సాక్షి, విశాఖపట్నం: మద్యం దుకాణాల నిర్వహణకు వ్యాపారులు కరువు కావడం ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధానంగా నగర శివారు ప్రాంతాల్లోని షాపులు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. మారిన పరిస్థితు ల్లో లాభాలు తగ్గిపోవడం ఒక కారణమైతే అప్‌సెట్ ధర అధికంగా ఉండడం కూడా వ్యాపారులు ముందుకు రాకపోవడానికి కారణం. జిల్లాలో 406 మద్యం దుకాణాలుండగా ఇంకా 89 షాపులు లెసైన్స్‌దారుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇందులో సగం వరకు షాపులు గత ఏడాది లాటరీలో ఎవరో ఒకరు దక్కించుకున్నవే. లెసైన్స్ రెన్యువల్‌కు వీరు ముందుకు రాకపోవడంతో గత ఏడాది మిగిలిపోయిన, ఈ ఏడాది రెన్యువల్ కాని షాపులు మొత్తం 89కి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆగస్టు 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మూడో తేదీన లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని పేర్కొన్నారు. తీరా శుక్రవారం సాయంత్రం బాక్స్ తెరిచి చూసిన ఎక్సైజ్ అధికారులు షాకయ్యారు. కేవలం రెండే రెండు దరఖాస్తులు వచ్చాయి. గాజువాక పరిధిలోని లంకెలపాలెం, పెందుర్తి పరిధిలోని చీమలాపల్లి దుకాణాలకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. పోటీ లేకపోవడంతో శనివారం అధికారులు, వ్యాపారుల సమక్షంలో ఆ రెండు దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించేశారు. రూ.64 లక్షల చొప్పున అప్‌సెట్ ప్రైస్ వసూలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆదివారం నుంచి వారికి లెసైన్సులిచ్చేసినట్టేనని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామచంద్రరావు ‘సాక్షి’కి తెలిపారు. మిగతా దుకాణాల పరిస్థితి ప్రభుత్వానికి నివేదించినట్లు చెప్పారు.
మరో రెండు ప్రభుత్వ ఔట్‌లెట్లు?
జిల్లా వ్యాప్తంగా ఇంకా 87 దుకాణాలకు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వమే ఔట్‌లెట్లు ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కంచరపాలెం, పెందుర్తి ప్రాంతాల్లో ఔట్‌లెట్లు నడుస్తున్నాయి. మరో రెండు యూనిట్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. వీటి నిర్వహణకు కూడా సిబ్బంది కావాలి. దీంతో సాధ్యాసాధ్యాల్ని దృష్టిలో పెట్టుకుని కొత్త వాటిని ప్రారంభించేయోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.