- పోలీసుల భయంతో పరుగులు
- కాళంగినదిలో పడి వ్యక్తి మృతి
- ఆలస్యంగా వెలుగులోకి...
చేనిగుంట(తడ): కోడిపందేలపై ఆ వ్య క్తికి ఉన్న ఆసక్తి చివరకు ప్రాణాన్నే బలి తీసుకుంది. పందేల స్థావరంపై పోలీ సులు దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో కాళంగినదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నాయుడుపేట బాలాజీనగర్‌కు చెందిన చిట్టేటి సుకుమార్(45) ఆటోడ్రైవర్‌గా జీవనం సా గిస్తున్నాడు. కోడిపందేలపై ఉన్న ఆసక్తితో మరో వ్యక్తితో కలిసి వినాయకచవితి రోజున టాటా ఏస్ ట్రాలీలో చేని గుంట సమీపంలోని పొలాల్లోకి వచ్చా డు.
ఇంతలో పందేల స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఆందోళనకు గురైన సుకుమార్ తనతో వచ్చిన వ్యక్తితో కలిసి ట్రాలీలో పారిపోయేందుకు ప్రయత్నిం చాడు. వాహనం ఓ చోట పొలాల్లో ఇరుక్కుపోవడంతో దిగి పరుగుతీశారు. ఆ రోజు పందేలకు సంబంధించి ఎవరూ పట్టుబడకపోవడంతో పోలీసులు నాలుగు ఆటోలతో పాటు టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకుని వచ్చేశారు. అయితే పండగ రోజు నుంచి సుకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. సమాచారాన్ని బంధువులకు అందించడంతో వారు వివిధ ప్రాంతాల్లో ఆరా తీశారు.
ఈ క్రమంలో సుకుమార్ కోడిపందేల వద్దకు వెళ్లాడని తెలియడంతో ఆదివారం చేనిగుంట పరిసర ప్రాంతాల్లో గాలించారు. కాళంగినదిలో మృతదేహం తేలుతూ కనిపించడంతో దుస్తుల ఆధారంగా గుర్తుపట్టి, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అబ్దుల్ రజాక్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు. మృతదేహం ఉబ్బిపోయి ఉండడంతో ఘటనా స్థలంలోనే తడ వైద్యాధికారి ఎన్.కిశోర్ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నాయుడుపేటలో విషాదఛాయలు
నాయుడుపేటటౌన్: చిట్టేటి సుకుమార్ మృతితో ఆయన నివాసం ఉంటున్న నాయుడుపేటలోని పాతవెంకటగిరి రోడ్డు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. వినాయక చవితి రోజు తమతో సరదాగా గడిపిన తండ్రి ఇక లేడనే విషయాన్ని ఆయన పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుడికి తల్లి బుజ్జమ్మ, భార్య రమణమ్మతో పాటు తొమ్మిదో తరగతి చదివే కుమార్తె మౌనిక, ఆరోతరగతి చదువుతున్న కుమారుడు చరణ్ ఉన్నారు.
ప్రాణం తీసిన ‘కోడిపందెం’
Published Mon, Sep 1 2014 4:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement