే అధికారాన్ని ప్రాంతీయ రవాణాశాఖ అధికారులకు (ఆర్టీవో) కట్టబెట్టారు. మరోవైపు అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపే వ్యక్తులపై దృష్టి సారించి చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందుకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ జిల్లా ఉప రవాణా కమిషనర్ ఎన్.శ్రీదేవి ఉత్తర్వులు ఇచ్చారు.
ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 8 బృందాలను నియమించారు. ఎవరెవరు ఏయే రూట్లలో తనిఖీలు నిర్వహించాలనేది కూడా నిర్ధేశించారు. ఈ బృందాలు నిత్యం గస్తీ తిరుగుతూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 11వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ బృందాలు పోలీసు అధికారులతో కలసి రహదారుల వెంబడి గస్తీ తిరుగుతారు. ఎప్పటికప్పుడు నమోదు చేసిన కేసుల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు.. అక్కడినుంచి రాష్ట్రస్థాయి అధికారులకు నివేదిక అందజేయాల్సి ఉంటుంది.
ఇక నిత్య తనిఖీలు
Published Thu, Mar 5 2015 2:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement