సాక్షి, కరీంనగర్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల(బీఆర్‌జీఎఫ్)తో చేపట్టిన పనుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉపాధిహామీ పథకం తరహాలో సామాజిక తనిఖీ నిర్వహించాలని భావిస్తోంది. సామాజిక తనిఖీల విధివిధానాలను త్వరలో రూపొందించనుంది. ఈ నెల 11న హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో దీనికి సంబంధించి ప్రాథమికంగా చర్చ జరిగింది. ఇందులో తెలంగాణ జిల్లాలకు చెందిన జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపిక చేసిన ఎంపీడీవోలు, సర్పంచులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనులకు, బీఆర్‌జీఎఫ్ పనులకు మధ్య ఉన్న తేడాలను బట్టి తనిఖీలు ఎలా నిర్వహించాలి, ఈ తనిఖీలను ఎవరితో చేయించాలి, గ్రామసభల నిర్వహణ ఎలా ఉండాలి తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
ఆయా జిల్లాల్లో వెనుక బడిన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను మూడు స్థాయిల్లో ఖర్చు చేశారు. జిల్లా, మండల పరిషత్‌లకు, గ్రామపంచాయతీ, మున్సిపల్ ప్రాంతాలకు వాటి వాటా మేరకు నిధులు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టిన పనులను జిల్లా ప్రణాళిక సంఘం(డీపీసీ) ఆమోదించాలి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనందువల్ల డీపీసీ ఉనికిలో లేదు.
ఫలితంగా మూడేళ్లగా అధికారులే నిధులను వినియోగిస్తున్నారు. బీఆర్‌జీఎఫ్ తొలి ఐదేళ్ల ప్రణాళిక కింద జిల్లాకు రూ.120 కోట్టు మంజూరయ్యాయి. రెండవ ఐదేళ్ల ప్రణాళికలో గత సంవత్సరం జిల్లాకు రూ.29 కోట్ల నిధులు వచ్చాయి. ఈ యేడాది రూ.35 కోట్లు మంజూరయ్యాయి. గత ఆరేళ్లలో జిల్లాలో బీఆర్‌జీఎఫ్ ద్వారా రూ.150కోట్లతో పనులు జరిగాయి. ఈ పనులు సరిగా జరిగాయా, అసలు మొదలే కాని పనులు ఏమైనా ఉన్నాయా, జరిగిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయా, ఎక్కడయినా నిధులు పక్కదారి పట్టాయా అన్నది గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తనిఖీ ఇలా..
ఉపాధిహామీ పనులపై నిర్వహించినట్టే బీఆర్‌జీఎఫ్ పనులకు సంబంధించి కూడా గ్రామసభలను నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో గ్రామానికి ఇద్దరు విద్యావంతులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుని తనిఖీలు ఎలా చేయాలో శిక్షణ ఇస్తారు. వారు ఊళ్లలో సభలను నిర్వహించి గ్రామంలో బీఆర్‌జీఎఫ్ కింద చేసిన పనుల జాబితాలను ప్రకటిస్తారు. ఆ పనులు జరిగాయా, ఏమైనా అక్రమాలు ఉన్నాయా అనే వివరాలను గ్రామస్తుల నుంచి తీసుకుంటారు.
మండలస్థాయిలోనూ ఇదేవిధంగా పరిశీలన జరుపుతారు. తనిఖీలో వెలుగుచూసిన నిధుల మళ్లింపు, అక్రమాల వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. పూర్తిస్థాయిలో విధివిధానాలను రూపొందించిన అనంతరం సామాజిక తనిఖీ ఎప్పడు ప్రారంభించాలన్నది స్పష్టమవుతుంది. ఇందుకు కనీసం రెండునెలల సమయం అవసరమని అధికారులు భావిస్తున్నారు. బీఆర్‌జీఎఫ్ నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి. ప్రజాప్రతినిధులున్న సమయం నుంచే ఇలాంటి విమర్శలు వచ్చాయి. సామాజిక తనిఖీలు జరిగితే ఈ అక్రమాలు బట్టబయలవుతాయన్న భయం అప్పటి నేతల్లో వణుకు పుట్టిస్తోంది.
అక్రమాలపై మూడోకన్ను
Published Sat, Oct 19 2013 5:14 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement