{పజా సమస్యలు పట్టించుకోవడంలేదు
ముఖ్యమంత్రి మెప్పుకోసం వెంపర్లాడుతున్నారు
మంత్రి సభలో కలెక్టర్‌పై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫైర్
ఎమ్మెల్యే నారాయణస్వామి సైతం మండిపాటు
చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సీఎం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి చర్చించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధుల పట్ల నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆది వారం పీవీకేఎన్ కళాశాల ఆవరణలో జరిగిన దళిత-గిరిజన సాధికారిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు సమక్షంలో జరిగిన ఈ సదస్సులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కే.నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. తొలుత చెవిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సంధానకర్తగా వ్యవహరించాల్సిన కలెక్టర్ నియంతగా మారారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగడం లేదని, సమాచారం కావాలని కలెక్టర్‌కు లేఖరాస్తే సమాధానం ఇవ్వకుండా నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు, నియమావళినే కలెక్టర్ పాటించకపోతే ఎలా అని వేదికపై తన పక్కనే ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించారు.
ఇలా అయితే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలని మంత్రి రావెల కిషోర్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులతో ఎంతగా గొడవపడితే అన్ని మార్కులు సీఎం వద్ద వస్తాయని కలెక్టర్ భావిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ విధానం మంచిది కాదని, తీరుమార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్ని పథకాలు పెట్టినా అవి సరిగా అమలు కావడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థికంగా ఎదుగుదల లేకపోతే దళితులు సామాజికంగా, రాజకీయంగా ఎలా అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నారాయణస్వామి మట్లాడుతూ అవినీతిపరులైన అధికారులకు కలెక్టర్ సిద్ధార్థజైన్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 90 శాతం అవినీతి ఉందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నా కలెక్టర్ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్‌కుమార్, సత్యప్రభ, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, మేయర్ అనూరాధ, కలెక్టర్ సిద్ధార్థజైన్, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడారు.
నియంతలా కలెక్టర్
Published Mon, Feb 23 2015 1:08 AM | Last Updated on Tue, Oct 30 2018 4:13 PM
Advertisement